Begin typing your search above and press return to search.

రీల్ లైఫ్ లో విలన్... రియల్ లైఫ్ లో హీరో...!

By:  Tupaki Desk   |   5 May 2020 12:15 PM IST
రీల్ లైఫ్ లో విలన్... రియల్ లైఫ్ లో హీరో...!
X
కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా నిరుపేద‌ కుటుంబాలు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. చేతిలో ప‌నిలేక‌.. తినేందుకు తిండిలేక అర్ధాక‌లితో అల‌మ‌టిస్తున్నారు. వీరితో పాటు దేవాలయాలలో పూజలు చేసే పూజారులు, అర్చకులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఎల్లప్పుడూ భక్తులతో కళకళలాడే దేవాలయాలు కరోనా మహమ్మారి కారణంగా మూసివేయబడ్డాయి. దీంతో దేవాలయాలపై ఆధారపడి జీవించే వారి కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిపోయింది. కొంతమంది పూజారులు ఆన్లైన్ సేవలను అందిస్తున్నారు. కానీ ఇంటర్నెట్ మీద అవగాహన లేని వారు మాత్రం ఏ కార్యాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది చేయి చాచి రోడ్డు మీద బిక్షాటన చేస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధుడైన పేద బ్రాహ్మ‌ణుడు హైద‌రాబాద్‌ పరిధిలో రోడ్డుపైన యాచిస్తున్న ఫొటో పేప‌ర్లో వ‌చ్చింది. ఈ ఫొటో చూస్తే ప‌రిస్థితులు ఎంత ద‌య‌నీయంగా మారుతున్నాయో చెబుతుంది.

పేద బ్రాహ్మణుడు యాచించడం న్యూస్ చూసి సినీ నటుడు టార్జాన్ లక్ష్మీనారాయ‌ణ స్పందించారు. ఆయ‌న కూక‌ట్‌ప‌ల్లి హైదర్‌ నగర్‌ పరిధిలో ఉంటార‌ని తెలుసుకుని వెంట‌నే అక్క‌డికి వెళ్లి ఆ పేద బ్రాహ్మ‌ణుడి కుటుంబానికి మూడు నెలలకు స‌రిప‌డా సరుకులు.. రూ.25వేల ఆర్థిక సాయం ఇచ్చి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు టార్జాన్‌ ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఉపాధి కోల్పోయి యాచనతో కుటుంబ పోషణకు దిగిన నిరుపేద బ్రాహ్మణుడు హన్మంతరావుకు సినీ నటుడు టార్జాన్‌ లక్ష్మీనారాయణ నేనున్నానంటూ ఆదుకున్నాడు. ఈ సంద‌ర్భంగా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. ఆయ‌న‌ను స్ఫూర్తిగా తీసుకుని మ‌రికొంద‌రు కూడా సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు.