Begin typing your search above and press return to search.

కథ రెడీ కాకుండానే 'యన్.టి.ఆర్' మొదలెట్టారా?

By:  Tupaki Desk   |   21 Feb 2019 10:35 AM GMT
కథ రెడీ కాకుండానే యన్.టి.ఆర్ మొదలెట్టారా?
X
ఎన్టీఆర్ మీద బయోపిక్ ప్రకటన వచ్చి రెండేళ్లు దాటింది. ఎన్టీఆర్ జీవితం మీద బాలయ్య నేతృత్వంలో ఒక టీం ఏడాదికి పైగా పని చేసింది. అనేక ప్రాంతాలు తిరిగి - అనేక మందిని కలిసి ఆయన జీవిత విశేషాల్ని తెలుసుకున్నారు. తమకు తెలిసిన సమాచారంతో కథకు ఒక రూపం తెచ్చారు. స్క్రిప్టు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాకే దర్శకుడిగా తేజ ఎంపిక జరిగింది. అతను కొన్ని నెలల పాటు ఈ స్క్రిప్టు మీద పని చేసి దానికి తన టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల తేజ ఆ సినిమా నుంచి తప్పుకోవడంతో క్రిష్ లైన్లోకి వచ్చాడు. చకచకా తన శైలిలో ఒక స్క్రిప్టు రెడీ చేసి సినిమాను పట్టాలెక్కించాడు. ఐతే బాలయ్య ఆధ్వర్యంలో పని చేసిన టీంకే కథ విషయంలో ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలనే అభిప్రాయం ఉంది. కానీ సినిమాలో మాత్రం కథ - స్క్రీన్ ప్లే క్రెడిట్ క్రిష్‌ యే తీసుకున్నాడు. రచనా సహకారం కింద ఒక పేరు పడింది.

ఆ సంగతలా వదిలేస్తే.. తేజ దర్శకత్వంలో మొదట అనుకున్న కథకి - ఆపై క్రిష్ వచ్చాక సిద్ధమైన కథకు ఏమైనా తేడా ఉందా.. ఏమైనా మార్పులు చేశారా అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాలయ్యను అడిగితే.. ఆయన ఆశ్చర్యకర సమాధానం ఇచ్చాడు. క్రిష్ వచ్చాకే అసలు స్క్రిప్టుని మొదలు పెట్టామని.. అంతకుముందు సిద్ధమైన కథ చాలా తక్కువ అని అన్నాడు. మరి కథ రెడీ కానపుడు.. తయారైన కథ కూడా చాలా తక్కువ అయినప్పుడు తేజ దర్శకత్వంలో సినిమా ఓకే చేసి.. అంగరంగ వైభవంగా సినిమా ప్రారంభోత్సవం జరిపి.. సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఎలా ఆరంభించారన్నది ప్రశ్న. క్రిష్ ఈ సినిమాకు ఓకే అనుకున్న రెండు నెలల్లో సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. అంత తక్కువ వ్యవధిలో క్రిష్ కొత్తగా ఏం పరిశోధించాడు.. కొత్తగా ఏం కథ రాశాడు.. స్క్రిప్టు ఎలా తీర్చిదిద్దాడన్నది ప్రశ్న. ఇప్పటికే ఉన్న గందరగోళం చాలదని.. బాలయ్య వ్యాఖ్యలతో ‘యన్.టి.ఆర్’ కథ విషయంలో అయోమయం పెరిగిపోతోంది.