Begin typing your search above and press return to search.

కామెడీ ఫ్యామిలీకి ఈ సీరియస్ శాపమేంది?

By:  Tupaki Desk   |   3 Nov 2015 1:02 PM IST
కామెడీ ఫ్యామిలీకి ఈ సీరియస్ శాపమేంది?
X
కామెడీ కుటుంబానికి మృత్యువనే కరెంటు షాకు తగులుతోంది. గత కొద్ది నెలలుగా చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు కమెడియన్లు శాశ్విత నిద్రలోకి వెళ్లిపోవటంపై చిత్రలోకం.. సినీ అభిమానులు వేదన చెందుతున్నారు. తమ మాటలతో.. చేష్టలతో నవ్వులు పుట్టించే కమెడియన్లు ఒకరి తర్వాత ఒకరన్నట్లుగా శాశ్వితంగా సెలవు తీసుకొని వెళ్లటంపై విపరీతమైన వేదన వ్యక్తం కావటమే కాదు.. కమెడియన్ల కుటుంబానికి ఏదైనా శాపం తగిలిందా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.

తెలుగు హాస్య నటుల్లో గడిచిన ఏడాదిన్నర కాలంలో ప్రముఖులు పలువురు ఆకస్మిక మృతి చెందటం తెలిసిందే. ఏడాదిన్నర క్రితం ప్రముఖ హాస్య నటులు.. ఏవీఎస్ మరణించారు. ఆ తర్వాత.. ఏ మాటలోనైనా వ్యంగ్యాన్ని పలికించే ధర్మవరపు సుబ్రమణ్యం అకాల మరణం అందరిని షాక్ కు గురి చేసింది. తర్వాత అహుతి ప్రసాద్ క్యాన్సర్ తో మరణించారు. ఈ ఏడాది మొదట్లో ఎమ్మెస్ నారాయణ.. ఈ మధ్యనే కళ్ల చిదంబరం మరణించటం తెలిసిందే.

కొద్ది రోజుల క్రితమే నాటి కమెడియన్ మాడా వెంకటేశ్వరరావు మరణించారు. ఆయన అంతిమ సంస్కారాలు పూర్తి చేసి పదకొండు రోజులు కూడా కాకముందే మరో కమేడియన్ కొండవలస కన్ను మూయటంపై చిత్రపరిశ్రమతోపాటు.. సినిమా అభిమానులు షాక్ తినే పరిస్థితి. ఇలా.. ఒకరి తర్వాత ఒకరిగా వెళ్లిపోతున్న కమెడియన్లు అంతులేని ఆవేదనను మిగిలుస్తున్నారు. కమెడియన్లు తమ దారిని తాము వెళ్లిపోతుంటే.. ఇక.. సగటు జీవికి మోములో నవ్వులు ఎలా పూస్తాయి..?