Begin typing your search above and press return to search.

విశాఖ‌లో తెలుగు సినిమా హ‌బ్ పై మ‌రోసారి చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   19 Oct 2021 10:30 AM GMT
విశాఖ‌లో తెలుగు సినిమా హ‌బ్ పై మ‌రోసారి చ‌ర్చ‌
X
ఏపీ- తెలంగాణ డివైడ్ త‌ర్వాత ప్ర‌థ‌మంగా చ‌ర్చించుకున్న‌ది టాలీవుడ్ ఎటువైపు.. అన్న‌దే. తెలుగు సినీప‌రిశ్ర‌మ బీచ్ సొగ‌సుల విశాఖ‌కు త‌ర‌లి వెళుతుంద‌ని అంతా ఊహాగానాలు సాగించారు. అప్ప‌ట్లో ఆర్భాటం కూడా అలానే ఉండేది. కానీ కాల‌క్ర‌మంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం రాజ‌ధాని మీమాంశ‌లో ప‌డిపోవ‌డం అటుపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం సైతం ఇలాంటి డైల‌మాలోనే ఉండిపోవ‌డంతో టాలీవుడ్ పై దృష్టి సారించే అవ‌కాశం లేకుండా పోయింది.

అయినా ఇప్ప‌టికీ విశాఖ‌లో ఫిలింహ‌బ్ ని త‌యారు చేయాల‌న్న పంతం స్థానిక నాయ‌కుల‌కు ఉంది. వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ గా విశాఖ‌ను ప్ర‌క‌టించి భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ వ‌రకూ వేగంగా డీపీఆర్ ల‌ను రెడీ చేయించి భారీ గా రోడ్లు హైవేల‌తో బీచ్ టూరిజంతో మెట్రోతో అనుసంధానించే ప్లాన్ ని చేశారు. విశాఖ స్మార్ట్ సిటీలో టాలీవుడ్ అభివృద్ధిని కూడా ఒక భాగంగా ప్లాన్ చేశార‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

కానీ ప‌నుల్లోనే వేగం లోపించింద‌ని విమ‌ర్శ‌లున్నాయి. ఇకపోతే ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ లోనే ఉన్నా షూటింగులు ఎక్కువ శాతం జ‌రిగేది విశాఖ‌- అర‌కు బెల్ట్ లోనే. ఇక్క‌డ బీచ్ ల‌తో పాటు ప‌చ్చ‌ద‌నం అడ‌వులు అంద‌మైన లొకేష‌న్లు ద‌ర్శ‌క నిర్మాత‌ల్ని గొప్ప‌గా ఆక‌ర్షిస్తున్నాయి. అలాగే విశాఖ నుంచి రాజ‌మండ్రి విజ‌య‌వాడ వ‌ర‌కూ బోలెడ‌న్ని లొకేష‌న్లు ఉన్నాయి. గోదావ‌రి న‌దీ తీరాన ఎక్కువ‌గా షూటింగులు చేసేందుకు మ‌న ద‌ర్శ‌కులు ఇటీవ‌ల క‌థ‌ల్ని రాస్తున్నారు. కె.బాల‌చంద‌ర్ - గొల్ల‌పూడి మారుతిరావు- కె.విశ్వ‌నాథ్- దాస‌రి - జంధ్యాల వంటి వారు ఎక్కువ‌గా విశాఖ లొకేష‌న్ల‌కు ప్రాధాన్య‌త‌నిచ్చార‌ని చెబుతుంటారు. ఇప్ప‌టికీ తెలుగు సినిమాలు స‌హా ఒడియా .. హిందీ సినిమాల కోసం విశాఖ‌- అర‌కు బెల్ట్ ని ఆశ్ర‌యిస్తున్నార‌న్న స‌ర్వేలు ఉన్నాయి. విశాఖ రామానాయుడు స్టూడియోస్ లో నిరంత‌రం షూటింగులు జ‌రుగుతున్నాయి.

ఇక భీమిలి కేంద్రంగా టాలీవుడ్ ని నెల‌కొల్పాల‌ని స్థానిక మంత్రి అవంతి శ్రీ‌నివాస్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌గానే ఉన్నారు. ఇంత‌కుముందు విశాఖ ఉత్స‌వ్ లో వైజాగ్ టాలీవుడ్ గురించి ఆయ‌న ప్ర‌స్థావించారు. ఇప్పుడు కూడా ఏపీ టాలీవుడ్ గురించి అవంతి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి. విశాఖలో జరిగిన ఓ స‌మావేశంలో ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టాలీవుడ్ షూటింగులు చేయాల‌ని.. క‌నీసం పాతిక శాతం అయినా ఇక్క‌డ జ‌రిగేలా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్లాన్ చేయాలి కోరారు. ఇక‌పోతే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం ఇటీవ‌ల టాలీవుడ్ పెద్ద‌ల డిమాండ్ల‌కు కొంత‌వ‌ర‌కూ దిగి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల విష‌య‌మై చ‌ర్చ‌లు సాగుతున్నాయి. లొకేష‌న్ ప‌ర్మిట్లు స‌హా ప్ర‌తిదీ సుల‌భ‌త‌రం చేస్తున్నామ‌ని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఐదో ఆట గురించి కూడా చ‌ర్చ‌లు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. మునుముందు విశాఖ కేంద్రంగా సినిమా ఇండ‌స్ట్రీతో పాటు టూరిజం హ‌బ్ ని.. ఐటీ హ‌బ్ ని అభివృద్ధి చేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం బ‌ల‌మైన ప్లానింగ్ తో సాగుతోంది. ఇప్ప‌టికే భీమిలి ప‌రిస‌రాల్లో సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ రికార్డింగ్ స్టూడియోని ఏర్పాటు చేసుకున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ప‌లువురు సినీప్ర‌ముఖులు ఈ పరిస‌రాల్లో స్థ‌లాల్ని కొనుక్కున్నారు. ఇక జ‌గ‌న్ ప్ర‌భుత్వం పారిశ్రామిక కారిడార్ గా విశాఖ‌- కాకినాడ బెల్ట్ ని ఎంచుకుని అటువైపు బీచ్ రోడ్ ల రూప‌క‌ల్ప‌న‌కు స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని తాజాగా క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. అలాగే భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ కోసం 2900 ఎక‌రాలు ఇప్ప‌టికే రైతుల నుంచి సేక‌రించార‌ని తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వ‌చ్చింద‌ని తాజాగా మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.