Begin typing your search above and press return to search.

అంత మంచి పేరు నాకొద్దు-కొరటాల

By:  Tupaki Desk   |   27 April 2018 11:30 AM IST
అంత మంచి పేరు నాకొద్దు-కొరటాల
X
సినిమాలకు సామాజిక బాధ్యత ఉండాలని ఆలోచించే దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. సందేశాలిస్తే జనాలేం చూస్తారు అని ఆలోచించకుండా సినిమాను వినోదాత్మకంగా నడిపిస్తూనే మంచి విషయాలు చెప్పాలని చూస్తుంటారు ఈ కోవలోని దర్శకుడు. కొరటాల శివ ఈ తరహా దర్శకుడిలాగే కనిపిస్తాడు. అతను ఇప్పటిదాకా నాలుగు సినిమాలు తీస్తే.. ఆ నాలుగింట్లోనూ ఏదో ఒక సందేశం ఉంది. సమాజానికి మంచి చెప్పాలన్న తపన కనిపిస్తుంది. ఐతే ఇలాంటి సినిమాల ద్వారా తానేదో సమాజానికి గొప్ప మేలు చేసేస్తున్నాననే భావన తనకేమీ లేదని కొరటాల చెప్పాడు. అలాగే తాను మంచి వాడిగా.. పేరు తెచ్చుకోవాలన్న తపన కూడా తనకేమీ లేదని చెప్పాడతను. ఒక మంచి విషయాన్ని చెప్పడంలోనే పెద్ద కమర్షియల్ యాంగిల్ ఉందని కొరటాల అంటుండటం విశేషం.

తాను తన సినిమాల్లో చెప్పిన విషయాలన్నీ జనాలకు బాగా కనెక్టయ్యేవని.. వాళ్లు ప్రతి నిత్యం మాట్లాడుకునే విషయాల్ని.. కోరుకునే మార్పును సినిమాల్లో చూపిస్తున్నానని.. కాబట్టి వాళ్లు బాగా కనెక్టవుతారని ఆశిస్తున్నానని.. ఇదే పెద్ద కమర్షియల్ యాంగిల్ అని చెప్పాడు. సినిమా అనేది ప్యూర్ బిజినెస్ అని.. చాలామంది డబ్బులు ఇందులో ముడిపడి ఉంటాయని.. కేవలం సందేశాలు ఇవ్వడానికి సినిమా తీసే పరిస్థితి లేదని.. అందుకే తాను ఏం చేసినా కమర్షియల్ గానే ఆలోచించి చేస్తానని కొరటాల స్పష్టం చేశాడు. ఇక తాను ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నీ ఒక ఫార్మాట్లో సాగిపోయాయని అనిపిస్తోందని.. ఇక తాను కొంచెం కొత్త తరహాలో సినిమా తీసే ప్రయత్నం చేయాల్సిన అవసరముందనిపిస్తోందని.. అలాగే ట్రై చేస్తానని అతనన్నాడు.