Begin typing your search above and press return to search.

'కురుప్' ట్రైలర్: ఇండియాలోనే సుదీర్ఘ కాలం పరారీలో ఉన్న క్రిమినల్ కథ..!

By:  Tupaki Desk   |   3 Nov 2021 1:30 PM GMT
కురుప్ ట్రైలర్: ఇండియాలోనే సుదీర్ఘ కాలం పరారీలో ఉన్న క్రిమినల్ కథ..!
X
మ‌ల‌యాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు, స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌ 'ఓకే బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. 'మహానటి' తో మెప్పించారు. గతేడాది 'కనులు కనులను దోచాయంటే' సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ''కురుప్'' అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ తో పలకరించబోతున్నారు. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన భయంకరమైన క్రిమినల్‌ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

''కురుప్'' చిత్రానికి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌ సమర్పణలో డ్యూల్ వే ఫెరర్ ఫిలిమ్స్ మరియు ఎమ్ స్టార్ ఎంటెర్టైమెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో నవంబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వదిలిన ప్రచార చిత్రాలు - టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి.

ఈ క్రమంలో తాజాగా తెలుగు వెర్సన్ థియేట్రికల్ ట్రైలర్ ను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ఆవిష్కరించి చిత్ర బృందానికి విషెస్ అందించారు. ''కురుప్.. ఇండియాలో ఎక్కువ కాలం పరారీలో ఉన్న వ్యక్తి. అతను అసాధారణమైన క్రిమినలా లేదా యాక్సిడెంటల్ గా మోసగాడు అయ్యాడా అనేది నవంబర్ 12న సినిమా చూసి తెలుసుకోండి. కుంజికా దుల్కర్ సల్మాన్ కు నా బెస్ట్ విషెస్ పంపుతున్నాను'' అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.

ట్రైలర్ విషయానికొస్తే.. 'కురుప్' సినిమాని పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించమని.. ఇందులోని పాత్రలు సంఘటనలు కల్పితమనే డిస్క్లైమర్ తో ప్రారంభమైంది. దీన్ని బట్టి సుకుమార కురుప్ గురించి అందుబాటులో ఉన్న నివేదికల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు అర్థం అవుతోంది. కురుప్ విభిన్నమైన గెటప్స్ వేసుకొని నేరాలకు పాల్పడగా.. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు చూపించారు.

కురుప్ భారతదేశంలోనే ఎక్కువ కాలం వెతకబడిన క్రిమినల్‌ గా చెప్పబడ్డాడు. అదే సమయంలో ఎయిర్‌ ఫోర్స్‌ అధికారిగా శిక్షణ పొందుతున్నట్లు కూడా చూపించడంతో అతని పాత్ర తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కలుగుతోంది. దుల్కర్ సల్మాన్ లుక్‌ - పాత్ర చిత్రీకరణ 80ల కాలానికి తగ్గట్టుగా.. చాలా కొత్తగా ఉన్నాయి. దుల్కర్ ప్రేయసిగా తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల కనిపిస్తోంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంద్రజిత్ సుకుమారన్ - సన్నీ వేన్ కీలక పాత్రలో నటించారు.

పర్షియాలో తన పేరు మీదున్న లైఫ్ ఇన్సూరెన్స్ కోసం కురుప్ ఏదో ప్లాన్ చేయగా.. అతను తెలివి తక్కువ దద్దమ్మా లేదా అతి మేధావినా? అనే ప్రశ్న లేవనెత్తారు. నేర సామ్రాజ్యంలో ఎవరూ పట్టుకోలేని వ్యక్తిగా ఎదిగిన కురుప్ ను ఎలా పట్టుకోగలిగారు? అసలు పట్టుకున్నారా లేదా? అతను క్రిమినల్ గా మారడానికి గల కారణాలేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సుషీన్ శ్యామ్ సమకూర్చిన నేపథ్య సంగీతం.. 80స్ కాలాన్ని గుర్తు చేసేలా సినిమాటోగ్రాఫర్ నిమిస్ రవి అందించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ నెల 12న రాబోతున్న 'కురూప్' సినిమా ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.