Begin typing your search above and press return to search.

బెన్ కింగ్స్ లే `గాంధీ` త‌ర‌హాలో కొర‌టాల డ్రీమ్ ప్రాజెక్ట్

By:  Tupaki Desk   |   28 April 2022 10:00 AM IST
బెన్ కింగ్స్ లే `గాంధీ` త‌ర‌హాలో కొర‌టాల డ్రీమ్ ప్రాజెక్ట్
X
మ‌న జాతిపిత మ‌హాత్మా గాంధీ జీవిత క‌థ ఆధారంగా హాలీవుడ్ ద‌ర్శ‌కుడు రిచ‌ర్డ్ అటెన్ బ‌రో నిర్మించి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం `గాంధీ`. ఇందులో మ‌హాత్ముడి పాత్ర‌లో హాలీవుడ్ న‌టుడు బెన్ కింగ్స్ లే న‌టించారు. హాలీవుడ్ ర‌చ‌యిత రిచ‌ర్డ్ జాన్ బ్రీలే క‌థ అందించారు. అంతా హాలీవుడ్ న‌టులే న‌టించిన ఈ సినిమా 1982లో విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించింది. మ‌హాత్ముడి బ‌యోపిక్ గా రికార్డు కెక్కింది. అంతే కాకుండా ఓ ఇండియ‌న్ బ్రిటీష‌ర్ల‌పై సాగించిన స్వాతంత్య్ర పోరాటం నేప‌థ్యంలో రూపొంది హాలీవుడ్ వాళ్లే స్వ‌యంగా తెర‌పైకి తీసుకొచ్చిన తొలి భార‌తీయుడి సినిమా గా కూడా ఈ సినిమా అరుదైన ఘ‌న‌త‌ని సొంతం చేసుకుంది.

స్వామీ వివేకానంద పై సినిమా చేస్తే అదే స్థాయిలో చేస్తాన‌ని చెబుతున్నారు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల‌తో ఆయ‌న తెర‌కెక్కించిన భారీ చిత్రం `ఆచార్య‌`. ఓ సామాజిక అంశానికి క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని జోడించి అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న మ‌రో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్న ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తాజాగా మీడియాతో ముచ్చ‌టించారు.

ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానాలు చెప్పిన కొర‌టాల శివ‌. `ఆచార్య‌` చిత్ర విశేషాల‌తో పాటు భ‌విష్య‌త్ ప్రాజెక్ట్ లు, ఎన్టీఆర్ 30వ సినిమా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప - 2` త‌రువాత చేయ‌నున్న ప్రాజెక్ట్ కి సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివ‌రాల‌ని కూడా వెల్ల‌డించ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా కొర‌టాల శివ మాట్లాడుతూ `స్వామీ వివేకానంద మీద గాంధీ లాంటి సినిమా తీయాల‌ని వుంది. వైడ్ స్కేల్ లో ప్ర‌పంచం మొత్తం చూసేలా ఓ సినిమా చేయాల‌ని వుంది. అది ఎప్పటికి అవుతుందో తెలియ‌దు. నాకు అంత అనుభ‌వం రావాలి. దానికి చాలా రిసెర్చ్ చేయాలి. నేను తెలుసుకున్న మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ సోల్ వున్న వాళ్ల‌లో స్వామి వివేకానంద ఒక‌రు. ఆయ‌న ఇండియాని భారీ స్థాయిలో ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. సోష‌ల్ మీడియా, మీడియా వంటివి ఏమీ లేని రోజుల్లో.. 19 వ శ‌తాబ్దంలోనే భారీ స్థాయిలో ఇన్‌ఫ్లూయెన్స్ చేశారంటే ఆయ‌న ఎలాంటి ప‌ర్స‌నాలిటీయో అర్థం చేసుకోవ‌చ్చు.

ఆయ‌న అందించిన సందేశాన్ని ప్ర‌పంచానికి చేర‌వేయాలంటే ఓ సినిమా తీయాలి. అందుకే ఆయ‌న సినిమా చేయాల‌నుకుంటున్నాను. `గాంధీ` సినిమాని హాలీవుడ్ మేక‌ర్స్ ఎలా తీశారో ఆ రేంజ్ లో స్వామీ వివేకానంద పై సినిమా తీయాలి. చిన్న స్కేల్ లో మాత్రం తీయ‌కూడ‌దు. సాధార‌ణంగా లార్జ‌ర్ దెన్ లైఫ్ క్యారెక్ట‌ర్ ల‌ని రాయాలంటే ప్ర‌తీ ఒక్క‌రికీ ఆస‌క్తి వుంటుంది. స్వామీ వివేకానంద కంటే లార్జ‌ర్ దెన్ లైఫ్ క్యారెక్ట‌ర్ వుంటుందా? అస‌లు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆయ‌న‌పై సినిమా త‌ప్ప‌కుండా చేస్తా` అని త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు.