Begin typing your search above and press return to search.

చల్ మోహన్ రంగ.. కథ కాదు కథనంతో మ్యాజిక్

By:  Tupaki Desk   |   4 April 2018 7:52 AM GMT
చల్ మోహన్ రంగ.. కథ కాదు కథనంతో మ్యాజిక్
X
కథ కొత్తగా లేకపోయినా పర్వాలేదు.. కథనంలో.. ట్రీట్మెంట్లో కొత్తదనం చూపించి ప్రేక్షకుల మెప్పు పొందొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఈ తరం దర్శకులది. తాను కూడా ఆ కోవకే చెందుతానని అంటున్నాడు యువ దర్శకుడు కృష్ణచైతన్య. లిరిసిస్టుగా పరిచయమై దర్శకుడిగా మారి అతను తీసిన తొలి సినిమా ‘రౌడీఫెలో’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్ర కథ లైన్ చూస్తే మామూలుగా అనిపిస్తుంది. కానీ కథనం కొత్తగా నడిపించి మెప్పించాడు కృష్ణచైతన్య. ఇప్పుడు అతడి దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా ‘చల్ మోహన్ రంగ’ కూడా ఇదే తరహాలో నడుస్తుందని అంటున్నాడు.

ప్రపంచంలో ప్రేమకథలన్నీ దాదాపుగా ఒకేలా ఉంటాయని.. ‘చల్ మోహన్ రంగ’ కథ కూడా అంతే అని.. కానీ ఇందులో ప్రత్యేకత అంతా కథనంలోనే ఉంటుందని అతను చెప్పాడు. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని కృష్ణచైతన్య చెప్పాడు. తన తొలి సినిమాలో కథాకథనాలు సీరియస్‌ గా ఉంటాయని.. ఐతే ‘చల్ మోహన్ రంగ’ మాత్రం సరదాగా సాగుతుందని.. ఇందులోని ఫన్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పాడు. నితిన్-మేఘ జంటగా నటించిన ‘చల్ మోహన్ రంగ’ను నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించగా.. పవన్ కళ్యాణ్.. త్రివిక్రమ్ కూడా నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి కథ కూడా అందించడం విశేషం.