Begin typing your search above and press return to search.

కుర్ర భామలకే సీనియర్ హీరోల ఓటు..!

By:  Tupaki Desk   |   16 Feb 2022 1:30 AM GMT
కుర్ర భామలకే సీనియర్ హీరోల ఓటు..!
X
సినిమా ఏదైనా సీనియర్ హీరోలకు జోడీగా హీరోయిన్లను ఎంపిక చేయడం అంత తేలికైన విషయం కాదు. మిగతావన్నీ ఎంత పక్కాగా కుదిరినా హీరోయిన్ ని ఫైనలైజ్ చేసే విషయంలో మాత్రం దర్శకనిర్మాతలకు తలప్రాణం తోక్కొస్తుంది. ఎందుకంటే హీరోల వయసుకు తగిన కథానాయికను ఎంపిక చేయకపోతే.. స్క్రీన్ మీద ఆ జంటను చూడటానికి ప్రేక్షకుడికి ఎబ్బెట్టుగా ఉంటుంది. అందులోనూ వారి మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటే అంతే సంగతులు.

ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలు నటించిన కొన్ని సినిమాల్లో ఆయన పక్కన హీరోయిన్ కూతురిలా ఉందని కామెంట్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే జోడీని సెలెక్ట్ చేసేప్పుడు ఫిలిం మేకర్స్ జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. అయినప్పటికీ మన సీనియర్ హీరోల సినిమాలను ఒక్కసారి గమనిస్తే.. అందరూ హాట్ గా ఉండే కుర్ర భామలకే మొగ్గు చూపుతున్నారని అర్థం అవుతుంది.

ఇటీవల బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న 'అఖండ' చిత్రంలో హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ కు నందమూరి బాలకృష్ణకు మధ్య వయసులో ఎంత వత్యాసం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతకముందు కూడా బాలయ్య తన సినిమాలో బక్కపలచగా ఉండే హీరోయిన్లను ఎంపిక చేసుకుంటూ వచ్చారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని సినిమాలో శృతి హాసన్ ను హీరోయిన్ గా ఎంచుకున్న సంగతి తెలిసిందే.

'సైరా నరసింహారెడ్డి' లో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటించిన మిల్కీ బ్యూటీ తమన్నానే.. ఇప్పుడు 'భోళా శంకర్' సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. 'ఖైదీ నెం. 150' చిత్రంలో ఆడిపాడిన చందమామ కాజల్ అగర్వాల్.. 'ఆచార్య' సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ క్రమంలో రాబోతున్న 'గాడ్ ఫాదర్' 'మెగా154' లతో పాటుగా వెంకీ కుడుముల సినిమాలో హీరోయిన్లుగా చిరంజీవి ఎవరికి ఓటేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

'మన్మథుడు 2' సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా పెట్టుకున్న అక్కినేని నాగార్జున.. గత రెండు సినిమాల్లో తన ఏజ్ కు తగిన సీనియర్ హీరోయిన్ లనే తీసుకున్నారు. త్వరలో రాబోయే 'ఘోస్ట్' సినిమాలో నాగ్ తో సోనాల్ చౌహన్ జతకట్టనుంది. 'దృశ్యం 2' 'నారప్ప' సినిమాల్లో తనకు సరైన జోడీని ఎంపిక చేసుకున్న విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు 'ఎఫ్ 3' చిత్రంలో తమన్నా భాటియాతో కలిసి నటిస్తున్నారు. సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న 'శేఖర్' సినిమాలో యంగ్ బ్యూటీ ముస్కాన్ హీరోయిన్ గా చేస్తోంది.

సీనియర్ హీరో రవితేజ మొదటి నుంచీ హాట్ గా యంగ్ హీరోయిన్లనే సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో నడుస్తున్న 'ఖిలాడీ' సినిమాలో డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి వంటి ఇద్దరు ముద్దుగుమ్మలతో మాస్ మహారాజా రొమాన్స్ చేసారు. వారితో లిప్ లాక్ కూడా చేసి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు 'ధమాకా' సినిమాలూ 'పెళ్లి సందD' ఫేమ్ శ్రీలీల ను కథానాయికగా ఎంపిక చేసారు. అలానే 'రావణాసుర' సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ - ఫరియా అబ్దుల్లా - మెగా ఆకాష్ - దక్షనాగార్కర్ - పూజిత పొన్నాడ వంటి అయిదుగురు హీరోయిన్లతో రవితేజ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

ఇలా సీనియర్ హీరోలందరూ తన ఇమేజ్‌ కి తగ్గట్టు మంచి స్క్రిప్ట్ ఎంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే.. తమతో జోడీ కట్టడానికి మాత్రం గ్లామరస్ యంగ్ హీరోయిన్స్‌ ని తీసుకుంటున్నారు. వెండి తెర మీద అందంగా కనిపించిన ఆడిపాడటం వరకు ఓకే కానీ.. మరీ లిప్ లాక్ సీన్స్ - ఇంటిమేట్ సన్నివేశాలు ఉంటేనే జనాలు చూడటం కష్టమవుతుంది.