Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: కృష్ణాష్టమి

By:  Tupaki Desk   |   19 Feb 2016 9:33 AM GMT
మూవీ రివ్యూ: కృష్ణాష్టమి
X
చిత్రం : కృష్ణాష్టమి

నటీనటులు: సునీల్ - నిక్కి గర్లాని - డింపుల్ చోప్ - అశుతోష్ రాణా - ముకేష్ రుషి - పవిత్రా లోకేష్ - తులసి - పోసాని కృష్ణమురళి - బ్రహ్మానందం - సప్తగిరి - పృథ్వీ - హర్ష - అజయ్ తదితరులు
సంగీతం: దినేష్
ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు
కథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: దిల్ రాజు
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వాసు వర్మ

నిర్మాతగా ఒకప్పటి స్థాయిలో సినిమాలు తీయలేకపోతున్న దిల్ రాజు.. ‘జోష్’ లాంటి ఫెయిల్యూర్ తో దర్శకుడిగా అరంగేట్రం చేసిన వాసు వర్మ.. హీరోగా ఒడుదొడుకుల ప్రయాణం సాగిస్తున్న సునీల్.. ఈ ముగ్గురూ కలిసి డెస్పరేట్ గా హిట్ కొట్టి తీరాలన్న ఉద్దేశంతో చేసిన సినిమా ‘కృష్ణాష్టమి’. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా వారి ఆశల్ని ఏమేరకు నెరవేర్చిందో చూద్దాం పదండి.

కథ:

కృష్ణవరప్రసాద్ (సునీల్) చిన్నప్పటి నుంచి తన కుటుంబానికి దూరంగా అమెరికాలోనే చదువుకుని అక్కడే పెద్దవాడవుతాడు. అతణ్ని ఇండియాకు రప్పించడం తన కుటుంబానికి ఇష్టం ఉండదు. కృష్ణ పెళ్లి కూడా అమెరికాలోనే చేయాలని ఆశపడతాడు అతడి పెదనాన్న. ఐతే కృష్ణ ఆయనకు తెలియకుండా ఇండియాకు బయల్దేరిపోతాడు. దారి మధ్యలో పల్లవి (నిక్కీ గర్లాని) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఐతే అతను ఇండియాకు రాగానే అతడి మీద అటాక్ జరుగుతుంది. ఆ ప్రమాదంలో గాయపడిన అజయ్ (అజయ్) ఇంటికి అతడి కొడుకుని తీసుకుని కృష్ణ వెళ్లగా ఆ ఇంటి పెద్దే తన మీద అటాక్ చేయించాడని తెలుస్తుంది. ఇంతకీ కృష్ణ మీద ఆ అటాక్ ఎందుకు జరిగింది.. అతణ్ని అమెరికాలోనే ఎందుకు చదివించాల్సి వచ్చింది.. తన సమస్య ఏంటో తెలిశాక కృష్ణ దాన్ని ఎలా పరిష్కరించుకున్నాడు.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

ఇండస్ట్రీ అంతా రొటీన్ దారిలో నడుస్తున్నపుడు దిల్ రాజు విభిన్నమైన సినిమాలతో అందరికీ కొత్త దారి చూపించాడు. ఎందరినో ఇన్ స్పైర్ చేశాడు. కానీ ఇప్పుడు మిగతా వాళ్లందరిలో మార్పు వచ్చింది, భిన్నమైన సినిమాలు చేస్తున్నారు. కానీ దిల్ రాజు రొటీన్ దారిలో నడుస్తుండటమే విడ్డూరం. హీరో విలన్ ఇంట్లోకి హీరో చేరి అక్కడున్న వాళ్లందరిలో మార్పు తెచ్చేసి కథను సుఖాంతం చేసే సినిమాలు అరిగిపోయాయి.. చిరిగిపోయాయి.

ఆ తరహా సినిమాలంటే జనాలు చేతులు జోడించేస్తున్న టైంలో మళ్లీ అదే టెంప్లేట్ పట్టుకుని ‘కృష్ణాష్టమి’ సినిమా తీశారు. కొన్ని కామెడీ సీన్లు.. కొంత ఫ్యామిలీ సెంటిమెంట్.. కొంత యాక్షన్.. కొంత రొమాన్స్.. అంటూ లెక్కలేసుకుని చేసిన సినిమా ‘కృష్ణాష్టమి’. ఈ రొటీన్ వినోదంతో రాజీ పడితే ‘కృష్ణాష్టమి’ ఓ మోస్తరుగా అనిపిస్తుంది కానీ.. కొత్తదనం కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు. ఇలాంటి సినిమాను ఎస్టాబ్లిష్డ్ మాస్ హీరో చేసినా పరిస్థితి కొంచెం బెటర్ గా ఉండేదేమో కానీ.. సునీల్ లాంటి కమెడియన్ టర్న్డ్ హీరోతో ఇలాంటి రొటీన్ మసాలా సినిమాను చేయాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

‘కృష్ణాష్టమి’ ఎలా సాగబోతుందన్నది సినిమా ఆరంభంలోనే తేలిపోతుంది. సునీల్ లాంటి హీరోకు ఇంట్రడక్షన్ సాంగ్, ఫైట్ అవసరమా లేదా అని ఆలోచించకుండా టెంప్లేట్ ప్రకారం అవి రెండూ పెట్టేశారు. ఆ తర్వాత హీరోయిన్ని రంగంలోకి దించి రొమాంటిక్ ట్రాక్ నడిపారు. ఆ ట్రాక్ కూడా ఎన్నో సినిమాల్లో చూసింది. ‘బాద్ షా’ సినిమాలో బంతి ఫిలాసఫీ తరహాలో ఇక్కడ హీరోయిన్ కు ‘పల్లవిజం’ ఫిలాసఫీ అని ఒకటి పెట్టి.. దాని చుట్టూ ఓ సాదాసీదా లవ్ స్టోరీతో ప్రథమార్ధాన్నంతా లాగించేశారు. పోసాని కృష్ణమురళి, సప్తగిరి కొంచెం కామెడీ తాళం వేసినా.. అది సరిపోకపోవడంతో ఫస్టాఫ్ భారంగా గడుస్తుంది.

ప్రథమార్ధంలో అసలు కథ అన్నదే మొదలు కాదు. ఇక ద్వితీయార్ధంలో కథ గుట్టేంటో తెలిశాక.. ఆసక్తి మొత్తం చల్లారిపోతుంది. క్లైమాక్స్ వరకు సినిమా అంతా ముందే కనిపించేశాక.. ఇక ఈ తంతు ఎలా ముగుస్తుందో అని వెయిట్ చేయడమే మిగిలుంటుంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ బెటర్ గా ఉండటం ఊరటనిస్తుంది. సెల్ఫీ బల్ఫీగా బ్రహ్మీ ఓ మోస్తరుగా నవ్వించాడు. పృథ్వీ, హర్ష, పోసాని కూడా అక్కడక్కడా పంచ్ లు పేల్చారు. ఐతే ఎమోషనల్ - యాక్షన్ పార్ట్ మాత్రం సాదాసీదాగా అనిపిస్తాయి. ముగింపు రొటీనే. సునీల్ హీరో అయినా.. రాజీ పడకుండా సినిమా అంతా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కించడం.. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను ఇష్టపడే వారికి సినిమా ఓ మోస్తరుగా ఎక్కొచ్చు.

నటీనటులు:

సునీల్ తన వంతుగా చేయాల్సిందంతా చేశాడు. బాగానే నటించాడు, డ్యాన్సులు, ఫైట్లలో ప్రతిభ చూపించాడు. కానీ సునీల్ ను ప్రేక్షకులు ఇలాంటి పాత్రల్లో చూడ్డానికి ఏమాత్రం ఇష్టపడతారన్నదే సందేహం. అతను వీర లెవెల్లో హీరోయిజం చూపిస్తూ ఫైట్లు చేస్తే జనాలు ఎగిరి గంతేసేస్తారా.. లేక ‘మర్యాదరామన్న’ తరహా పాత్రల్లో చేసినపుడు ఎంజాయ్ చేస్తారా అన్నది అతనే ప్రశ్నించుకుంటే మంచిదేమో. సునీల్ ప్రయత్న లోపం లేకుండా పాత్రలో ఇమిడిపోవడానికి ప్రయత్నించినా.. అతను మరొకరి షూస్ లో కాళ్లు పెట్టినట్లు అనిపించిందే తప్ప క్యారెక్టర్ సహజంగా అనిపించలేదు. హీరోయిన్లిద్దరిలో నిక్కీ గర్లాని పర్వాలేదు. డింపుల్ చోప్డే వ్యాంప్ తరహా పాత్రలో కనిపించింది. హీరోయిన్లిద్దరూ గ్లామరస్ గా కనిపించారు. విలన్ అశుతోష్ రాణాది రొటీన్ పాత్ర. ఉన్నంతలో ముకేష్ రుషి బాగా చేశారు. పోసాని - బ్రహ్మి - సప్తగిరి ఓ మోస్తరుగా నవ్వించారు. పృథ్వీని సరిగ్గా వాడుకోలేదు. తులసి - పవిత్రా లోకేష్ పాత్రలకు తగ్గట్లు నటించారు.

సాంకేతిక వర్గం:

దినేష్ సంగీతం అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. పాటల్లో రెండు వినబుల్ గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ మామూలుగా అనిపిస్తుంది. ఛోటా కె.నాయుడు ఛాయాగ్రహణం సినిమాకు ప్రధాన ఆకర్షణ. కారును రివర్స్ లో నడుపుతూ సాగే ఛేజ్ సీన్ లో ఛోటా పనితనం కనిపిస్తుంది. దిల్ రాజు సినిమా కాబట్టి నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ఇక దర్శకుడు వాసు వర్మ.. తొలి సినిమా ‘జోష్’తో ఫెయిల్యూర్ ఎదుర్కొన్నప్పటికీ అందులో డైరెక్టర్ గా అతడి ముద్ర కనిపిస్తుంది. కానీ రెండో సినిమాకు వచ్చేసరికి సక్సెస్ కోసం పూర్తిగా రొటీన్ బాటలోకి వచ్చేశాడు. ఎక్కడా ఒక ముద్రంటూ కనిపించలేదు. అరిగిపోయిన సన్నివేశాలన్నీ తిరగరాసి ‘టెంప్లేట్’ సినిమా తయారు చేశాడు.

చివరగా: కృష్ణ కృష్ణా.. మళ్లీ అదే ఫార్ములానా?

రేటింగ్- 2.5/5

Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre