Begin typing your search above and press return to search.

సీతారామశాస్త్రి క్రిష్ ను ఏడిపించేసిన వేళ..

By:  Tupaki Desk   |   6 Dec 2015 5:30 PM GMT
సీతారామశాస్త్రి క్రిష్ ను ఏడిపించేసిన వేళ..
X
‘గమ్యం’ లాంటి గొప్ప సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు జాగర్లమూడి క్రిష్. కానీ అలా అడుగుపెట్టడానికి ముందు అతడు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మంచి కథ.. గొప్ప సినిమా అవుతుంది.. పెట్టుబడి పెట్టండి అని చాలా మంది నిర్మాతల్ని కలిశాడు. ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేశాడు. కానీ ఎవ్వరూ కరుణించలేదు. దీంతో కొడుకు బాధ చూసి క్రిష్ తండ్రే చివరికి ఆ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాడు. స్నేహితులు కూడా సాయం చేయడంతో, ఉన్నదంతా ఊడ్చి సినిమా పూర్తి చేయగలిగాడు క్రిష్. ఐతే తాను అంత కష్టపడి సినిమా తీయడానికి స్ఫూర్తినిచ్చింది సీతారామశాస్త్రేనని... ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, ఉత్సాహంతోనే తాను సినిమా పూర్తి చేయగలిగానని చెప్పాడు క్రిష్.

‘‘గమ్యం కథ మొత్తం వినగానే శాస్త్రి గారు ‘ఇదిరా కథంటే’ అన్నారు. ‘గురువుగారూ నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవండీ. ఒక్క పాట రాయండి’ అని ఇబ్బంది పడుతూ అడిగాను. దానికి ఆయన ‘ఇది ఒక మనిషి గురించి ఒక మనిషి చెబుతున్న కథరా. ఆ మనిషి కోసం ఈ మనిషి అన్ని పాటలూ రాస్తాడు. ఒక్క పైసా కూడా ఇవ్వద్దు. నీకు అవసరమైతే నన్నే అడుగు’ అన్నారు. ఆ క్షణంలో నా కళ్లు చెమ్మగిల్లాయి. సినిమా పూర్తి చేశాక ప్రసాద్ ల్యాబ్ లో ప్రివ్యూలు వేసి చాలామంది చూపించాను. కానీ ఎవ్వరూ కొనలేదు. కానీ అప్పుడు కూడా సీతారామశాస్త్రి గారే అండగా నిలిచారు. ప్రివ్యూ చూసి.. ‘నాకు చెప్పినదాని కంటే బాగా తీశావు. నేనొక కోడిని. సూర్యుడిలా నువ్వు వస్తున్నావన్న విషయాన్ని ముందుగా గమనించి కొక్కొరకో అంటూ లోకానికి చెబుతున్నా’ అన్నారు. ఆయన అందరికీ ‘గమ్యం’ గురించి చెప్పడంతోనే సినిమా విడుదలైంది’’ అని గమ్యం రోజుల్ని గుర్తు చేసుకున్నాడు క్రిష్.