Begin typing your search above and press return to search.

ఈసారి తేడా వస్తే అడ్రస్ గల్లంతే..

By:  Tupaki Desk   |   27 March 2019 5:30 PM GMT
ఈసారి తేడా వస్తే అడ్రస్ గల్లంతే..
X
మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలొచ్చారు. అదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. కానీ నాగబాబు తనయురాలు నిహారిక కథానాయిక అవుతోందంటేనే అందరూ ఆశ్చర్యపోయారు. సినీ రంగానికి చెందిన పెద్ద కుటుంబాల నుంచి అమ్మాయిలు హీరోయిన్లు కావడం అరుదు. నిహారికకు సైతం కుటుంబంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వార్తలొచ్చాయి. ఐతే ఆమె పట్టుబట్టి కుటుంబ పెద్దలందరినీ ఒప్పించి సినీ రంగ ప్రవేశం చేసింది. రెండు చిత్రాల్లో కథానాయికగానూ నటించింది. కానీ ఇంత కష్టపడి సినిమాల్లోకి వస్తే ఆమెకు ఇక్కడ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. ‘ఒక మనసు’తో పాటు ‘హ్యాపీ వెడ్డింగ్’ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు నిహారిక ఆశలన్నీ ‘సూర్యకాంతం’ మీదే ఉన్నాయి. ప్రణీత్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ కథానాయకుడిగా నటించాడు. ఓ కొత్తమ్మాయి మరో కథానాయికగా నటించింది.

ఐతే ఈ సినిమా ప్రధానంగా నిహారిక పాత్ర చుట్టూ తిరుగుతుంది. టీజర్ - ట్రైలర్ చూస్తే ఆమె క్యారెక్టర్ ఆసక్తికరంగానే అనిపించింది. కానీ ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో బజ్ అయితే లేదు. రెండు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ స్లంప్‌ లో కొనసాగుతుండగా.. ఈ వారాంతానికైనా ఊపు వస్తుందా అన్నది సందేహంగానే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం చాలా చాలా కష్టమైపోతోంది. ఈ నేపథ్యంలో ‘సూర్యకాంతం’కు ఎలాంటి టాక్ వస్తుందో.. సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో సందేహాలున్నాయి. ఈ సినిమా ఫలితం తేడా వస్తే మాత్రం నిహారిక కెరీర్‌ కు దాదాపుగా తెర పడిపోయినట్లే అనుకోవాలి. సినీ రంగంలోకి వచ్చే ముందే రెండు మూడేళ్లు నీ ఇష్టం - తర్వాత పెళ్లి చేస్తా అని తాను నిహారికతో అన్నట్లు నాగబాబు వెల్లడించాడు. వరుసగా మూడు ఫ్లాపులు వచ్చాక సినీ కెరీర్‌ పై నిహారిక ఆశలు వదులుకోవాల్సిందేనేమో. కాబట్టి ‘సూర్యకాంతం’ ఆడటం నిహారికకు చాలా చాలా అవసరం.