Begin typing your search above and press return to search.

పూరిని చూసి ఏడుపొచ్చింది

By:  Tupaki Desk   |   30 July 2017 10:44 PM IST
పూరిని చూసి ఏడుపొచ్చింది
X
డ్రగ్స్ కేసులో అందరికంటే ఎక్కువ నిందను ఎదుర్కొన్నవాడు పూరి జగన్నాథ్. అతడితో పాటు తన సన్నిహితులు కూడా చాలామంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం.. విచారణకు హాజరవడంతో పూరి మీద అనేక అనుమానాలు ముసురుకున్నాయి. ఐతే తన గురించి మీడియాలో జరిగిన ప్రచారం గురించి పూరి ఆవేదన వ్యక్తం చేశాడు. పూరి గురువు రామ్ గోపాల్ వర్మ విచారణ తీరుపై తీవ్ర అసహనం చెందాడు. ఇప్పుడు ఈ కేసుపై వర్మ మరో శిష్యుడు.. పూరికి సన్నిహితుడైన కృష్ణవంశీ స్పందించాడు. పూరి విషయంలో జనాలు.. మీడియా స్పందించిన తీరును కృష్ణవంశీ తప్పుబట్టాడు.

‘‘డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియా చాలా తుంటరిగా వ్యవహరించింది. ఈ విషయాన్ని అన్నిసార్లు చూపించాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ ‘శివ’ సినిమాకు జూనియర్‌ ఆర్టిస్టుగా వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు. అతను గొప్ప మనసున్న వ్యక్తి. ఎంతోమందికి సాయం చేశాడు. తన ప్రతి సినిమాలో ఏదో ఒక విషయాన్ని విప్లవాత్మకంగా తట్టి లేపేలా చెప్పాలని ప్రయత్నిస్తాడు. దగుల్బాజీగా సినిమాలు తీసేసి డబ్బు సంపాదించాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. పదిమందికి సాయం చేసిన అతను ఈ కేసులో ఉన్నాడన్న వార్త వినగానే ఏడుపొచ్చేసింది. అతను డ్రగ్స్‌ తీసుకున్నాడా లేదా అన్నది తనకు.. ఎక్సైజ్ వాళ్లకు సంబంధించిన విషయం. దానిపై నేను జడ్జిమెంట్.. కామెంట్ చెప్పే స్థితిలో లేను. ఐతే వాళ్లను ఎటాక్ చేయడాన్ని బాధతో ఖండిస్తున్నా. పూర్తి వివరాలు తెలియకుండా పగతో చేస్తున్నట్లుగా చేస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ కూడా ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు. వాళ్లకు కూడా కుటుంబాలున్నాయి. వాళ్లూ బతకాలి కదా. ఈ వ్యవహారంపై మా బాస్ రామ్ గోపాల్‌ వర్మ సరిగ్గా స్పందించారు. న్యూస్‌ ను గ్లామరైజ్‌.. డ్రమటైజ్‌ చేస్తున్నారు. తోటి మనిషి మీద మనవాడు అన్న భావన లేకపోవడం దీనికి కారణం అని తేల్చాడు కృష్ణవంశీ.