Begin typing your search above and press return to search.

కింగ్ ఖాన్ వ‌ర్సెస్ భాయ్! ఒక‌రు కిందికి ఒక‌రు పైపైకి!!

By:  Tupaki Desk   |   15 April 2021 9:00 AM IST
కింగ్ ఖాన్ వ‌ర్సెస్ భాయ్! ఒక‌రు కిందికి ఒక‌రు పైపైకి!!
X
ద‌శాబ్ధాల పాటు కింగ్ ఖాన్ షారూక్ అజేయ‌మైన ట్రాక్ రికార్డ్ గురించి బాక్సాఫీస్ సంచ‌ల‌నాల గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. బాద్ షా బ‌రిలో దిగితే బాక్సాఫీస్ వ‌ద్ద బంతాటే అన్న చందంగా ఆట సాగింది. దాదాపు మూడు ద‌శాబ్ధాల పాటు ఇదే తీరుగా హ‌వా సాగించారు షారూక్ ఖాన్. అత‌డు తెర‌పై క‌నిపిస్తే చాలు పిచ్చెక్కిపోయే వీరాభిమానులున్నారు. త‌న‌దైన విల‌క్ష‌ణ‌త వైబ్రేంట్ పెర్ఫామెన్సెస్ తో నోట మాట‌రానివ్వ‌నంత గొప్ప ప‌నిత‌నం షారూక్ క‌న‌బ‌రుస్తారు. సునాయాసంగా 500కోట్లు తేగ‌లిగే బాలీవుడ్ స్టార్ గా గుర్తింపు ఉంది. ముఖ్యంగా అత‌డికి మ‌హిళా ప్రేక్ష‌కుల్లో ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణం. అత‌డిని కింగ్ ఖాన్ ని చేసిన అభిమానులు ఉన్నా.. అనూహ్యంగా షారూక్ డౌన్ ఫాల్ అవ్వ‌డం అభిమానుల‌ను పూర్తిగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. గ‌త మూడు నాలుగేళ్లుగా అత‌డి గ్ర‌హ‌బ‌లం ఏమాత్రం బాలేదు. వృత్తిగ‌త జీవితంలో చాలా దెబ్బ‌లు తిన్నారు. అత‌డి సార‌థ్యంలోని రెడ్ చిల్లీస్ ఆశించినంతగా రాణించ‌లేదు. న‌టించిన సినిమాలేవీ స‌రిగా ఆడ‌క అత‌డి గ్రాఫ్ అమాంతం ప‌డిపోయింది.

అయితే బాద్ షా కోల్పోయిన ప్ర‌భ‌ను తిరిగి తెచ్చేందుకు య‌ష్ రాజ్ ఫిలింస్ బృందం ఇప్పుడు ప‌ఠాన్ అనే భారీ చిత్రం తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని ఎట్టిప‌రిస్థితిలో బ్లాక్ బ‌స్ట‌ర్ చేయాల‌న్న క‌సితో కింగ్ ఖాన్ హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు. తాజాగా ప‌ఠాన్ సినిమా షూటింగ్ మ‌ధ్యంత‌రంగా ఆగిపోయిందంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. యూనిట్ స‌భ్యుల‌కు క‌రోనా సోక‌డంతో వెంట‌నే ఆపేశార‌ని .. షారూక్ కూడా హోం ఐసోలేష‌న్ కి వెళ్లార‌న్న ప్ర‌చారం సాగుతోంది. అయితే దీనిని ఖండిస్తూ షారూక్ వ‌ర్గాలు వివ‌ర‌ణ ఇచ్చాయి. షారూక్ అయితే చాలా సీరియ‌స్ అవుతున్నారు. షూట్ ఆప‌డానికి కార‌ణాలు వేరే ఉన్నాయ‌ని త‌మ‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేయొద్ద‌ని ఖండించారు.

ఇక‌పోతే బాద్ షా ప‌రిస్థితి ఇలా ఉంటే కింగ్ ఖాన్ స్థానాన్ని నెమ్మ‌దిగా స‌ల్మాన్ భాయ్ ఆక్రమించారు. అత‌డు కొన్ని కేసుల్లో జైలు జీవితం గ‌డిపి ఆటుపోట్ల‌ను ఎదుర్కొని ఎన్నో డ‌క్కా మొక్కీలు తిన్న త‌ర్వాత తిరిగి కెరీర్ ని రీబూట్ చేసిన తీరును అభిమానులు ఎంతో మెప్పుకోలుగా చూస్తున్నారు. ఇటీవ‌ల స‌ల్మాన్ న‌టించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద 500కోట్లు పైగా వ‌సూలు చేశాయి. టైగ‌ర్ సిరీస్ సినిమాలు అత‌డి మైలేజ్ ని అమాంతం పెంచాయి. ఇంత‌కుముందు వ‌చ్చిన టైగ‌ర్ జిందా హై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. అయితే భార‌త్ చిత్రం ఫ్లాప‌వ్వ‌డం మైన‌స్ అయ్యింది. అయినా భాయ్ గ్రాఫ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇక టైగ‌ర్ 3 చిత్రంతో మ‌రోసారి సంచ‌ల‌నాలు న‌మోదు చేయాల‌ని స‌ల్మాన్ భావిస్తున్నారు. అలాగే అత‌డు న‌టిస్తున్న‌ రాధే.. యాంటిమ్ చిత్రాల‌పైనా భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఓవైపు షారూక్ ప‌ఠాన్ చిత్రంలో మాత్ర‌మే న‌టిస్తుంటే స‌ల్మాన్ భాయ్ ఏకంగా మూడు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవ‌లి త‌న డామినేష‌న్ ని కొన‌సాగించాల‌ని స‌ల్మాన్ చాలా క‌సిగా ప‌ని చేస్తున్నారు. మునుముందు వార్ లో స‌ల్మాన్ వ‌ర్సెస్ షారూక్ ప‌య‌నం క‌నిపిస్తుందేమో చూడాలి. త‌న కెరీర్ డైల‌మా నుంచి బ‌య‌ట‌ప‌డి షారూక్ తిరిగి పూర్వ వైభ‌వం తెస్తారేమో చూడాలి. ప్ర‌స్తుతానికి విరోధం వ‌దిలేసిన స‌ల్మాన్ ఖాన్ .. షారూక్ తిరిగి క‌లిసి న‌టిస్తున్నారు. ఒక‌రి సినిమాల‌కు ఒక‌రు ప్ర‌చారం చేస్తున్నారు. ఇదంతా క‌లిసొస్తే ఆ ఇద్ద‌రూ క‌లిసే బాక్సాఫీస్ వార్ ని నడిపిస్తార‌ని అభిమానులు ఆశిస్తున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి.