Begin typing your search above and press return to search.

ఆ నిజం తెలిసి భారతీరాజా భయపడిపోయారు!

By:  Tupaki Desk   |   4 April 2022 8:35 AM GMT
ఆ నిజం తెలిసి భారతీరాజా భయపడిపోయారు!
X
తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన నిన్నటి తరం కథానాయికలలో రాధిక ఒకరు. జయసుధ వంటి సహజ నటిని .. జయప్రద .. శ్రీదేవి వంటి గ్లామరస్ హీరోయిన్స్ ను తట్టుకుని నిలబడిన టాలెంట్ రాధిక సొంతం. అప్పట్లో గలగలా మాట్లాడుతూ సందడి చేసే పల్లె పిల్లగా ఆమె ఎక్కువ మార్కులు కొట్టేసింది. చిరంజీవి సరసన నాయికగా ఆమె 'న్యాయం కావాలి'సినిమాతో తెలుగు తెరకి పరిచయమయ్యారు. 'త్రిశూలం'.. 'స్వాతి ముత్యం'.. 'స్వాతి కిరణం'వంటి సినిమాలు ఆమె కెరియర్లో చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి.

తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'కార్యక్రమంలో రాధిక మాట్లాడుతూ అనేక విషయాలను పంచుకున్నారు. " నేను ఓ తమిళ సినిమా చేస్తుండగా చిరంజీవిగారు అక్కడికి వచ్చారు. సెట్లో ఆయన ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా చూశాను. ఆ తరువాత ఆయనతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. నేను ఎక్కువ సినిమాలు చేసింది ఆయనతోనే.

దాదాపు 26 సినిమాల వరకూ కలిసి చేశాము. ఆయన చాలా ఫ్రెండ్లీ గా ఉంటారు. సురేఖ గారితో మరింత చనువు ఉండేది. అప్పట్లో నాకు తెలుగు అంతగా వచ్చేది కాదు. అందువలన నేను భాషపై ఎక్కువ ఫోకస్ చేయవలసి వచ్చింది.

అదృష్టం కొద్దీ తెలుగులో నాకు మంచి కథలు .. పాత్రలు పడ్డాయి. నిజం చెబుతున్నాను నేను చేసిన తెలుగు సినిమాల విషయంలోనే నేను హ్యాపీగా ఉన్నాను. అప్పట్లో ఎంజీఆర్ కీ .. మా నాన్నగారికి మధ్య జరిగిన గొడవ గురించి నాకు కాస్త గుర్తుంది. మొదట్లో విషయం ఏమిటనేది మా అమ్మకి అర్థం కాలేదు.ఆ తరువాత ఆమె మా ఫాదర్ పై కోప్పడింది. మా సేఫ్టీ కోసం మమ్మల్ని శ్రీలంకకు తీసుకుని వెళ్లిపోయింది. కొంతకాలం శ్రీలంకలోను .. ఆ తరువాత లండన్ లోను ఉన్నాను. ఆ తరువాత కొంతకాలానికి మా ఫాదర్ ను చూడటానికి మద్రాసు వచ్చాను.

ఆ సమయంలో భారతీరాజా గారు ఒక కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. మా ఫ్రెండ్ ఆల్బంలో నన్ను చూసి ఆ ఆయన మా ఇంటికి వచ్చారు. అప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో ఆయనను లోపలోకి కూడా రానీయలేదు. అయినా ఆయన తాను వచ్చిన పనిని గురించి చెప్పి నన్ను సినిమాలోకి తీసుకున్నారు.

ఆలా నాకు తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత నేను ఎమ్ ఆర్ రాధా కూతురునని తెలిసి, ఆయన చాలా భయపడిపోయారు. ఎంజీఆర్ వైపు నుంచి ఏమౌతుందో .. ఇదెక్కడి గొడవారా బాబూ అని కంగారు పడిపోయారు" అని చెప్పుకొచ్చారు.