Begin typing your search above and press return to search.

ఆ కనులు పండువెన్నెల గనులు .. రామ్ సినిమా నుంచి కృతి శెట్టి బర్త్ డే పోస్టర్!

By:  Tupaki Desk   |   21 Sep 2021 4:24 AM GMT
ఆ కనులు పండువెన్నెల గనులు .. రామ్ సినిమా నుంచి కృతి శెట్టి బర్త్ డే పోస్టర్!
X
కృతి శెట్టి .. ఇప్పుడు యూత్ అంతా కలవరిస్తున్న పేరు. వాళ్లను కలల్లో నుంచి బయటికి రానీయని పేరు. అందం .. ఆకర్షణ కలిసి పెట్టుకున్న పేరు. కుర్రాళ్లను అభిమానులుగా .. ఆరాధకులుగా మార్చుకున్న పేరు. అలాంటి కృతి శెట్టి పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రామ్ జోడీగా ఆమె చేస్తున్న సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. అలా అలలా ముందుకు వెళుతూ .. ఒకసారి ఓరగా వెనక్కి తిరిగి ఒక స్మైల్ పారేసిన లుక్ తో ఆమె ఈ పోస్టర్లో కనిపిస్తోంది.

హెయిర్ ను అలా స్వేచ్ఛగా వదిలేసి .. సొట్ట బుగ్గలతో ఆమె ఇచ్చిన స్మైల్ చూస్తే, నల్లని మేఘాల మధ్యలో తేలుతున్న నిండు చందమామలా కనిపిస్తోంది. ఆ కలువ కళ్లు ఎన్నో కబుర్లు చెబుతున్నాయి .. కథలు చెబుతున్నాయి. అవి అనంతమైన భావాలను అందంగా విప్పడానికి సిద్ధమైనట్టుగా అనిపిస్తున్నాయి. ఆ కళ్లు నక్షత్రాలను మూట గట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఆ వెలుగులో విహరించాలని కుర్రాళ్లు ముచ్చటపడుతున్నారు .. ఆ వాలు చూపుల వాకిళ్లలో సేదదీరడానికి పోటీ పడుతున్నారు.

తెలుగు తెరపై కృతి శెట్టి ఓ సౌందర్య జలపాతం .. పడుచు మనసులను పట్టేసిన పాలపుంత. ఈ మధ్య కాలంలో యూత్ ను ఇంతగా పట్టేసిన .. కట్టేసిన అందం ఆమెదే. దానిమ్మ మొగ్గ వంటి ఈ పిల్ల చుట్టూనే ఇప్పుడు అవకాశాలు తిరుగుతున్నాయి. ఇతర భాషల నుంచి వచ్చిన అవకాశాలు కూడా ఆమె చుట్టూనే కదిరీగల మాదిరిగాఎగురుతున్నాయి. ఇక తెలుగులో వరుస అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆల్రెడీ నాని జోడీగా 'శ్యామ్ సింగ రాయ్' సినిమాను పూర్తిచేసిన ఈ అమ్మాయి, సుధీర్ బాబు సరసన, 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' చేస్తోంది.

ఆ తరువాత సినిమాను ఆమె రామ్ జోడీగా చేస్తోంది. లింగుసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. ఇక నితిన్ జోడీగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమాను కూడా చేస్తోంది. ఇదే సమయంలో పట్టాలెక్కిన 'బంగార్రాజు' సినిమాలో ఆమె చైతూ జోడీగా కనిపించనుంది. ఇలా వరుస సినిమాలతో కృతి శెట్టి దూసుకుపోతోంది. అందానికీ .. అభినయానికి అదృష్టం తోడైతే ఎలా ఉంటుందనేది చూపిస్తోంది.