Begin typing your search above and press return to search.

ఇన్సైడ్ టాక్: 'ఆచార్య' ప్రీరిలీజ్ ఈవెంట్ పట్ల కొరటాల నిరాశ చెందారా..?

By:  Tupaki Desk   |   26 April 2022 6:00 PM IST
ఇన్సైడ్ టాక్: ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ పట్ల కొరటాల నిరాశ చెందారా..?
X
మెగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్కలిసి నటించిన ''ఆచార్య'' సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

'ఆచార్య' చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. 'భరత్ అనే నేను' తర్వాత దర్శకుడి నుంచి వస్తోన్న సినిమా ఇది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున.. సినిమాపై అంచనాలు కలిగించింది.

ఇటీవల గ్రాండ్ గా నిర్వహించిన 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా విజవంతమై సినిమాపై బజ్ ఏర్పడేలా చేసింది. అయితే ఈ ఈవెంట్ పట్ల దర్శకుడు కొరటాల నిరాశ చెందారని ఇన్సైడ్ టాక్. దీనికి కారణం ఇది ఎస్ఎస్ రాజమౌళి భజన సభగా మారడమే అని కామెంట్స్ వస్తున్నాయి.

'ఆచార్య' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు స్టార్ డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్టుగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేదికపై జక్కన్న ను మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. ఈ సందర్భంగా 34 ఏళ్ల క్రితంనాటి అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.. దర్శకుడు రాజమౌళి ఇన్నేళ్ల తర్వాత తాను గర్వపడేలా, రొమ్ము విరుచుకునేలా చేశాడని చిరంజీవి పేర్కొన్నారు.

'బాహుబలి' 'RRR' సినిమాలతో ఒక్క ఇండియాలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా ఏంటో చాటి చెప్పారని జక్కన్న ను పొగడ్తలతో ముంచెత్తారు చిరు. అలాంటి దర్శకుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండటం గర్వకారణమని ప్రశంసించారు. ఇండియన్ సినిమా అనేది ఒక మతం అయితే.. దానికి మఠాధిపతి రాజమౌళి అంటూ సంభోదించారు.

ఇలా 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా దర్శకధీరుడు నామస్మరణతో మార్మిగిపోయింది. స్టేజీ మీద ప్రతీ ఒక్కరూ జక్కన్న ను స్తుతించడంతో మెగా ఈవెంట్ కాస్తా జక్కన్న భజన సభగా మారిపోయిందని.. ఇన్నేళ్లు కష్టపడి సినిమా చేసిన డైరెక్టర్ కొరటాల శివ హైలైట్ అవలేదనే కామెంట్స్ వచ్చాయి.

నిజానికి సినిమా గురించి.. అందులో భాగమైన నటీనటులు - దర్శకుడు మరియు ఇతర సాంకేతిక నిపుణులు గురించి చెప్పుకోడానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికలను ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆ సినిమా కోసం టీమ్ అంతా ఎంత కష్టపడ్డారో తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు.

'ఆచార్య' సినిమా కోసం కొరటాల చాలా సమయమే కేటాయించారు. బ్లాక్ బస్టర్ తర్వాత కూడా మరో మూవీ చేయకుండా.. మెగా కమిట్ మెంట్ కే కట్టుబడి ఉన్నారు. 'సైరా నరసింహా రెడ్డి' ఆలస్యం అవుతున్నా.. చిరంజీవి కోసం ఎదురుచూశారు కొరటాల.

సినిమా సెట్స్ మీదకు వచ్చిన తర్వాత కరోనా పాండమిక్ వల్ల ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వచ్చింది. అభిమానుల నుంచి వచ్చే ప్రెజర్ వల్ల సోషల్ మీడియా నుంచి తప్పుకున్నారు కూడా. తండ్రీకొడుకులు చిరు - చరణ్ లను ఒకే స్క్రీన్ మీద అద్భుతంగా ప్రెజెంట్ చేయడానికి ఎంత చేయాలో అంత చేశారు.

అయితే చివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాని తెరకెక్కించిన దర్శకుడి శ్రమని కొనియాడకుండా.. గెస్టుగా వచ్చిన డైరెక్టర్ ను ఆకాశానికి ఎత్తడం ఏంటని కొరటాల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం శివ ను పొగుడుతూ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.

ఏదేమైనా 'ఆచార్య' సినిమా రిలీజ్ తర్వాత అందరూ కొరటాల గురించి మాట్లాడుకుంటారని ఫ్యాన్స్ అంటున్నారు. కమర్షియల్ అంశాలతో తనదైన సందేశం జోడించి దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల కు మెగా మూవీ ఎలాంటి పేరు తెచ్చి పెడుతుందో చూడాలి.