Begin typing your search above and press return to search.

18 నెలల్లో 1000 కోట్లు టాలీవుడ్ కి దెబ్బ

By:  Tupaki Desk   |   25 Jun 2016 10:46 AM IST
18 నెలల్లో 1000 కోట్లు టాలీవుడ్ కి దెబ్బ
X
పైరసీ.. ప్రతీ సినిమా రంగాన్ని పట్టి పీడిస్తున్న భూతం ఇది. అసలు సినీ పరిశ్రమకు పైరసీ చేస్తున్న చేటు ఎంత? మొత్తం దేశీయ చలనచిత్ర పరిశ్రమపై కాకపోయినా.. టాలీవుడ్ కి జరిగిన నష్టాన్ని నిగ్గు తేల్చేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఓ ప్రయత్నం చేసింది. యాంటీ పైరసీ వింగ్ ను ఏర్పాటు చేసి.. నష్టాల లెక్క తేల్చింది. 2015 ప్రారంభం నుంచి ఇప్పటివరకూ.. అంటే గత 18నెలల్లో టాలీవుడ్ రూ. 1,066 కోట్లను నష్టపోయిందని యాంటీ పైరసీ వింగ్ తేల్చింది.

ఈ సమయంలో తెలుగు సినిమాలను మొత్తం కోటి మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇది పైరసీ డౌన్ లోడ్స్ లెక్క మాత్రమే. ఇలా పైరసీ వెర్షన్లను డౌన్ లోడ్ చేసుకునేందుకు.. ఆన్ లైన్ లో చూసేందుకు అనుమతినిచ్చే వెబ్ సైట్ల 138గా తేలింది. ఈ ప్రమాదం నుంచి టాలీవుడ్ ని కాపాడేందుకు తెలంగాణ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యూనిట్ (తెలంగాణ మేథో సంపత్తి నేర విభాగం)ను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఐటీ మంత్రి కేటీఆర్ లాంఛ్ చేయడం విశేషం.

'పైరసీని ప్రోత్సహిస్తున్న వెబ్ సైట్లు ఇక్కడితో ఆగిపోవడం లేదు. ఆయా సైట్స్ లో నీలి చిత్రాలు విచ్చలవిడిగా ఉంటున్నాయి. ఇది మన పిల్లల భవితవ్యాన్ని పాడు చేసే అంశం. ఇలాంటివాటివైపు చిన్నారులు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.' అని చెప్పిన కేటీఆర్.. పోర్నోగ్రఫీని బ్యాన్ చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని గుర్తు చేసుకున్నారు.