Begin typing your search above and press return to search.

తెలుగు టీవీ సీరియల్ లో 'ఉప్పెన' బ్యూటీ..!

By:  Tupaki Desk   |   26 July 2021 6:09 AM GMT
తెలుగు టీవీ సీరియల్ లో ఉప్పెన బ్యూటీ..!
X
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ కుర్రాభమ కృతి శెట్టి.. ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి సూపర్ సక్సెస్ అందుకుంది. దీంతో క్రేజీ ఆఫర్స్ అమ్మడి తలుపు తడుతున్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. తాజాగా ఓ తెలుగు డైలీ సీరియల్ లో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచింది.

జీ తెలుగు ఛానల్ వారు ''ముత్యమంత ముద్దు'' అనే సరికొత్త ధారావాహికను ప్రారంభిస్తున్నారు. ఈ సీరియల్ కి సంబంధించిన ప్రోమోని రీసెంటుగా రిలీజ్ చేయగా.. అందులో కృతి శెట్టి గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. ఆ సీరియల్ లో లీడ్ రోల్ ప్లే చేస్తున్న నటితో కలిసి కృతి.. ధారావాహిక ఇతివృత్తాన్ని ఈ చిన్న గ్లిమ్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసింది.

'ముత్యమంత ముద్దు' సీరియల్ లో కృతి శెట్టి నటించడం లేదు. మేకర్స్ ఈ సీరియల్ ను జనాల్లోకి తీసుకెళ్లడానికి బజ్ క్రియేట్ చేయడానికి కృతి ఈ కాన్సెప్ట్ ప్రోమోలో నటింపజేశారు. ఇందులో సీనియర్ నటి ఆమని - కోట శంకర్రావు - వాసు ఇంటూరి కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

కృతి శెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని - రాహుల్‌ సాంకృత్యన్‌ కాంబోలో తెరకెక్కుతున్న 'శ్యామ్ సింగరాయ్‌' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సుధీర్ బాబు - డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో రూపొందుతున్న 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తోంది.

'ఉస్తాద్' హీరో రామ్ పోతినేని - డైరెక్టర్ లింగుసామి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బైలింగ్విల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. ఇప్పటికే మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ఈ బ్యూటీ.. మరో రెండు తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.

యూత్ స్టార్ నితిన్ హీరోగా ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ దర్శకత్వం వహించబోయే సినిమాలో కృతినే హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు టాక్. అలానే కింగ్ అక్కినేని నాగార్జున 'బంగార్రాజు' చిత్రంలో యువ సామ్రాట్ నాగచైతన్య కు జోడీ కోసం కృతి ని సంప్రదిస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.