Begin typing your search above and press return to search.
పాలిటిక్స్ - సినిమాలపై కోటా షాకింగ్ కామెంట్స్!
By: Tupaki Desk | 8 Jan 2018 5:56 PM GMTబీజేపీ మాజీ ఎమ్మెల్యే - విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లో ధనప్రవాహం పెరగడంతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని కోటా గతలో చెప్పారు. గతంలో విజయవాడ నుంచి బీజేపీ తరపున కోటా అక్కడ ఘన విజయం సాధించారు. తాజాగా - తెలుగు - తమిళ రాజకీయాలపై కోటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రపక్షం అయిన టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో జనసేనాని పవన్ పై ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, తమ పార్టీకి ఏపీలో అంత బలం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉండడమే కరెక్టన్నారు. ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ......ఒలిచి ఇచ్చిన అరటిపండు చేతికి దక్కిందని - అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అన్నీ వసతులు హైదరాబాద్ లో ఉన్నాయన్నారు. దీంతో, రాష్ట్రాన్ని పరిపాలించడం ఆయనకు తేలికని - తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రమని చెప్పారు. ఆకులు పట్టుకుని విస్తరి తయారు చేసుకొనే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం ఉందన్నారు. హైదరాబాద్ లాగా బెజవాడ - అమరావతి రూపాంతరం చెందాలంటే ఇరవై సంవత్సరాలు పడుతుందన్నారు. పరిపాలనా దక్షకుడు - ముందుచూపు ఉన్న చంద్రబాబు చేతిలో ఏపీ ఉండడమే మంచిదని - ఏపీని ఇంకెవరు అభివృద్ధి చేయగలరని ఆయన ప్రశ్నించారు. మూడున్నరేళ్ల కాలంలో ఏపీ లో జరిగిన అభివృద్ధి గురించి ప్రశ్నించడం - ప్రభుత్వాన్ని నిందించడం తొందరపాటవుతుందన్నారు.
సినిమా హీరోలకు రాజకీయాలు సరిపడవని కోటా అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చాడని, అయితే, సాధ్యమైనంత త్వరగా పార్టీ పెట్టాలని - లేకుంటే ఆయన అభినానులు నిరుత్సాహపడతారని చెప్పారు. ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి అనుభవాన్ని పవన్ గుర్తుంచుకోవాలని - రాజకీయాల్లోకి రావడం సులువని, కానీ అందులో ఉండే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పవన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ....బీజేపీని గెలిపించగలిగినంత సమర్థవంతమైన నాయకుడులేడని కోటా అభిప్రాయపడ్డారు.
తెలుగు సినిమాలపై కోటా షాకింగ్ కామెంట్స్ చేశారు. 5 అడుగులున్న హీరో....ఆరడుగులున్న విలన్ ను కొడితే విలన్ ఎగిరి ఫ్యాక్టరీ ఫౌంటెయిన్ కు గుద్దుకుంటాడని......చెబుతూ తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన కమర్షియల్ నేచర్ ని ఎద్దేవా చేశారు. టెక్నాలజీని సద్వినియోగం చేసుకొని మంచి చిత్రాలు తీయవచ్చన్నారు. ఒక సీన్ కు అనేక టేక్ లు తీసుకోవడాన్ని కోటా ఆయన తప్పు పట్టారు. దానివల్ల డబ్బు, సమయం వేస్ట్ అవుతాయన్నారు. అపుడు కొంత ఖర్చు పెట్టి ఎంతో చూపిస్తే - ఇప్పుడు ఎంతో ఖర్చు పెట్టి కొంతే చూపిస్తున్నారన్నారు. అదేవిధంగా - సినిమాకు సంబంధించి అనేక విభాగాల్లో పని చేసిన వారిని గుర్తించాలని - కేవలం కొంతమందికే ప్రాధాన్యత దక్కడం సబబు కాదని కోట అన్నారు.