Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : కుమారి 21ఎఫ్

By:  Tupaki Desk   |   20 Nov 2015 10:39 AM GMT
సినిమా రివ్యూ : కుమారి 21ఎఫ్
X
చిత్రం - కుమారి 21 ఎఫ్

నటీనటులు- రాజ్ తరుణ్ - హీబా పటేల్ - హేమ - నోయల్ తదితరులు
సంగీతం- దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం- రత్నవేలు
కథ - స్క్రీన్ ప్లే- సుకుమార్
నిర్మాతలు- విజయ ప్రసాద్ బండ్రెడ్డి - థామస్ రెడ్డి ఆదూరి
దర్శకత్వం- పల్నాటి సూర్య ప్రతాప్

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసే దర్శకుల్లో సుకుమార్ ఒకడు. అతను తొలిసారి నిర్మాతగా మారి కథ - స్క్రీన్ ప్లే అందిస్తూ తన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తీసిన సినిమా ‘కుమారి 21 ఎఫ్’. యూత్ లో విపరీతమైన క్యూరియాసిటీ పెంచిన ఈ సినిమా ఆ ఆసక్తికి తగ్గట్లే ఉందో లేదో చూద్దాం పదండి.

కథ:

సిద్ధు (రాజ్ తరుణ్) సింగపూర్ కు వెళ్లి క్రూజ్ లో చెఫ్ గా సెటిలవ్వాలని ఆశపడే కుర్రాడు. తండ్రి ఇంకో ఫ్యామిలీ పెట్టడంతో తల్లితో కలిసి జీవితం సాగిస్తుంటాడు. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేస్తున్న సిద్ధు జీవితంలోకి కుమారి (హీబా పటేల్) ప్రవేశిస్తుంది. సిద్ధుని తొలి చూపులోనే ప్రేమించి అతడికి ఐలవ్యూ కూడా చెబుతుంది. కొన్నాళ్ల తర్వాత సిద్ధు కూడా ఆమెను ప్రేమిస్తాడు. ఐతే మోడల్ గా పని చేసే కుమారి తీరు సందేహాస్పదంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మాటలు నమ్మి సిద్ధు కూడా ఆమెను అనుమానిస్తాడు. ఇంతలో కుమారి గతానికి సంబంధించిన ఓ షాకింగ్ విషయం కూడా తెలుస్తుంది సిద్ధుకి. ఇంతకీ ఆ గతమేంటి? ఆ గత తెలిశాక కూడా సిద్ధు ఆమెను యాక్సెప్ట్ చేశాడా? అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

అందరూ అంచనా వేసినట్లే ‘కుమారి 21 ఎఫ్’ ఒక బోల్డ్ ఫిలిం. ఇది యూత్ ఆడియన్స్ కి కనెక్టయ్యే సినిమా. వాళ్లను ఎంటర్టైన్ చేస్తుంది, ఆలోచింపజేస్తుంది. సుకుమార్ - సూర్యప్రతాప్ కలిసి ఒక హార్డ్ హిట్టింగ్ మెసేజ్ ని.. ఎంటర్ టైన్ మెంట్ పూత వేసి చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా మీద ఎలాంటి అంచనాతో వచ్చారో అలాగే ఉంటుందీ సినిమా.
తెలుగులో కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అరుదుగా వస్తుంటాయి. ‘కుమారి 21 ఎఫ్’ అలాంటి అరుదైన సినిమానే. అరుదైన అంటే.. ఇదో మాస్టర్ పీస్ అని కాదు. ఒక కాన్సెప్ట్ ను పకడ్బందీగా చెప్పే ప్రయత్నాలు తెలుగులో చాలా తక్కువ జరుగుతుంటాయి. ‘కుమారి 21 ఎఫ్’ అన్ని రకాల ప్రేక్షకుల్నీ మెప్పించే సినిమా కాదు. కానీ యూత్ కు సంబంధించిన కాన్సెప్ట్ ని యూత్ కనెక్టయ్యేలా ప్రెజెంట్ చేయడంలో మాత్రం సుకుమార్ అండ్ టీమ్ సక్సెస్ అయింది.
ఓ వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించాలని.. అవతలి వ్యక్తి మంచి - చెడులు రెంటినీ యాక్సెప్ట్ చేయాలని.. ప్రేమలో అనుమానాలు ఉండొద్దని.. అన్నింటికంటే నమ్మకం అనేది ప్రేమలో అత్యంత ముఖ్యమైన విషయమని చెప్పే ప్రయత్నం చేశాడు కథకుడు సుకుమార్. ఐతే డైరెక్టుగా మెసేజ్ ఇస్తే ఎవరూ చూడరు కదా. అందుకే తనదైన శైలిలో యూత్ కి గిలిగింతలు పెట్టే మసాలా అద్దాడు.

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించకపోయినా.. కథ, మాటలు మాత్రమే అందించినప్పటికీ.. ఇది సుకుమార్ సినిమాగానే ముద్ర పడిపోయింది. సినిమాలో కూడా ఆ ముద్ర అడుగడుగునా కనిపిస్తుంది. టైటిల్స్ లోనే మనకు సుకుమార్ కనిపిస్తాడు. ఇంతకుముందు ‘100 పర్సంట్ లవ్’ టైటిల్స్ విషయంలో తన క్రియేటివిటీ చూపించినట్లే.. ఇందులోనూ ‘ఐఫోన్ టైటిల్స్’ కాన్సెప్ట్ తో సుక్కు తన ముద్ర చూపించాడు.

