Begin typing your search above and press return to search.

బాలయ్య విక్రమ్ సింహా రిలీజవుతుందట

By:  Tupaki Desk   |   10 Oct 2016 11:30 AM GMT
బాలయ్య విక్రమ్ సింహా రిలీజవుతుందట
X
నందమూరి బాలకృష్ణ-కోడి రామకృష్ణలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీళ్లిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా ‘మంగమ్మగారి మనవడు’ అప్పట్లో సంచలన విజయం సాధించింది. 500 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత కూడా వీళ్లిద్దరి కాంబినేషన్లో మరికొన్ని సూపర్ హిట్లు వచ్చాయి. ఐతే చివరగా వీళ్లిద్దరూ ‘విక్రమ సింహా’ అనే భారీ ప్రాజెక్టు కోసం కలిశారు. బాలయ్య ఫేవరెట్ బేనర్ భార్గవ్ ఆర్ట్స్ లో ఈ సినిమా మొదలైంది. ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొన్నాళ్ల పాటు షూటింగ్ కూడా చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా బయటికి వచ్చాయి. కానీ అనుకోకుండా ఆ సినిమా ఆగిపోయింది.

ఐతే ఎప్పుడో దశాబ్దంన్నర కిందట ఆగిపోయిన ఆ సినిమా ఏదో ఒక రోజు విడుదలవుతుందని అంటున్నాడు దీని దర్శకుడు కోడి రామకృష్ణ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రస్తావన రాగా.. కోడి ఇలా స్పందించాడు. బాలకృష్ణతో ప్లాన్‌ చేసిన విక్రమసింహ ఎందుకు ఆగిపోయింది? ‘‘ఈ సినిమా గురించి సింబాలిగ్గా ఓ విషయం చెబుతా. ఆ మధ్య కనపడకుండా పోయిన మలేసియా విమానం... ఎందుకు పడిపోయింది.. ఎవరు పడేశారు.. ఎక్కడ పడిపోయింది అన్న విషయాలు ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. బాలయ్యతో మొదలైన ‘విక్రమసింహా’ కూడా అంతే. లయన్‌ కింగ్‌ అనే హాలీవుడ్ మూవీ నుంచి కథ తీసుకొని వర్క్‌ చేశాం. మొదలైన సినిమా ఎందుకు ఆగిందో తెలీదు. ఎక్కడో బ్రేక్‌ వచ్చింది. 60 శాతం అయింది. ఇంకో 20 రోజుల్లో సినిమా పూర్తయిపోయేది. దాని మీద ఇప్పుడు మళ్లీ పని చేస్తున్నాం. ఎప్పటికైనా అది పూర్తయి.. పెద్ద హిట్‌ అవుతుంది’’ అని కోడిరామకృష్ణ చెప్పాడు. మరి మిగతా 40 శాతం షూటింగుకి బాలయ్య ఒప్పుకుంటాడా.. అప్పటి సినిమాను ఇప్పుడు కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది అన్నది కోడి వారికే తెలియాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/