Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

By:  Tupaki Desk   |   19 Jun 2015 10:46 AM GMT
సినిమా రివ్యూ :  కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ
X
రివ్యూ: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

రేటింగ్‌: 2.75 /5

తారాగణం: సుధీర్‌ బాబు, నందిని, పోసాని కృష్ణమురళి, ప్రగతి, గిరిబాబు, సుధ, కృష్ణ చైతన్య తదితరులు

సంగీతం: హరి

ఛాయాగ్రహణం: చంద్రశేఖర్‌

నిర్మాతలు: లగడపాటి శిరీష, శ్రీధర్‌

రచన, దర్శకత్వం: చంద్రు



హీరోగా నిలదొక్కుకోవడానికి బాగానే కష్టపడుతున్నాడు సుధీర్‌ బాబు. కానీ అతడి సినిమాలు సరైన ఫలితాన్నివ్వడం లేదు. ఈ మధ్యే విడుదలైన 'మోసగాళ్లకు మోసగాడు' కూడా నిరాశ పరిచింది. ఇంతలోనే 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' అనే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కన్నడలో విజయవంతమైన 'చార్మినార్‌'కు ఇది రీమేక్‌. మాతృకను రూపొందించిన టీమ్‌తోనే నిర్మాత లగడపాటి శ్రీధర్‌ ఈ సినిమాను తెలుగులోకి తీసుకొచ్చాడు. మరి వారి ప్రయత్నం ఏమేరకు ఫలించిందో చూద్దాం.

కథ:

కృష్ణ (సుధీర్‌బాబు), రాధ (నందిత)ల ప్రేమ ప్రయాణమే ఈ కథ. ఎనిమిదో తరగతి చదువుతుండగా తన క్లాసులోకి కొత్తగా వచ్చిన రాధను చూసి ప్రేమలో పడతాడు కృష్ణ. చదువు మీద శ్రద్ధ లేని కృష్ణ.. రాధ కోసమే బాగా చదవడం మొదలుపెడతాడు. ఇంటర్లోకి వచ్చేసరికి అతడి ప్రేమ మరింత ఊపందుకుంటుంది. రాధకు ప్రేమలేఖ కూడా రాస్తాడు. ఐతే ఆ ప్రేమలేఖ అతడి ప్రిన్సిపల్‌ దగ్గరికి చేరుతుంది. ప్రిన్సిపల్‌ చేసిన హితబోధతో తన గమ్యం మార్చుకుని కెరీర్‌ మీద దృష్టిపెడతాడు కృష్ణ. ఐతే రాధను మాత్రం మరిచిపోలేకపోతాడు. ఇంజినీరింగ్‌ చదువుతుండగా మరోసారి రాధ అతడికి కనిపించి.. ఆ తర్వాత దూరమవుతుంది. చదువు పూర్తి చేశాక యుఎస్‌లో పెద్ద ఉద్యోగం కూడా సంపాదిస్తాడు కృష్ణ. కానీ రాధను మాత్రం సొంతం చేసుకోలేకపోతాడు. ఓ కంపెనీకి సీఈవో అయ్యాక పూర్వ విద్యార్థుల సమావేశం కోసం తన ఊరికి బయల్దేరతాడు. అక్కడ రాధను కలవొచ్చని.. తన ప్రేమను చెబుదామని అనుకుంటాడు. మరి అక్కడికి రాధ వచ్చిందా? కృష్ణ తన ప్రేమను చెప్పాడా? రాధను తన సొంతం చేసుకున్నాడా? అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ:

స్వచ్ఛమైన ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది.. కాల పరీక్షకు నిలబడి విజయవంతమవుతుంది.. అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ప్రేమకథ 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'. ఓ వ్యక్తి జీవితంలోని మూడు దశల్లో అతడి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగి.. చివరికి ఏ గమ్యం చేరిందన్నది.. 'ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌' తరహా కథనంతో చెప్పే ప్రయత్నం చేశారు. ఎంత వద్దన్నా ఈ సినిమా చూస్తున్నపుడు 'ఆటోగ్రాఫ్‌' గుర్తుకొస్తూనే ఉంటుంది. ఆ ఛాయలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఐతే 'ఆటోగ్రాఫ్‌'లో కథానాయకుడికి ఒక్కో దశలో ఒక్కో లవ్‌ స్టోరీ ఉంటే.. ఇక్కడ హీరోకి ఒక్కటే లవ్‌ స్టోరీ. కెరీర్‌లోనూ గెలవాలి.. ప్రేమలోనూ గెలవాలి.. అదే నిజమైన విజయం అని చూపించే ప్రయత్నం కూడా చేశారు.

ఇలాంటి కథల్ని ప్రేక్షకుడు ఫీల్‌ అయినప్పుడే ఆ ప్రయత్నం విజయవంతమవుతుంది. ఐతే ఆ ఫీల్‌ తేవడంలో దర్శకుడు చంద్రు కొంత వరకు విజయవంతమయ్యాడు. కానీ కథనంలో చెప్పుకోదగ్గ మలుపులేమీ లేకుండా చాలా ప్లెయిన్‌గా రాసుకోవడం వల్ల.. నరేషన్‌ చాలా నెమ్మదిగా ఉండటం వల్ల ఆడియన్స్‌ రెండున్నర గంటల పాటు కుదురుగా కూర్చోవడం కొంచెం కష్టమైంది. ఇదో నిజమైన కథ నుంచి స్ఫూర్తి పొంది రాసిన కథ అని చెప్పారు. ఐతే ఆ కథ బహుశా ఓ ఇరవయ్యేళ్ల ముందుదై ఉండొచ్చేమో. ఎందుకంటే అప్పుడైతేనే హీరో హీరోయిన్లు కమ్యూనికేషన్‌ అన్నదే లేకుండా దూరమైపోవడం జరుగుతుంది. కానీ సినిమా అంతా ఈ కాలంలో జరుగుతున్నట్లే చూపించారు. హీరో హీరోయిన్లకు సెల్‌ఫోన్లు కూడా ఉంటాయి. మరి అలాంటపుడు ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండిపోవడం.. తమ ప్రేమ చెప్పుకోకపోవడం.. హీరో అమెరికాకు వెళ్లగానే హీరోయిన్‌తో కనెక్షన్‌ కట్‌ అయిపోవడం.. హీరోయిన్‌ జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగినా హీరోకు తెలియకపోవడం.. ఇవన్నీ చాలా డ్రమటిక్‌గా అనిపిస్తాయి.

హీరోకు అమెరికాలో ఉద్యోగం వస్తుంది. లక్షల్లో జీతం. హీరోయిన్‌కు తన ప్రేమ చెబుదామని ఇంటికెళ్తాడు. కానీ అతడి తల్లి ఆ అమ్మాయి మీదే తన కుటుంబం ఆధారపడిందని.. వెళ్లిపొమ్మని కాళ్ల మీద పడి అడుగుతుంది. హీరో ఉన్న స్థాయి ప్రకారం చూస్తే హీరోయిన్‌ను పెళ్లి చేసుకుని.. ఆమె కుటుంబాన్ని కూడా ఆదుకోవచ్చు. కానీ అతనా పని చేయకుండా ఏడుస్తూ వెళ్లిపోతాడు. అమెరికాలో పెద్ద కంపెనీకి సీఈవో అయ్యాక కూడా తాను ప్రేమించిన అమ్మాయినే తలుచుకుంటూ గడిపేసేంత ప్రేమ ఉన్నపుడు ఆమె కోసం ఏ ప్రయత్నం చేయకపోవడం.. ఫ్రెండ్స్‌ పూర్వ విద్యార్థుల సమావేశానికి పిలిస్తే అక్కడికొచ్చి తన ప్రేమను గెలిపించుకుందామని చూడటం లాజిక్‌కు అందదు.

ప్రేమకథను హీరో యాంగిల్‌ నుంచే చూపించడం కూడా ఓ మైనస్‌. అసలు హీరోయిన్‌ మనసులో ఏముందో ఏ దశలోనూ చూపించరు. ఆమె క్యారెక్టర్‌ను ప్యాసివ్‌గా మార్చేశారు. హీరోయిన్‌ ఓ బొమ్మలా మారిపోయింది ఈ ప్రేమకథలో. నందిత లాంటి మంచి నటి ఉన్నా.. ఆమెను ఏమాత్రం ఉపయోగించుకోలేదు. హీరోయిన్‌ యాంగిల్‌ నుంచి కూడా ప్రేమకథను నడిపి ఉంటే.. కథనంలో కొంచెం జోరుండేదేమో. సినిమా చివర్లో తమిళ సినిమాల్ని గుర్తుకు తెచ్చే ట్విస్ట్‌ ఇచ్చారు. దాన్ని మన ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో మరి.

చూపించింది టీనేజ్‌ లవ్‌ స్టోరీ అయినా.. బూతులు, రొమాంటిక్‌ సన్నివేశాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఓ ప్యూర్‌ లవ్‌ స్టోరీని చూపించాలనుకోవడం.. కెరీర్‌ కూడా చాలా ముఖ్యమని చెప్పడం.. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ జనరేషన్‌కు కనెక్టవ్వని ప్రేమకథను.. ఇప్పటి ప్రేక్షకులకు సూటవ్వని స్లో నరేషన్‌తో చెప్పాలని ప్రయత్నించడమే 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ'లో మైనస్‌. సుధీర్‌ బాబు వేసిన హీరో, పోసాని చేసిన ప్రిన్సిపల్‌, గిరిబాబు చేసిన తండ్రి పాత్రలు బాగున్నాయి. సినిమాలో అందరి పెర్ఫామెన్స్‌ బాగుంది. కొన్ని మంచి సన్నివేశాలున్నాయి. ఫీల్‌ ఉన్న మ్యూజిక్‌ కూడా తోడైంది. కానీ తెరమీద చూపించిన వ్యవహారం ఈ జనరేషన్‌ ఆడియన్స్‌కు కనెక్టవుతుందా అన్నదే సందేహం.

నటీనటులు:

సుధీర్‌ బాబుకు నటుడిగా ఇది బెస్ట్‌ ఫిలిం అని చెప్పాలి. తన మైనస్‌లను కవర్‌ చేసుకుని బాగానే నటించాడతను. వాయిస్‌ విషయంలోనూ అతను ఎంతో శ్రద్ధ పెట్టిన విషయంలో చాలా సన్నివేశాల్లో తెలుస్తుంది. రెండు మూడు చోట్ల ఏడ్చే సన్నివేశాల్లో కొంచెం ఇబ్బంది పడ్డాడు కానీ.. ఓవరాల్‌గా ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్‌కు ముందు స్టేజ్‌ ఎక్కి మాట్లాడే సన్నివేశంలో, హీరోయిన్‌ను కలిసినపుడు అతడి నటన ఆకట్టుకుంటుంది. నందిత లాంటి మంచి నటిని దర్శకుడు ఉపయోగించుకోలేదు. హీరోయిన్‌గా కీలక పాత్రే కానీ.. ఆమె తన టాలెంట్‌ చూపించే అవకాశం రాలేదు. ఆ పాత్రను ప్యాసివ్‌గా మార్చేశాడు దర్శకుడు. పోసాని క్యారెక్టర్‌ బాగుంది. అతనుండే రెండు సన్నివేశాలూ సినిమాకు కీలకం. గిరిబాబు తక్కువ సన్నివేశాల్లోనే ఇంపాక్ట్‌ చూపించారు. చైతన్య కృష్ణ క్యారెక్టర్‌ వల్ల సినిమాకు పెద్దగా ఉపయోగం లేదు.

సాంకేతిక వర్గం:

కన్నడ సంగీత దర్శకుడు హరి మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. పాటల ప్లేస్‌మెంట్‌ ఇబ్బంది పెట్టినా.. అన్నీ కూడా బాగున్నాయి. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌తో ప్రేమకథలో ఫీల్‌ తేవడానికి మంచి ప్రయత్నమే చేశాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఛాయాగ్రహణం మామూలుగా ఉంది. ఎడిటర్‌ చాలాచోట్ల కత్తెరకు పని చెప్పాల్సింది. డ్రైగా ఉన్న సన్నివేశాల్ని కూడా అలాగే వదిలేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు చంద్రు కథాకథనాలు కన్నడ ప్రేక్షకులకు బాగానే ఎక్కి ఉండొచ్చు కానీ.. తెలుగు సినిమా వేగాన్ని అతనందుకోలేకపోయాడేమో అనిపిస్తుంది. గతంలో 'ముంగారమలై'ని 'వాన'గా రీమేక్‌ చేసినపుడు కూడా జరిగిన తప్పులే ఇక్కడా జరిగాయి. సుధీర్‌ బాబు నుంచి మంచి పెర్ఫామెన్స్‌ రాబట్టుకోవడంలో.. పోసానితో వచ్చే సన్నివేశాల్లో దర్శకుడు ప్రతిభ చూపించాడు కానీ.. ఓవరాల్‌గా మాత్రం తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగ్గట్లు సినిమా తీయలేకపోయాడనే చెప్పాలి.

చివరిగా...

నెమ్మదిగా సాగే ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీల్ని, మెలోడ్రామాల్ని ఇష్టపడే ఉన్న ప్రేక్షకుల్ని 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' ఆకట్టుకోవచ్చు. ఐతే కథనంలో వేగం, మలుపులు, ఎంటర్టైన్మెంట్‌ కోరుకుంటే మాత్రం ఇది మీ 'కప్‌ ఆఫ్‌ టీ' కాదు.