Begin typing your search above and press return to search.

బాలచందర్ పారితోషికం 5 లక్షలు దాటలేదట!

By:  Tupaki Desk   |   29 May 2021 5:00 AM IST
బాలచందర్ పారితోషికం 5 లక్షలు దాటలేదట!
X
తెలుగు .. తమిళ భాషల్లో సీనియర్ డైరెక్టర్ గా కేఎస్ రవికుమార్ కి మంచి క్రేజ్ ఉంది. మాస్ అంశాలు కాస్త ఎక్కువగా కనిపించినప్పటికీ, యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించే కథలనే ఆయన ఎంచుకుంటూ ఉంటాడు. తమిళంలో రజనీకాంత్ తో చేసిన 'ముత్తు' .. 'నరసింహా' సినిమాలు సంచలనం విజయాన్ని సాధించగా, కమల్ తో తెరకెక్కించిన 'దశావతారం' ప్రేక్షకులను విస్మయులను చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"రజనీకాంత్ కథానాయకుడిగా ఆయనతో నేను చేసిన తొలి చిత్రం 'ముత్తు'. ఆ సినిమాకి కె. బాలచందర్ గారు నిర్మాత. ఒక గొప్ప దర్శకులు నిర్మించిన సినిమాకి నేను దర్శకత్వం వహించడం నా భాగ్యంగా భావిస్తూ ఉంటాను. 'ముత్తు' కథ ఆయనకి చెప్పినప్పుడు వెంటనే ఓకే అన్నారు. "ఇది నా సినిమాలా ఉండకూడదు .. రజనీకాంత్ సినిమాల ఉండాలి" అని చెప్పారు. పారితోషికం ఎంత తీసుకుంటున్నావ్? అని అడిగారు. రజనీకాంత్ గారిని అడిగి ఇవ్వండి సార్ అన్నాను. ఆయన రజనీకాంత్ గారికి కాల్ చేసి అడిగితే, ఓ 15 లక్షలు ఇవ్వండి అని ఆయన చెప్పారు.

ఆ మాట వినగానే బాలచందర్ గారు షాక్ అవుతూ ఫోన్ పెట్టేశారు. "15 లక్షలు ఏంట్రా .. నేను ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చాను .. నా పారితోషికం 5 లక్షలు కూడా దాటలేదు. రజనీకాంత్ చెప్పాడు కనుక నేను ఇవ్వాలి .. కానీ డైరెక్టర్ పారితోషికమే 15 లక్షలంటే ఎలారా? నేను ఇప్పుడే వింటున్నాను" అని నాతో అన్నారు. ఆయన ఆ మాట అనగానే నాకు చాలా బాధ అనిపించింది. బాలచందర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ .. ఎన్ని గొప్ప సినిమాలు ఇచ్చారు .. అయినా ఆయన పారితోషికం 5 లక్షలు దాటలేదని తెలిసినప్పుడు నిజంగా నేను చాలా ఫీలయ్యాను" అని చెప్పుకొచ్చారు.