Begin typing your search above and press return to search.

ఏపీ నుంచి ఎవరినీ పిలవడం లేదా భీమ్లా..?

By:  Tupaki Desk   |   19 Feb 2022 5:14 PM GMT
ఏపీ నుంచి ఎవరినీ పిలవడం లేదా భీమ్లా..?
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ''భీమ్లా నాయక్''. ఇందులో రానా దగ్గుబాటి మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 25న తెలుగు హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్.. ఈ నెల 21న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసారు. దీనికి తెలంగాణ మంత్రులు అతిధులుగా వస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ నుంచి ఎవరినైనా ఆహ్వానిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్‌ యూసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌ లో గ్రాండ్‌ గా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా.. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పెషల్ గెస్టుగా హాజరుకానున్నారు. 'భీమ్లా నాయక్' సినిమా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమ విన్నపాన్ని మన్నించి ఘనంగా నిర్వహించాలనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తానని చెప్పిన కేటీఆర్‌ కు నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణా మంత్రులను సితార నిర్మాతలు కె రాధాకృష్ణ (చినబాబు) - నాగవంశీ మరియు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంగా ఆహ్వానించారు. భీమ్లా ఈవెంట్ కు రాజకీయ నాయకులు వస్తుండటం.. కేటీఆర్‌ - తలసానిలతో కలిసి పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకోనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎవరినైనా ఇన్వైట్ చేస్తారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

పవన్ ఇప్పుడు తెలంగాణాలో రాజకీయాలు చేయకపోయినా.. ఏపీ పాలిటిక్స్ లో మాత్రం యాక్టీవ్ గా ఉంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలైన పవన్.. అప్పటి నుంచి ప్రభుత్వ విధివిధానాలను ప్రశ్నిస్తూ వస్తున్నారు. తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సినిమా టికెట్ ధరలు నియంత్రిస్తూ జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవోపై మండిపడ్డారు. ఈ వ్యవహారం మీద టాలీవుడ్ లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవరం లేదు.

కాకపోతే 'రిపబ్లిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన వ్యాఖ్యల వల్లే ఇది వివాదంగా మారిందనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఏదైతేనేం ఏపీలో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఓ కొలిక్కి రాబోతున్నట్లు కనిపిస్తోంది. పవన్ పెద్దన్నయ్య చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం ఇటీవల అమరావతికి వెళ్లి సీఎం జగన్ కు కృతఙ్ఞతలు చెప్పిరావడం.. ప్రభుత్వ కమిటీ నివేదిక రెడీ చేయడం వంటివి ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

టాలీవుడ్ ప్రముఖులు ఆశించినట్లు టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వ జీవో వచ్చే వారంలోపు వస్తే.. అది అందరి కంటే ముందే పవన్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాకే ప్లస్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ నుంచి ఎవరైనా ఆహ్వానిస్తారేమో అని చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఇద్దరు గెస్టులెవరో నిర్మాతలు చెప్పేసారు కాబట్టి.. దానికి అవకాశం లేకపోవచ్చని అంటున్నారు. మరికొందరు మాత్రం మూవీ సక్సెస్ మీట్ ఆంధ్రాలో నిర్వహిస్తే అక్కడి వారిని పిలుస్తారేమో అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో పవన్ వేదిక పంచుకునే ఛాన్సే లేదని ఆయన అభిమానులు - జనసేన కార్యకర్తలు అంటున్నారు.