Begin typing your search above and press return to search.

కైరా-వాటే లక్కీ గర్ల్

By:  Tupaki Desk   |   30 Jan 2018 6:53 AM GMT
కైరా-వాటే లక్కీ గర్ల్
X
అదేదో సినిమాలో చెప్పినట్టు అదృష్టం పడిశం పట్టినట్టు పడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణగా హీరొయిన్ కైరా అద్వాని నిలుస్తోంది. భరత్ అను నేనుతో మహేష్ బాబు సరసన టాలీవుడ్ కు పరిచయమవుతున్న ఈ భామ ఇంకా దాని షూటింగ్ సగంలో ఉండగానే రామ్ చరణ్-బోయపాటి శీను కాంబోలో ఛాన్స్ కొట్టేసింది. ప్రేక్షకులు ఇంకా తనను తెరపై ఇంకా చూడకముందే క్రేజీ మూవీస్ లో ఆఫర్స్ దక్కించుకుంటోంది. ఎంఎస్ ధోని సినిమాతోనే మనవాళ్ళకు పరిచయమైనా అది మాస్ ప్రేక్షకులకు రీచ్ కాని మూవీ కావడంతో తను ఎక్కువ శాతం ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. ధోని తర్వాత మెషిన్ అనే మరో సినిమా చేసింది కాని అది డిజాస్టర్ కావడంతో బాలీవుడ్ లో తనకు అవకాశాలు వెల్లువెత్తడం లేదు. కాని టాలీవుడ్ తనకు బంగారు బాతులా వెల్కం చెబుతోంది.

తాజా అప్ డేట్ ప్రకారం మహేష్ బాబు - రామ్ చరణ్ సినిమాలతో పాటు కృష్ణార్జున యుద్ధం తర్వాత నాని చేయబోయే మల్టీ స్టారర్ మూవీ కోసం కైరానే అడిగారట. సూపర్ స్టార్ - మెగా పవర్ స్టార్ తర్వాత ఇప్పుడు న్యాచురల్ స్టార్. ఇంకేముంది ఒప్పుకోవచ్చుగా అని అనుకోవచ్చు కాని తను ఇంకా ఆలోచించే స్టేజిలోనే ఉంది. నాగార్జున కూడా నటిస్తున్న ఆ మూవీపై షూటింగ్ మొదలు కాకుండానే మంచి బజ్ వచ్చేసింది. ఒకవేళ కైరా ఓకే అంటే మాత్రం నేతితో చేసిన బూరెల బుట్టలో పడ్డట్టే. కథ ఇక్కడితో అయిపోలేదు. నితిన్ కొత్త సినిమా కోసం కూడా తననే అడుగుతున్నట్టు తెలిసింది.

ఇలా వరస ఆఫర్స్ క్యు కడితే ఏ హీరొయిన్ కైనా కావలసింది ఏముంది. అందులోనూ బాలీవుడ్ లో పెద్దగా వర్క్ కాని టైంలో ఇలా సౌత్ నుంచి అందులోనూ తెలుగు నుంచి ఇలా అవకాశాల వర్షం కురుస్తుంటే మిగిలినవాళ్ళకు ఈర్ష్య కలిగేలా ఉంది. ఇవి కనక హిట్స్ అయ్యాయి అంటే కైరా అద్వాని సుడి తిరిగినట్టే. కైరా అద్వాని అసలు పేరు అలియా అద్వాని. నాన్న జగదీష్ అద్వాని హిందు సంతతికి చెందిన వ్యాపారవేత్త కాగా అమ్మ జెన్నివీవ్ జాఫ్రీ విదేశీ వనిత. తమ్ముడు మిశాల్ కూడా సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు.