Begin typing your search above and press return to search.

'ఇప్పటి హీరోలకు సాధన తక్కువై వాదన ఎక్కువైంది.. విజ్ఞానం పెరిగి జ్ఞానం తగ్గుతోంది'

By:  Tupaki Desk   |   12 July 2021 10:56 AM GMT
ఇప్పటి హీరోలకు సాధన తక్కువై వాదన ఎక్కువైంది.. విజ్ఞానం పెరిగి జ్ఞానం తగ్గుతోంది
X
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పాత్ర ఏదైనా సరే దానికంటూ స్పెషల్ మేనరిజం జోడించి అలరించడం ఆయన శైలి. తెలుగు తమిళ హిందీ కన్నడ భాషల్లో 750కి పైగా సినిమాల్లో నటించిన కోట.. ఇప్పటికే తన వయసుకు తగిన పాత్రలు వస్తే నటించడానికి సిద్ధమే అంటున్నారు. కామెడీ విలన్‌ గా క్రూరమైన విలన్‌ పాత్రలలో మెప్పించిన కోట.. క్యారక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. 77 ఏళ్ల తన జీవితంలో 43 సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు సేవ చేశారు కోట. టాలీవుడ్ లో క్రమ శిక్షణ కలిగిన నటుడిగా పేరున్న ఆయన.. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇక కోట శ్రీనివాసరావు ముక్కుసూటిగా మాట్లాడే స్వభావం కలిగినవారు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు ఉన్నదున్నట్టు చెప్పేస్తుంటారు. ఇటీవలే 78వ ఏట అడుగుపెట్టిన కోట.. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ జనరేషన్ హీరోలపై తనదైన శైలిలో సెటైర్లు వేసారు.

మూడు జనరేషన్స్ హీరోలను చూసిన మీరు ఏమి మార్పులు గమనించారు అని ప్రశ్నించగా.. జనరేషన్ మారుతోంది గాని, హీరోల్లో మార్పు రావడం లేదని.. ఇప్పుడు హీరోలకు సాధన తక్కువై వాదన ఎక్కువైందని కోట శ్రీనివాసరావు సమాధానం చెప్పారు. "ఈ తరం హీరోలకు సాధన తక్కువై వాదన ఎక్కువైంది. హీరోలన్నప్పుడు జ్ఞానం పెంచుకోవాల్సి ఉంటుంది. విజ్ఞాన్ని కూడా పెంచుకోవాలి. కానీ ఇప్పుడు విజ్ఞానం పెంచుకుంటున్నారు కానీ జ్ఞానం పోగొట్టుకుంటున్నారు. మైక్ పట్టుకొని మాట్లాడుతున్నవారు ఒక్కరు కూడా మన తెలుగు భాషలో మాట్లాడడం లేదు. నిజానికి తోటి వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం తగ్గించేశారు. వేసుకునే బట్టల్లో మార్పు వచ్చినంత వేగంగా జ్ఞానం పెరగడం లేదు'' అని కోట అన్నారు.

''డబ్బుంటే చాలు ప్రతి ఒక్కడు హీరో అయిపోతున్నారు. నటించాలనే కసి మాత్రం ఉండడం లేదు'' అని చెప్పిన కోట శ్రీనివాసరావు.. జూ. ఎన్టీఆర్ లాంటి కొంతమంది మాత్రం చాలా బాగా నటించే వారు ఉన్నారని అన్నారు. ఇంకా నాని లాంటి ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో ఎదిగే వారిని ప్రశంసించాలని పేర్కొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై స్పందించిన కోట.. అసోసియేషన్ లో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయని.. గతంలో తాను ట్రెజరర్ గా చేసినప్పుడు గొడవలు జరిగితే ఒక నమస్కారం పెట్టి ఆ పోస్ట్ వదిలేశాని తెలిపారు. 'మా' ఎన్నికలు దేశానికి సంబంధించిన వ్యవహారం కాదని.. ఓ 450 మంది సభ్యులు మాత్రమే ఓటేస్తారని.. అలాంటిది వాళ్ళు మైక్ పట్టుకొని మాట్లాడ్డం ఏంటని ప్రశ్నించారు. ఏదైనా మాట్లాడాలనుకుంటే అధ్యక్షుడికి ఉత్తరం రాయాలని.. లేదా మీటింగ్ లో మాట్లాడాలి.. అంతేకానీ ప్రెస్ మీట్ పెట్టి టీవీలో మాట్లాడితే అసోసియేషన్ లో కష్టాలు టీవీలు తీరుస్తాయా? అన్నారు కోట.

ఇంకా కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''పదేళ్ల క్రితం వరకూ సినిమా అనేది తల్లి పాల లాంటిది. ఇప్పుడు సినిమా డబ్బాపాలు మాదిరిగా తయారైంది. ప్రపంచం మామూలుగానే ఉంది. సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు.. పడమర అస్తమిస్తున్నాడు. కానీ మనలోనే మార్పు వచ్చింది. ఈ జనరేషన్ పిల్లలు విజ్ఞానం పెంచుకుంటూ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. చెప్పేవాళ్లూ లేరు. చెబితే వినరు. ఇలా అంటే ఈతరానికి కోపం రావచ్చు. సాధన లేకపోతే ఏమీ చేయలేము. నా గురువులు గొప్పవారు కాబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నాను'' అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ఎవరికి వారు స్వార్థం చూసుకుంటే సినిమా హాళ్లు కల్యాణ మండపాలుగా మారిపోతాయని హెచ్చరించారు కోట శ్రీనివాసరావు.