Begin typing your search above and press return to search.

చిరు 150 మీద కోదండరామిరెడ్డి అంత మాట అనేశాడే

By:  Tupaki Desk   |   10 July 2016 9:51 AM GMT
చిరు 150 మీద కోదండరామిరెడ్డి అంత మాట అనేశాడే
X
ఇప్పటి తరానికి దర్శకుడు కోదండరామిరెడ్డి అంటే కొత్తగా పరిచయం చేయాల్సిందే. డెబ్భై.. ఎనభయ్యోల్లో పుట్టినోళ్లకు ఆయన ఎంత పోటుగాడో తెలుసు. మెగాస్టార్ చిరంజీవితో అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడు ఆయనే ముందుంటారు. చిరును తిరుగులేని స్టార్ గా మార్చిన ఖైదీ సినిమాకు ఆయనే దర్శకుడు. చిరంజీవికి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ (శాంపిల్ గా చెప్పాలంటే ఖైదీ.. ఛాలెంజ్.. వేట .. పసివాడి ప్రాణం.. అత్తకు యముడు.. అమ్మాయికి మెగుడు) అందించిన కోదండరామిరెడ్డి తాజాగా చిరు 150వ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేయటం హాట్ టాపిక్ గా మారింది.

విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కోదండరామిరెడ్డి చిరు 150వ సినిమా గురించి మాట్లాడుతూ.. యాక్షన్.. సందేశాత్మక సినిమాలు తీస్తే జనాలు నవ్వుకుంటారన్నారు. తన వరకు తాను చిరు.. హాస్య సినిమా చేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. చరుతో సందేశాత్మక చిత్రం తీస్తే ఇప్పటి ప్రేక్షకులు చూడరని తేల్చేశారు. చిరు 150వ సినిమా మీద అందరూ ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడుతున్న వేళ.. అందుకు భిన్నంగా కోదండరామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయని చెప్పాలి.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం అలవాటు లేని కోదండరామిరెడ్డి లాంటి సీనియర్ డైరెక్టర్ చిరు 150వ సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారేంటి? చిరుకు.. ఆయనకు ఏమైనా చెడిందా? అంటూ చెక్ చేయటం మొదలైంది. అయితే.. అలాంటిదేమీ లేదని.. కోదండరామిరెడ్డి సైలెంట్ గా ఉండే వ్యక్తి అని.. అలాంటి వ్యక్తి చిరు రీఎంట్రీ మీద చేసిన వ్యాఖ్యలు మొత్తం తనకు అనిపించింది అనిపించినట్లు చెప్పి ఉంటారని.. ఆ వ్యాఖ్యల్ని మీడియా ఫోకస్ చేసే తీరుతో ఇదో సంచలనంగా మారిందన్న మాట సినీ పెద్దల నోటి నుంచి వినిపిస్తోంది.