Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ రెండో భాగం వచ్చేది అప్పుడే

By:  Tupaki Desk   |   14 Dec 2018 10:08 PM IST
ఎన్టీఆర్ రెండో భాగం వచ్చేది అప్పుడే
X
క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా విడుదల అవుతుందన్న సంగతి తెలిసిందే. మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' జనవరి 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండవ భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' జనవరి నాలుగో వారంలో విడుదల చేసేందుకు మొదట్లో ప్లాన్ చేసినా ఆ ఆలోచనను తర్వాత విరమించుకున్నారు. తాజా సమాచారం ప్రకారం సెకండ్ పార్టుకు రిలీజ్ డేట్ లాక్ అయిందట.

ఫిబ్రవరి 7 న 'ఎన్టీఆర్ మహానాయకుడు' ను రిలీజ్ చేస్తున్నారట. కానీ ఈ విడుదల తేదీని వెంటనే ప్రకటించకుండా కొన్ని రోజులు ఆగి ప్రకటిస్తారట. మొదటి భాగం రిలీజ్ అయ్యాక దాదాపు నెలరోజుల పాటు సమయం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి క్రిష్ తన ఫోకస్ అంతా 'ఎన్టీఆర్ కథానాయకుడు' మీదే పెడుతున్నాడట. మొదటి భాగంలో ఎన్టీఆర్ బాల్యం దగ్గరనుండి మొదలుపెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం.. హీరోగా అత్యున్నత శిఖరాలను అధిరోహించడం వరకూ ఉంటుంది. రెండో భాగంలో మాత్రం ఎన్టీఆర్ రాజకీయజీవితం పై ఫోకస్ ఉంటుందని సమాచారం.

సంక్రాంతి సీజన్లో భారీ పోటీ మధ్య ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం విడుదల అవుతోంది. ఇప్పటి వరకూ చరణ్ సినిమా 'వినయ విధేయ రామ'.. వెంకటేష్ - వరుణ్ తేజ్ మల్టిస్టారర్ 'F2' సినిమాలు సంక్రాంతి సీజన్లో షెడ్యూల్ అయి ఉన్నాయి. అయినా ఎన్టీఆర్ బయోపిక్ పై నెలకొన్న హైప్ తో భారీ కలెక్షన్స్ వస్తాయనే అంచనాలు ఉన్నాయి. పైగా సంక్రాంతి సీజన్ బాలయ్యకు పాజిటివ్ సెంటిమెంట్ కాబట్టి బాక్స్ ఆఫీస్ పోటీలో బాలయ్య విజేతగా నిలుస్తాడని నందమూరి అభిమానులు నమ్మకంగా ఉన్నారు.