Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: క్షణం

By:  Tupaki Desk   |   26 Feb 2016 9:05 AM GMT
మూవీ రివ్యూ: క్షణం
X
మూవీ రివ్యూ: క్షణం

నటీనటులు: అడివి శేష్ - ఆదా శర్మ - అనసూయ భరద్వాజ్ - వెన్నెల కిషోర్ - రవి వర్మ - సత్యం రాజేష్ - సత్యదేవ్ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: శానీల్ డియో
మాటలు: అబ్బూరి రవి
నిర్మాతలు: పరమ్ వి.పొట్లూరి - కవిన్ అన్నె
కథ: అడివి శేష్
స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు - అడివి శేష్
దర్శకత్వం: రవికాంత్ పేరెపు

నటుడిగా, దర్శకుడిగా ‘కర్మ’ అనే విభిన్నమైన సినిమాతో అరంగేట్రం చేసిన అడివి శేష్.. ఆ తర్వాత ‘కిస్’ అనే ఇంకో సినిమా కూడా చేశాడు. ఐతే అవి రెండూ అతడికి మంచి ఫలితాన్నివ్వలేదు. దీంతో మెగా ఫోన్ ప్రయత్నాలు పక్కనబెట్టేసి నటుడిగా తనేంటో రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు డైరెక్షన్ జోలికి పోకుండా తన రైటింగ్ టాలెంట్ మాత్రం చూపిస్తూ ‘క్షణం’ సినిమాను తెరమీదికి తెచ్చాడు. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించిన ఈ ‘క్షణం’ కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలుస్తోంది. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘క్షణం’ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రిషి (అడివి శేష్) అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుంటాడు. అతడికో రోజు ఇండియాలోని తన మాజీ ప్రేయసి శ్వేత (ఆదా శర్మ) నుంచి ఫోన్ వస్తుంది. శ్వేత కోసం ఇండియా బయల్దేరి వచ్చిన రిషికి ఆమె కూతురు రియా కిడ్నాపైందని తెలుస్తుంది. ఆ పాప కోసం వేట మొదలుపెడతాడు రిషి. ఐతే రియా కోసం అన్వేషించే క్రమంలో అసలు శ్వేతకు పాపే లేదని అనుమానం కలుగుతుంది రిషికి. ఇంతకీ రియా నిజంగానే ఉందా? శ్వేత చెబుతున్నట్లు నిజంగానే ఆ పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? అన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి.

కథనం - విశ్లేషణ:

క్షణం సినిమా టైటిల్ లోగోను జాగ్రత్తగా గమనించారంటే.. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కు సంబంధించి కింద కొన్ని క్లూస్ కనిపిస్తాయి. ముందు అమెరికాను రెప్రజెంట్ చేసే బిల్డింగ్స్.. ఆ తర్వాత హైదరాబాద్ ను సింబాలిక్ గా చూపించే ఛార్మినార్.. ఆ తర్వాత ఓ పాప. హీరో ఓ పాప కోసం అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి అన్వేషణ సాగించడం అనే కాన్సెప్ట్ ను అలా చక్కగా టైటిల్ లోగో ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది ‘క్షణం’ టీమ్.

లోగో విషయంలోనే ఇంత ఫోకస్ పెట్టారంటే ఇక కథాకథనాల విషయంలో క్షణం టీమ్ ఇంకెంత శ్రద్ధ పెట్టి ఉంటుందో కదా. నిజమే.. ‘క్షణం’ ఎంతో శ్రద్ధగా తీసిన డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. తెలుగు సినిమాల్లో ఇలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కడం అరుదైన విషయమే. థ్రిల్లర్ జానర్ కు పూర్తి న్యాయం చేస్తూ ఆసక్తికర మలుపులు తిరుగుతూ.. ఎక్కడా లీడ్ పాయింట్ నుంచి డీవియేట్ కాకుండా సూటిగా వెళ్లిపోయే థ్రిల్లర్ మూవీ.. క్షణం.

థ్రిల్లర్ సినిమాలకు కథ కంటే కూడా స్క్రీన్ ప్లే చాలా ముఖ్యమైన విషయం. ఏమాత్రం ఆసక్తి సడలినా.. కథ నుంచి పక్కకు వెళ్లినా.. ట్విస్టులు సరిగా పండకపోయినా.. మొత్తం వ్యవహారం చెడిపోతుంది. ఐతే అడివి శేష్ - డెబ్యూ డైరెక్టర్ రవికాంత్ పేరెపు ఈ తప్పు చేయలేదు. ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ఎక్కడా ఉత్కంఠ తగ్గకుండా.. ప్రేక్షకుల్ని నిరంతరం గెస్సింగ్ లో ఉంచుతూ.. రెండు గంటల పాటు ఎంగేజ్ చేశారు.

హీరోయిన్ తన కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారంటుంది. కానీ ఆమెకు అసలు కూతురే లేదంటారు అందరూ. చివరికి హీరో కూడా ఆమెను అనుమానిస్తాడు. హీరో ఇంటి లోపలికి వెళ్తే.. హీరోయిన్ తన కూతురు పెరిగి పెద్దవుతున్న టైంలో తన పొడవును కొలుస్తూ గోడల మీద వేసిన మార్క్స్ కనిపిస్తాయి. అప్పుడతడికి నిజం తెలుస్తుంది. కానీ ఇటు తిరిగేసరికి ఘోరం జరిగిపోతుంది. ‘క్షణం’ సినిమాకు హైలైట్ అనదగ్గ సన్నివేశం ఇది. ‘క్షణం’ స్క్రీన్ ప్లే ఎంత పకడ్బందీగా తీర్చిదిద్దారో ఈ సన్నివేశం సరైన ఉదాహరణ. సినిమా అంతా కూడా ఇలాంటి ఆసక్తికర సన్నివేశాలతో.. బిగువైన స్క్రీన్ ప్లేతో సాగుతుంది.

ప్రథమార్ధం వేగం అందుకోవడానికి కొంచెం టైం పట్టినా.. ఇంటర్వెల్ ముందు నుంచి కథనం ఊపందుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ ను ఒకేసారి చెప్పేయకుండా.. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో అక్కడక్కడా ప్లేస్ చేసిన విధానం బాగుంది. దాని వల్ల ఎక్కడా లాగ్ అనే ఫీలింగ్ కలగదు. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మరింత పకడ్బందీగా, ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా చివరి 40 నిమిషాల్లో వరుసగా వచ్చే మలుపులు ఉత్కంఠను అంతకంతకూ పెంచుతాయి. క్లైమాక్స్ షాకింగ్ గా అనిపిస్తుంది.

చివర్లో ట్విస్టును జీర్ణించుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇది కొంచెం మింగుడు పడని వ్యవహారం లాగా కూడా అనిపిస్తుంది. పాప కోసం విలన్ పాత్ర మరీ అంత దారుణాలు చేయాలా.. అసలు ఓ పాప ఐడెంటిటీని అలా తుడిచేయడం సాధ్యమా అన్న సందేహాలు రేకెత్తుతాయి. దీని వల్ల కొంత అసంతృప్తిగా అనిపించినప్పటికీ.. క్షణం టీమ్ కమిట్మెంట్ చూసి కొంచెం పెద్ద మనసు చేసుకోవచ్చు. పాపకు, హీరోకు ముడిపెట్టి.. సినిమాను ముగించిన విధానం బాగుంది. నిడివి 2 గంటలే కావడం సినిమాకు పెద్ద ప్లస్.

ఈ జానర్ కు ఉన్న పరిమితుల వల్ల ‘క్షణం’ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించకపోవచ్చు. దీని నరేషనే రెగ్యులర్ సినిమాల తరహాలో ఉండదు. ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే కష్టం. కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల సినిమాల్ని ఇష్టపడేవారిని ‘క్షణం’ అంతగా ఎంగేజ్ చేయకపోవచ్చు. ప్రథమార్ధంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ వల్ల సినిమా కొంచెం సా...గిన ఫీలింగ్ కలుగుతుంది. పాటలున్నవి మూడే అయినా కొంచెం అవి అడ్డం పడ్డ ఫీలింగ్ కలిగిస్తాయి. పూర్తిగా పాటలు లేపేస్తే బాగుండేది. ఇంతకుమించి ‘క్షణం’లో పెద్ద మైనస్ లంటూ ఏమీ లేవు.

నటీనటులు:

అడివి శేష్ ‘క్షణం’తో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడు. సినిమా మొత్తాన్ని అతను తన భుజాల మీద నడిపించాడు. సినిమా మొత్తంలో శేష్ బాగా చేయలేదు అనిపించే సన్నివేశాలేమీ లేవు. ఫ్లాష్ బ్యాక్ లో ఎంత క్యాజువల్ గా కనిపించి ఆకట్టుకున్నాడో.. వర్తమానంలో అంత ఇంటెన్సిటీ చూపించాడు. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని.. హీరోయిజం ఎక్కడా హద్దులు దాటనివ్వకుండా మెచ్యూర్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు శేష్. ఎమోషన్స్ కూడా బాగా పలికించాడు. ఆదా శర్మ ఇలా తనకు నప్పే పాత్రలు ఎంచుకుంటే బెటర్. తెలుగులో ఇప్పటిదాకా ఆదా చేసిన పాత్రల్లో ఇది చాలా ప్రత్యేకమైంది. గుర్తుంచుకోదగ్గది. ఆమె పాత్రకు తగ్గట్లుగా నటించింది. అనసూయను ఇలాంటి పాత్రలో చూసి.. అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. మొదట ఆమె పాత్ర మామూలుగా అనిపిస్తుంది. చివర్లోకి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ తీసుకున్న టర్న్ చూసి షాకవుతాం. ఆ సన్నివేశంలో అనసూయ బాగానే నటించింది కూడా. సత్యం రాజేష్ చౌదరి అనే పోలీస్ పాత్రలో అదరగొట్టాడు. అతణ్ని ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూసి ఉండం. సినిమాలో ఉన్న కొంచెం ఎంటర్టైన్మెంట్ పార్ట్ అతడి మీదే నడుస్తుంది. రాజేష్ కు చాలా కొత్తగా అనిపించే పాత్రలో అతను మెప్పించాడు. వెన్నెల కిషోర్ - రవివర్మ - సత్యదేవ్ కూడా బాగా చేశారు.

సాంకేతికవర్గం:

క్షణం టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ ఉన్న మూవీ. మ్యూజిక్ - సినిమాటోగ్రఫీ - ఎడిటింగ్ - ప్రొడక్షన్ వాల్యూస్.. అన్నీ బాగున్నాయి. శ్రీచరణ్ పాటలు పెద్దగా గుర్తుండవు కానీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ హైలైట్. సన్నివేశాలకు బలంగా నిలిచింది. ఉత్కంఠను మరింత పెంచడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. సౌండ్ డిజైనింగ్ కూడా సూపర్బ్. శానీల్ డియో ఛాయాగ్రహణం కూడా హాలీవుడ్ సినిమాలకు దగ్గరగా అనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా క్రిస్ప్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి ఔట్ పుట్ తెచ్చినందుకు అభినందించాల్సిందే. అడివి శేష్, రవికాంత్ పేరెపు కలిసి అందించిన స్క్రీన్ ప్లే సినిమాకు పెద్ద ప్లస్. ఈ విషయంలో హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపించినప్పటికీ.. వాటి స్థాయికి దీటుగా కథనాన్ని తీర్చిదిద్దారు. సినిమాలో వృథా సన్నివేశాలేమీ లేకుండా.. ప్రతి చిన్న సన్నివేశానికీ ఏదో ఒక లింకు ఉండేలా ఆసక్తికరంగా స్క్రీన్ ప్లేను మలిచారు. డైరెక్టర్ రవికాంత్ తొలి సినిమాతోనే తనదైన ముద్ర వేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ పై అతడికున్న పట్టు సినిమాలో కనిపిస్తుంది. ఆరంభం నుంచి చివరిదాకా సినిమాలో ఒక టోన్ లో తీసుకెళ్లడంలో.. ఎక్కడా ఆసక్తి తగ్గకుండా నిలబెట్టడంల అతను విజయవంతమయ్యాడు.

చివరగా: ఉత్కంఠభరిత ‘క్షణం’

రేటింగ్: 3/5


Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre