Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్‌ 2' చెప్పిన డేట్ కి రావాలని టార్గెట్ పెట్టుకుందా...?

By:  Tupaki Desk   |   23 May 2020 11:30 PM GMT
కేజీఎఫ్‌ 2 చెప్పిన డేట్ కి రావాలని టార్గెట్ పెట్టుకుందా...?
X
ప్రస్తుతం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'కేజీఎఫ్‌ 2' ఒకటి. ఇది 'కేజీఎఫ్‌' సినిమాకి సీక్వెల్ గా రానున్నది. కన్నడ స్టార్ హీరో యష్ - శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీని ముందు చాప్టర్ 'కేజీఎఫ్‌' 2018లో విడుదలై ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియన్ స్థాయిలో మెప్పించిన ఈ మూవీతో హీరో మరియు డైరెక్టర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా కన్నడ సినిమా స్థాయిని పెంచింది. బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్‌’ నిలిచింది. సౌత్ ఇండియాలో 'బాహుబలి' తర్వాత హిందీలో సత్తా చాటిన సినిమాగా 'కేజీఎఫ్' నిలిచిందని చెప్పవచ్చు. దీంతో ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'కేజీఎఫ్‌ 2' సినిమాని మొదటి పార్ట్ కంటే మరింత గ్రాండ్ గా ఆవిష్కరిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్.. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీలో కూడా 'కేజీఎఫ్ 2' పై క్రేజ్ ఏర్పడింది. 'కేజీఎఫ్‌ 2’ని హెంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాని అన్ని అనుకున్నట్లు జరిగితే దసరా సందర్భంగా అక్టోబర్‌ 23న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అనుమతిస్తే అనుకున్న సమయానికి థియేటర్లలో తీసుకొస్తామని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దీనికి తగ్గట్టే ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసారని సమాచారం. అయితే ఇప్పుడు సినిమాలన్నీ సినిమా వాళ్ళు అనుకున్నట్లు జరగడం లేదు.. పరిస్థితులను బట్టి వారి ఆలోచనలు మారుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ 2' దసరాకి రిలీజ్ అయితే పరిస్థితి ఏంటని అందరూ ఆలోచిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరాకి థియేటర్స్ లోకి వస్తే పెట్టిన డబ్బుని వెనక్కి తీసుకొస్తుందా లేదా అనే డౌట్ అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుత క్రైసిస్ లో జనాలు సినిమాల కోసం విరివిరిగా ఖర్చుపెడతారో లేదో.. అంతేకాకుండా ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్స్ లో సినిమాలు చూడటానికి వస్తారో లేదో అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి. 'కేజీఎఫ్ 2' లాంటి భారీ బడ్జెట్ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టాలంటే థియేటర్స్ ఫుల్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ ప్రేక్షకులు మహమ్మారి భయంతో థియేటర్స్ లో అడుగుపెట్టడానికి మరికొన్ని రోజులు వేచి చూసే ధోరణిలో ఉంటే ఈ సినిమా పరిస్థితి ఏంటి? 'కేజీఎఫ్‌' సాధించిన భారీ వసూళ్ల రేంజ్ లో 'కేజీఎఫ్‌ 2' సినిమా కూడా వసూలు చేయాలంటే ప్రేక్షకులు కూడా అదే రేంజ్ లో రావాలి కదా. దీంతో 'కేజీఎఫ్‌ 2' నిర్మాతలు దసరాకి రిలీజ్ చేసి సొమ్ము చేసుకోవాలని ఆలోచన చేయకుండా.. వేచి చూసే ధోరణి అవలంబిస్తే మంచిదని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నారు.