Begin typing your search above and press return to search.

కోడిరామకృష్ణ నుంచి ఓ సంచలన సినిమా

By:  Tupaki Desk   |   1 Jun 2016 10:34 AM GMT
కోడిరామకృష్ణ నుంచి ఓ సంచలన సినిమా
X
ఒకప్పుడు డబుల్ రోల్ ఉన్న సినిమాలు తీయాలంటే దర్శకులు ఎన్నెన్ని పాట్లు పడేవాళ్లో. ఇద్దరూ కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సీన్ తీయాలన్నా కుదిరేది కాదు. రెండు వేర్వేరు షాట్లు తీసి రెంటినీ కలిపి అతికించేవాళ్లు. తెర మీద సన్నివేశం నడుస్తుంటే.. మధ్యలో గీత స్పష్టంగా కనిపించేది. ఇద్దరూ కౌగిలించుకున్న దృశ్యం చూపించాలంటే డూపుల్ని పెట్టి మేనేజ్ చేసేవాళ్లు. తర్వాత రాను రాను కాలం మారింది. టెక్నాలజీ పెరిగింది. తెరమీద నిజంగానే ఇద్దరు వేర్వేరు వ్యక్తులున్నట్లుగా మాయ చేసేస్తున్నారు. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు కనికట్టు చేస్తున్నారు.

మన ‘బాహుబలి’ సినిమానే తీసుకుంటే ఫిలిం సిటీలో బ్లూమ్యాట్ వేసి సన్నివేశాలు తీసేసి.. జలపాతాల మధ్య విన్యాసాలు చేసినట్లు ఎంత కనికట్టు చేశారో మేకింగ్ వీడియోల్లో చూశాం. ఇక హాలీవుడ్ సినిమాలు చూస్తే వాళ్లు చేసే మ్యాజిక్కులకు హద్దే ఉండదు. కార్టూన్ క్యారెక్టర్లను నిజమైన మనుషుల్లాగా భ్రమింపజేస్తూ మనల్ని ఒప్పించి.. మెప్పించే తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇంతకీ పైన హెడ్డింగ్ లో కోడిరామకృష్ణ పేరు చెప్పి.. కింద ఇంత ఉపోద్ఘాతమంతా ఏంటీ అనిపిస్తోంది కదా. అక్కడికే వస్తున్నాం పదండి.

పేరుకు పాత కాలం దర్శకుడైనప్పటికీ.. ఇప్పటి టెక్నాలజీని వాడుకుంటూ ఓ గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు మన సీనియర్ డైరెక్టర్. కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ హీరోగా ఆయనో సినిమా చేస్తున్నాడు. అదేంటి.. ఏడేళ్ల కిందట చనిపోయిన విష్ణువర్ధన్ తో ఇప్పుడు సినిమా తీయడమేంటి అనిపిస్తోంది కదా. అదే మ్యాజిక్. అలాగని ఇది ఆయన బతికుండగా తీసిన సినిమా అని కూడా అనుకోకండి. గ్రాఫిక్స్.. విజువల్ ఎఫెక్టుల ద్వారా విష్ణువర్ధన్ రూపాన్ని తీర్చిదిద్ది.. తెరమీద నిజంగానే విష్ణువర్ధన్ నటించినట్లు భ్రమింపజేయబోతున్నారు. ఈ సినిమా పేరు.. నాగరహవు.

7 దేశాలకు చెందిన 500 మందికి పైగా వీఎఫ్ఎక్స్ నిపుణులు.. ఏడాదిన్నర పాటు శ్రమించి ఈ సినిమాకు ప్రాణప్రతిష్ట చేశారట. ఈ మధ్యే టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులో గ్రాఫిక్ విష్ణువర్ధన్ ను చూసుకుని ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఏ రాజమౌళి లాంటి వాళ్లో చేస్తారనుకుంటాం. ఐతే ఈ వయసులో కోడిరామకృష్ణ ఇంత పెద్ద సాహసానికి దిగడం మామూలు విషయం కాదు. టీజర్లో విజువల్స్ చూస్తే ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మరి సినిమాతో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.