Begin typing your search above and press return to search.

‘జిందగీ’ దర్శకుడు పేల్చిన పంచ్

By:  Tupaki Desk   |   31 Oct 2017 7:55 AM GMT
‘జిందగీ’ దర్శకుడు పేల్చిన పంచ్
X
గత వారాంతంలో విడుదలైన ‘ఉన్నది ఒకటే జిందగీ’కి తొలి రోజు టాక్ కొంచెం అటు ఇటుగా వచ్చింది. కొందరేమో సినిమాలో మంచి ఫీల్ ఉందని.. ఆహ్లాదంగా సాగిపోతుందని.. అన్నారు. ఇంకొందరేమో సినిమా స్లో అని.. సెకండాఫ్ వీక్ అని అన్నారు. ఐతే డివైడ్ టాక్ ను తట్టుకుని ఈ సినిమా తొలి వారాంతంలో బాగానే వసూళ్లు రాబట్టింది. క్రిటిక్స్ కొందరు ఈ సినిమా గురించి పాజిటివ్ గా రాస్తే.. ఇంకొందరు నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో దర్శకుడు కిషోర్ తిరుమల తన సినిమా గురించి నెగెటివ్ గా మాట్లాడిన వాళ్లకు సుతి మెత్తగా ఒక చురక అంటించాడు. తాను చదువుకునే రోజుల నాటి ఒక అనుభవాన్ని అతను ఉటంకించాడు.

‘‘నేను పదో తరగతి పరీక్షలు రాశాక రిజల్ట్స్ వచ్చాయి. నేను.. నా క్లోజ్ ఫ్రెండ్ కలిసి రిజల్ట్స్ చూసుకోవడానికి బయల్దేరాం. మా ఊరు అవతల కాలువ దాటి అవతలికి వెళ్లి పేపర్ కొనుక్కుని రిజల్ట్స్ చూడాల్సిన పరిస్థితి. అలా నేను.. నా ఫ్రెండ్ వెళ్తూ ఉంటే.. ఇంకొకడు ఎదురొచ్చాడు. మమ్మల్ని చూడగానే.. నేను ఫస్ట్ క్లాస్ లో పాసయ్యానని చెప్పాడు. పక్కనున్న ఫ్రెండ్ ఫెయిల్ అనేశాడు. దీంతో వాడు ఏడవడం మొదలుపెట్టాడు. ఐతే నేను అతడిని ఓదార్చి.. రారా మనం వెళ్లి చూద్దాం అని తీసుకెళ్లాం. పేపర్ తీసి చూస్తే నా ఫ్రెండు కూడా ఫస్ట్ క్లాసులో పాసయ్యాడని తెలిసింది. కాబట్టి ‘ఉన్నది ఒకటే జిందగీ’ గురించి ఎవరో ఏదో అన్నారని ఆగిపోవద్దు. వెళ్లి థియేటర్లో సినిమా చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది’’ అని అన్నాడు కిషోర్. రివ్యూల విషయంలో ఈ మధ్య హీరోలు.. దర్శకులు ఎలా పడితే అలా మాట్లాడేస్తుండగా.. కిషోర్ కొంచెం పద్ధతిగానే తన వాదన వినిపించాడనే చెప్పాలి.