Begin typing your search above and press return to search.

'ఆర్సీ 15'పై కియారా లెక్క‌లు మామూలుగా లేవుగా..?

By:  Tupaki Desk   |   15 Jun 2022 6:36 AM GMT
ఆర్సీ 15పై కియారా లెక్క‌లు మామూలుగా లేవుగా..?
X
కియారా అద్వానీ.. ఈ బ్యూటీ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 'ఫగ్లీ' అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించిన కియారా.. మ‌హేశ్ బాబు హీరోగా తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ 'భరత్ అనే నేను'తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

ఇందులో వసుమతిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ‌.. ఆపై మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కు జోడీగా 'వినయ విధేయ రామ'లో న‌టించింది. అయితే భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది.

ఈ ఫ్లాప్ తో కియారా మ‌ళ్లీ టాలీవుడ్ వైపు చూడ‌లేదు. ఇక్క‌డ అవ‌కాశాలు వ‌స్తున్నా.. వాటిని ప‌క్క‌న పెట్టి బాలీవుడ్ పైనే దృష్టి సారించింది. అక్క‌డ వ‌రుస అవ‌కాశాలను అందుకుంటూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవ‌లె 'భూల్ భులయా 2'తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి భారీ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఇక‌పోతే చాలా కాలం త‌ర్వాత కియారా తెలుగులో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అదే 'ఆర్సీ 15'.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు హై బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి 'స‌ర్కారోడు' అనే టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉంది. అలాగే ఇందులో అంజ‌లి, జ‌యరామ్‌, శ్రీ‌కాంత్‌, న‌వీన్ చంద్ర‌, సునీల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే గ‌త కొంత కాలం నుంచీ తెలుగులో ఆఫ‌ర్లు వ‌స్తున్నా రిజెక్ట్ చేస్తున్న కియారా.. 'ఆర్సీ 15'కి ఒప్పుకోవ‌డం వెన‌క చాలా లెక్క‌లు వేసుకుంద‌ట‌. శంకర్ సినిమాలో హీరోయిన్లు గ్లామర్ గా కనిపించడంతో పాటు నటిగా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కియారాకు బాగా తెలుసు.

అలాగే 'ఆర్సీ 15' పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావ‌డం, భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేయ‌డం మ‌రియు చ‌ర‌ణ్ తో మంచి స‌న్నిహిత్యం ఉండ‌టం.. ఇలా అన్ని అంశాల‌ను బేరీజు వేసుకునే కియారా ఈ సినిమాకు సైన్ చేసింద‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇన్ని లెక్క‌లు వేసుకున్న కియారా.. 'ఆర్సీ 15'తో ఏ మేర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాలి.