Begin typing your search above and press return to search.

చిరు-కొరటాల.. రంగం సిద్ధం

By:  Tupaki Desk   |   7 July 2018 11:14 AM IST
చిరు-కొరటాల.. రంగం సిద్ధం
X
టాలీవుడ్లో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరమీదికి వచ్చింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే మెగాస్టార్ చిరంజీవి.. ఏస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ‘సైరా నరసింహారెడ్డి’ తర్వాత ఆయన నటించే సినిమా ఇదే కాబోతోంది. రీఎంట్రీలో ‘ఖైదీ నంబర్ 150’తో పాటు ‘సైరా’ చిత్రాన్ని కూడా సొంత బేనర్ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’లోనే చేస్తున్న చిరు.. కొరటాల శివ సినిమాను కూడా ఇందులోనే చేయబోతున్నాడట.

అంటే తన తండ్రితో హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నాడన్నమాట నిర్మాత రామ్ చరణ్. ప్రస్తుతం కొరటాల హాలిడే ట్రిప్‌ లో ఉన్నాడు. దాన్నుంచి రాగానే సినిమా గురించి ప్రకటన చేస్తారట. ‘సైరా’ పూర్తయిన వెంటనే చిరు ఈ సినిమా మీదికి వెళ్లిపోతాడు. ఇప్పటికే కొరటాల లైన్ కు చిరు ఓకే చెప్పారట. దాన్ని పూర్తిస్థాయి స్క్రిప్టుగా తీర్చిదిద్ది ఈ ఏడాది చివరికి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలున్నాయి.

‘మిర్చి’.. ‘శ్రీమంతుడు’.. ‘జనతా గ్యారేజ్’.. ‘భరత్ అనే నేను’.. ఇలా కొరటాల తీసిన సినిమాలన్నీ వసూళ్ల వర్షం కురిపించాయి. నాలుగే నాలుగు సినిమాలతో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన కొరటాలకు ప్రస్తుతం తిరుగులేని డిమాండ్ ఉంది తెలుగులో. వరుసగా సూపర్ స్టార్లతో సినిమాలు చేస్తూ.. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ తోనే సినిమా తీయబోతున్నాడు. నిజానికి కొరటాల రెండో సినిమాను రామ్ చరణ్ తో చేయాల్సింది. కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగింది. ఇప్పుడతను చరణ్ నిర్మాణంలో అతడి తండ్రితో సినిమా చేయబోతుండటం విశేషమే.