ఆ తర్వాత యూత్ ఎంజాయ్ చేసే సుకుమార్ మార్కు రొమాంటిక్ సన్నివేశాలతో ప్రథమార్ధం సాగుతుంది. హీరోయిన్ పాత్ర ఎంటర్ టైనింగ్ గా అనిపిస్తుంది కానీ.. టూమచ్ గా బిహేవ్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పేదోళ్లుండే కాలనీలో హీరోయిన్ చిట్టిపొట్టి డ్రెస్సుల హొయలు కానీ.. నడి రోడ్డు మీద ముద్దులు కానీ.. నడుంపై మచ్చలు పెట్టించుకోవడం కానీ.. అంతా అసహజంగా అనిపిస్తుంది. ఐతే లాజిక్కుల గురించి ఆలోచించకుండా ఎంటర్ టైన్ మెంట్ యాంగిల్లోనే చూస్తే ఈ సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి.

హీరోయిన్ పాత్రే ప్రథమార్ధం మొత్తం లీడ్ తీసుకుంటుంది. ఆమె పాత్ర కావాల్సినంత వినోదాన్నిస్తుంది. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఇద్దరు కూడా పంచ్ లతో చెలరేగిపోతుంటారు. దీంతో ఫస్టాఫ్ చాలా వేగంగా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఐతే సెకండాఫ్ ఎమోషన్స్ మీద నడిపించడంతో కొంచెం నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రేమ-నమ్మకం-మెచ్యూరిటీ అనే అంశాల మీద డిస్కషన్ మొదలవడంతో కొంచెం బోర్ కూడా కొడుతుంది. ఐతే ముందు కనిపించిన లోపాలన్నీ కూడా క్లైమాక్స్ తో వాష్ ఔట్ అయిపోతాయి. అంత స్టన్నింగ్ గా - హార్ట్ టచింగ్ గా ఉంటుంది క్లైమాక్స్. హీరోలో వచ్చిన మార్పును కన్వే చేసే సీన్ సినిమాకు హైలైట్.

తన నమ్మి సినిమాలకు వచ్చేది యూతే కాబట్టి సుకుమార్ వాళ్లనే టార్గెట్ చేశాడు. మిగతా ప్రేక్షకుల గురించి ఆలోచించలేదు. దీంతో సన్నివేశాలు - మాటలు అన్నీ కూడా చాలా బోల్డ్ గా ఉంటాయి. సినిమాలో హీరో హీరోయిన్లు పదే పదే ‘మెచ్యూరిటీ’ అనే మాట వాడుతుంటారు. అలాగే సినిమాలోని ‘బోల్డ్ నెస్’ని యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ ఉంటే ‘కుమారి 21 ఎఫ్’ చూడొచ్చు.

నటీనటులు-

తొలి రెండు సినిమాల్లో బాగా దూకుడున్న పాత్రల్లో కనిపించిన రాజ్ తరుణ్.. ఈసారి కొంచెం భిన్నమైన క్యారెక్టర్ చేశాడు. అమాయకత్వం - కన్ఫ్యూజన్ నిండిన పాత్రను చాలా బాగా చేసి తనలోని కొత్త కోణాన్ని జనాలకు పరిచయం చేశాడు. క్లైమాక్స్ లో అతడి నటన సూపర్బ్. హీరోయిన్ హీబా పటేల్ ను ముందు ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు అభినందించాలి. పాత్రకు యాప్ట్ గా అనిపించిందామె. తన అందచందాలతో కుర్రాళ్లను కట్టి పడేసిందా అమ్మాయి. నటన కూడా ఓకే. హీరో ఫ్రెండ్స్ బ్యాచ్ లోని ముగ్గురూ సహజంగా నటించారు. నోయల్ సీరియస్ గా కనిపిస్తే.. మిగతా ఇద్దరూ పంచ్ లతో వినోదం పంచారు.

సాంకేతిక వర్గం:

‘కుమారి 21 ఎఫ్’ టెక్నీషియన్స్ మూవీ. అందరూ మంచి ఔట్ పుట్ ఇచ్చారు. దేవిశ్రీ మామూలుగా చేసే పెద్ద సినిమాలతో పోలిస్తే దీనికి భిన్నమైన మ్యూజిక్ ఇచ్చాడు. మేఘాలు లేకున్నా.. మంచి మెలోడీ. లవ్ చేయాలా వద్దా ఎంటర్ టైనింగ్ అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. క్లైమాక్స్ లో టచింగ్ గా అనిపిస్తుంది నేపథ్య సంగీతం. రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు మరో మేజర్ హైలైట్. చిన్న సినిమాల్లో ఇలాంటి క్వాలిటీ చాలా అరుదుగా కనిపిస్తుంది. చాలా మామూలు లొకేషన్లు - మామూలు సన్నివేశాల్నే రత్న వేలు కెమెరా రిచ్ గా చూపించింది. ముఖ్యంగా హీరోయిన్ని రత్నవేలు చూపించిన విధానం సూపర్బ్. మాటలన్నీ సహజంగా ఉన్నాయి. పంచ్ లు పేలాయి. ‘‘నువ్వు నమ్మితే నిజం. లేకపోతే అబద్ధం. అదే జీవితం’’ అంటూ సినిమా ఎసెన్స్ తెలిపేలా కొన్ని డెప్త్ డైలాగ్స్ పడ్డాయి. కథ - స్క్రీన్ ప్లే విషయంలో తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని సుకుమార్ వమ్ము చేయలేదు. సుక్కు స్క్రిప్టుని సూర్యప్రతాప్ సరిగ్గానే స్క్రీన్ మీదికి తీసుకొచ్చాడు. సినిమాకు బలమైన సన్నివేశాల్ని బాగా డీల్ చేశాడు.

చివరగా: కుమారి చాలా ‘బోల్డ్’.. కొంచెం ‘బ్యూటిఫుల్’.

రేటింగ్- 3/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre