Begin typing your search above and press return to search.

నాని.. అది రుజువు చేసేలాగే ఉన్నాడు

By:  Tupaki Desk   |   15 Feb 2016 12:38 PM IST
నాని.. అది రుజువు చేసేలాగే ఉన్నాడు
X
భలే భలే మగాడివోయ్ మంచి సినిమానే. నాని అందులో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఐతే ఆ సినిమా అంత పెద్ద విజయం సాధించడం.. ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం.. ముఖ్యంగా అమెరికాలో ఒకటిన్నర మిలియన్ డాలర్ల దాకా కొల్లగొట్టడం టాలీవుడ్ జనాలకు మింగుడు పడలేదు. ఈ కలెక్షన్లు గాలి వాటం అని.. దీన్ని చూసి నాని గురించి అతిగా ఊహించుకుంటే కష్టమని.. అతడికంత బాక్సాఫీస్ స్టామినా లేదని వెనకాల కామెంట్లు విసిరారు. ఐతే ‘భలే భలే మగాడివోయ్’కి ఏదో సరదాగా ‘నేచురల్ స్టార్’ అని వేసుకున్న నాని.. ఇప్పుడు నిజంగానే స్టార్ అని ఒప్పుకోక తప్పేలా లేదు.

ఎందుకంటే నాని లేటెస్ట్ మూవీ ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ కూడా ‘భలే భలే..’కు దీటుగా కలెక్షన్లు కొల్లగొడుతోంది. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ.15 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్ కలెక్ట్ చేసిందని అంచనా వేస్తున్నారు. యుఎస్ లో ప్రిమియర్లతో కలిపి రెండో రోజుకే 3 లక్షల డాలర్ల దాకా వసూలు చేసిందీ సినిమా. ఇది మామూలు ఫిగర్ కాదు. కొందరు స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యం. నాని మరోసారి మిలియన్ క్లబ్బును అందుకోవడం లాంఛనమే అన్నట్లుంది పరిస్థితి. మొత్తంగా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఫుల్ రన్ లో రూ.30 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. వరుసగా రెండు 30 కోట్ల షేర్ మూవీస్ ఇవ్వడమంటే మాటలు కాదు. గత విజయం గాలివాటం కాదని.. నిజంగానే తన రేంజి పెరిగిందని.. ఇక తనను స్టార్ హీరోగా పరిగణించాల్సిందే అని చాటిచెప్పేలా ఉన్నాడు నాని.