Begin typing your search above and press return to search.

‘కేజీఎఫ్‌ 2’ తెలుగు రైట్స్ చాలా కాస్ట్లీ గురూ...!

By:  Tupaki Desk   |   21 May 2020 2:30 PM GMT
‘కేజీఎఫ్‌ 2’ తెలుగు రైట్స్ చాలా కాస్ట్లీ గురూ...!
X
దేశ వ్యాప్తంగా కన్నడ సినిమా స్థాయిని పెంచిన సినిమా 'కేజీఎఫ్‌' అని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాగా విడుదలైన 'కేజీఎఫ్‌' ఎంతటి వసూళ్లను రాబట్టిందో అందరికి తెలిసిందే. ఆ సమయంలో మన తెలుగు సినిమాల కలెక్షన్స్ సైతం క్రాస్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా రూపొందిన ‘కేజీఎఫ్‌' పాన్‌ ఇండియన్‌ చిత్రంగా అన్ని భాషల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద అత్యధిక వసూళ్లను రాబట్టిన కన్నడ చిత్రంగా ‘కేజీఎఫ్‌’ నిలిచింది. సౌత్ ఇండియాలో 'బాహుబలి' తర్వాత బాలీవుడ్ లో సత్తా చాటిన సినిమా 'కేజీఎఫ్' అని చెప్పవచ్చు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రస్తుతం స్వీకెల్‌ ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ రానున్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్‌ 2’ చిత్రాన్ని హెంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మొదటి పార్ట్ కంటే మరింత గ్రాండ్ గా ఆవిష్కరిస్తున్నారని సమాచారం. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్.. రవీనా టాండన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందీలో కూడా 'కేజీఎఫ్ 2' పై మరింత క్రేజ్ ఏర్పడింది.

ఇదిలా ఉండగా 'కేజీఎఫ్‌' సినిమాని తెలుగులో ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలన చిత్ర బ్యానర్ పై విడుదల చేసారు. ఈ సినిమాతో సాయి కొర్రపాటి బాగానే లాభాలు గడించాడని సమాచారం. అయితే ఇప్పుడు దీని సీక్వెల్ 'కేజీఎఫ్ 2' కూడా తెలుగులో రిలీజ్ చేయడానికి సాయి కొర్రపాటి ఆసక్తి చూపిస్తున్నారు. దీని కోసం 20 కోట్ల దాకా డబ్బింగ్ రైట్స్ కి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడట. అయితే 'కేజీఎఫ్‌ 2' మేకర్స్ మాత్రం 40 నుండి 50 కోట్ల వరకు తెలుగు రైట్స్ అమ్మాలని అనుకుంటున్నారట. అంటే సాయి కొర్రపాటి అనుకుంటున్న అమౌంట్ కి డబుల్ ప్రైజ్ అన్నమాట. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం ఇప్పటికే దిల్ రాజు మరియు ఏషియన్ సినిమాస్ సునీల్ కూడా ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం.

అయితే 'కేజీఎఫ్' సినిమా భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ వీరు కూడా అంత రేంజ్ లో డబ్బులు పెట్టి 'కేజీఎఫ్ 2' తెలుగు రైట్స్ కొనడానికి సిద్ధంగా లేరట. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్‌ 2' మేకర్స్ అనుకుంటున్న రేట్స్ కి తెలుగులో బయ్యర్స్ దొరకడం కష్టమే అని చెప్పొచ్చు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో నెలకొని ఉన్న క్రైసిస్ పరిస్థితుల వలన ఆ రేంజ్ లో డబ్బింగ్ సినిమాని కొనడానికి ముందుకు రాకపోవచ్చని అంటున్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమాను తెలుగులో ఓన్ గా రిలీజ్ చేసుకోవాలి లేదా మన తెలుగు నిర్మాతలు ఇచ్చే బెస్ట్ ప్రైజ్ కి ఇచ్చుకోవాలని ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు.