Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ: లచ్చిందేవికి ఓ లెక్కుంది

By:  Tupaki Desk   |   29 Jan 2016 10:11 AM GMT
సినిమా రివ్యూ: లచ్చిందేవికి ఓ లెక్కుంది
X
చిత్రం: లచ్చిందేవికి ఓ లెక్కుంది

నటీనటులు: నవీన్ చంద్ర - లావణ్య త్రిపాఠి - జయప్రకాష్ రెడ్డి - అజయ్ - సంపూర్ణేష్ బాబు - భద్రం - నర్రా శీను తదితరులు
సంగీతం: కీరవాణి
ఛాయాగ్రహణం: ఈశ్వర్
నిర్మాత: సాయిప్రసాద్ కామినేని
రచన - దర్శకత్వం: జగదీష్ తలసిల

‘ఎల్ ఓఎల్’ అనే షార్ట్ నేమ్ తో చాన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోంది ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమా. రాజమౌళి శిష్యుడు జగదీష్ తలసిల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా డిఫరెంట్ ప్రోమోలతో బాగానే ఆసక్తి రేపింది. మరి ఆ ఆసక్తికి తగ్గట్లే సినిమా ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

నవీన్ (నవీన్ చంద్ర) - దేవి (లావణ్య) త్రిపాఠి ఒకే బ్యాంకులో పని చేసే ఉద్యోగులు. ఐతే ఒకరంటే ఒకరికి పడదు. ఐతే వాళ్లు పని చేసే బ్యాంకులో ఉన్న అన్ క్లైమ్డ్ అకౌంట్లలోని డబ్బులు కాజేయడం కోసం ప్లాన్ వేసిన ఓ గ్యాంగుతో చేతులు కలుపుతాడు నవీన్. ఆ అకౌంట్ల గురించి పూర్తిగా తెలిసిన దేవి నుంచి వివరాలు తెలుసుకోవడానికి ఆమె మీద ప్రేమ నటిస్తాడు నవీన్. ఆ అకౌంట్ల డీటైల్స్ తెలుసుకుని వీళ్లు డబ్బులు కాజేసే సమయానికి బ్యాంకు మేనేజర్ సోమయాజులు (జయప్రకాష్ రెడ్డి) రంగంలోకి దిగుతాడు. అప్పుడేమైంది? చివరికి ఈ డబ్బులు ఎవరి సొంతమయ్యాయి? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ సినిమా ఆరంభంలోనే ‘మాస్కేస్కో మాస్కేస్కో..’ అనే ఓ పాట ఉంటుంది. సినిమాలో ఆ పాట ప్రాధాన్యం ఏంటన్నది పక్కనబెడితే.. సినిమా ఎలా ఉంది అన్నది ఈ పాట ద్వారా చెప్పేశారేమో అనిపిస్తుంది. ప్రోమోస్ ఉన్నంత వైవిధ్యంగా, ఆసక్తికరంగా సినిమా లేదు. ఆ ప్రోమోస్ ను కేవలం మాస్కు అనుకుంటే.. ఆ మాస్కు తొలగించి చూస్తే మనకు వేరే బొమ్మ కనిపిస్తుంది. గంటా 45 నిమిషాల షార్ట్ లెంగ్త్ కూడా మన సహనాన్ని పరీక్షిస్తుంది అంటే ఇక ఈ బొమ్మ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో.

క్రైమ్ కామెడీల్లో కథలన్నీ కూడా డబ్బులు కొట్టేయడం చుట్టూ తిరుగుతాయి. ఐతే హిందీలో ‘రేస్’ తరహా సినిమాలు వచ్చాక క్రైమ్ కామెడీల్లో ఓ పాయింట్ కామన్ అయిపోయింది. అదే.. క్యారెక్టర్లన్నీ ఒకరినొకరు మోసం చేసుకోవడం. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ కూడా ఈ సూత్రాల్ని ఫాలో అయిపోయిన సినిమానే. ఐతే ఈ తరహా సినిమాల్లో కథల్లో ఏమీ వైవిధ్యం కోరుకోరు ప్రేక్షకులు. కథ విషయంలో ముందే ఓ ప్రిపరేషన్ తో థియేటర్లకు వస్తారు. కథలో కంటే కథనంలో వారు వైవిధ్యం కోరుకుంటారు. థ్రిల్ మూమెంట్స్ ఎన్ని ఉన్నాయి.. అవి ఎంత ఆసక్తికరంగా ఉన్నాయి.. అన్నది చూస్తారు. తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుల్ని లీనం చేసి.. కథనంతో పాటు ట్రావెల్ చేసేలా చేయడంలోనే ఈ సినిమాల సక్సెస్ ఆధారపడి ఉంటుంది. స్క్రీన్ ప్లే ఈ చిత్రాలకు ప్రాణం. ఐతే మనం చర్చించుకుంటున్న సినిమాలో స్క్రీన్ ప్లేనే పెద్ద మైనస్ అయింది.

బ్యాంకుల్లో అన్ క్లైమ్డ్ అకౌంట్లను కొట్టేయడం అనే పాయింట్ నేపథ్యంలో కథ రాసుకోవడం బాగుంది. ఐతే ఆ పాయింట్ బాగుంటే సరిపోదు కదా.. దాని చుట్టూ ఉన్న కథనం, పాత్రల విషయంలోనూ వైవిధ్యం, ఆసక్తి ఉండేలా తీర్చిదిద్దుకోవడం ముఖ్యం. ఐతే లీడ్ పాయింట్ విషయంలో ఎగ్జైట్ అయిపోయినట్లున్నాడు రాజమౌళి శిష్యుడు జగదీష్ తలసిల. అన్నీ పైపైన రాసుకున్న పాత్రలు, పైపైన రాసుకున్న సన్నివేశాల కారణంగా సినిమాలో ప్రేక్షకుడు పెద్దగా ఇన్వాల్వ్ కాలేని పరిస్థితి. కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాన్ని సినిమాలో ప్రతి పాత్రా చాలా సిల్లీగా డీల్ చేస్తుంది. ఇలాంటి సినిమాల్లో పాత్రల మేధస్సు చూసి.. ప్రేక్షకుడు ఆశ్చర్యపోవాలి. కానీ తెరమీద పాత్రలు ప్రవర్తించే తీరు చూస్తే ప్రేక్షకుడికి చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఒక్క ఇంటర్వెల్ ముందు సీన్లో తప్పిస్తే సినిమాలో ఎక్కడా ఆసక్తి కలగలేదు.

ఆరంభం నుంచి సిల్లీ సిల్లీ సన్నివేశాలతో సాగే సినిమా.. ఇంటర్వెల్ ముందు మాత్రం కొంచెం ఆసక్తి రేపుతుంది. బ్యాంకులో జరుగుతున్న మోసాన్ని మేనేజర్ పసిగట్టి దాన్ని రివీల్ చేసే సీన్ సినిమాకు కీలకం. ఆ సన్నివేశం వరకు జగదీష్ బాగా డీల్ చేశాడు. అప్పటిదాకా జరిగిన తప్పుల్ని కూడా క్షమించేసి.. ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచుకుంటాడు ప్రేక్షకుడు. కానీ సెకండాఫ్ లో పేలవమైన ఫాంటసీ పాయింట్ చుట్టూ కథనాన్ని నడిపించి.. మళ్లీ సినిమా గాడి తప్పించేశాడు. చికాకు పుట్టించే దయ్యం వేషాలు, పాటలతో సినిమా గ్రాఫ్ బాగా పడిపోతుంది. ఇక ఆ తర్వాత వచ్చే ట్విస్టులు కానీ.. క్లైమాక్స్ లో హంగామా కానీ సినిమాను నిలబెట్టలేకపోయాయి.

సంపూ క్యారెక్టర్ చివర్లో వచ్చి చేసేదాన్ని కామెడీ అనాలో ఇంకేమనాలో తెలియదు. సినిమా సవ్యంగా సాగి ఉంటే ఈ పాత్ర చివర్లో కొసమెరుపులా ఉండేదేమో. ఐతే సినిమాలోని అనేక సిల్లీ వ్యవహారాల్లో ఇది ఇంకో సిల్లీ పాయింటులా అనిపిస్తుంది. ట్విస్టుల మీదే ఎక్కువ ఆధారపడ్డట్లు కనిపిస్తుంది తప్పితే.. ఆ ట్విస్టుల్ని ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయాడు జగదీష్.

నటీనటులు:

నవీన్ చంద్ర టాలెంటెడే కానీ.. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’లో అతడి పాత్ర తేలిపోయింది. సినిమాలో అతను ఎటూ కానివాడైపోయాడు. ప్రథమార్ధంలో అతణ్ని లీడ్ లో చూపించి.. ద్వితీయార్ధంలో పక్కకు నెట్టేశారు. హీరోయిన్ విషయంలో దీనికి రివర్స్. ప్రథమార్ధమంతా లావణ్యది ఏమీ లేదు. ఇక ద్వితీయార్ధంలో ఫాంటసీ యాంగిల్ తీసుకొచ్చి ఆమెను హైలైట్ చేద్దామని చూశారు. ఐతే ఆ సన్నివేశాలన్నీ చికాకు పెట్టించాయి. లావణ్య ఈ సినిమాలో ఏ రకంగానూ మెప్పించలేకపోయింది. ఉన్నంతలో జయప్రకాష్ రెడ్డి ఒక్కడు కాస్త ఎంటర్టైన్ చేశాడు. అజయ్, నర్రా శీను, భద్రం పెద్దగా చేసిందేమీ లేదు.

సాంకేతిక వర్గం:

కీరవాణి తన శైలికి భిన్నమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఐతే ఆయన చేసిన భిన్నమైన పాటలు సినిమాలో సింక్ కాలేదు. ద్వితీయార్ధంలో వచ్చే రెండు దయ్యం పాటలూ ప్రేక్షకుల్ని మరో రకంగా భయపెడతాయి. ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే పాట బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. ఈశ్వర్ ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు గొప్పగా ఏమీ లేవు. చాలా తక్కువ లొకేషన్లలో.. తక్కువ ఖర్చుతో సినిమా చుట్టేశారు. కథనంలో దమ్ముంటే ఈ విషయంలో అభ్యంతరాలుండేవి కావేమో కానీ.. అది లేనపుడే సమస్యగా అనిపిస్తుంది. దర్శకుడు జగదీష్ తలసిల తన గురువు రాజమౌళి బాటలో నడవకుండా ఓ క్రైమ్ కామెడీని ఎంచుకోవడం వరకు బాగానే ఉంది కానీ.. గురువులా పకడ్బందీ కథనాన్ని నడిపించడంలో, సన్నివేశాల్ని రక్తికట్టించడంలో మాత్రం విఫలమయ్యాడు.


చివరగా: లచ్చిందేవికి... ఓ లెక్కంటూ లేదు

రేటింగ్: ​2​/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre