Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్‌ 2' కు బాహుబలి 2 ఫార్ములా

By:  Tupaki Desk   |   5 Feb 2019 11:03 AM GMT
కేజీఎఫ్‌ 2 కు బాహుబలి 2 ఫార్ములా
X
బాహుబలి మొదటి పార్ట్‌ ఊహించని విధంగా భారీగా విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ లో మామూలు వసూళ్లు నమోదు చేస్తుందని భావించారు. కాని అనూహ్యంగా బాహుబలి మొదటి పార్ట్‌ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, ఓవర్సీస్‌ ఇలా అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లను రాబట్టింది. దాంతో రెండవ పార్ట్‌ పై మరింత శ్రద్ద పెట్టారు. మామూలుగా అయితే రెండవ పార్ట్‌ ను వెంటనే విడుదల చేయాలని భావించారు. కాని హిందీ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని 'బాహుబలి 2' సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించడంతో పాటు, ప్రమోషన్స్‌ కూడా ఆస్థాయిలోనే చేశారు.

బాహుబలి 2 ఫలితం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌ సినిమాల రికార్డులను సైతం బ్రేక్‌ చేసేలా బాహుబలి 2 కలెక్షన్స్‌ నమోదు అయ్యాయి. ఇప్పుడు అచ్చు అలాగే 'కేజీఎఫ్‌' విషయంలో జరుగుతుంది. ఇటీవలే కేజీఎఫ్‌ చాప్టర్‌ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ సినీ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో కేజీఎఫ్‌ చిత్రం వసూళ్లు సాధించింది. కన్నడ సినిమా 50 కోట్లు సాధించడం అంటే చాలా గొప్ప విషయం. అలాంటిది ఈ చిత్రం ఏకంగా 250 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. అందుకే ఇప్పుడు కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 చిత్రాన్ని భారీ ఎత్తున తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మొదటి నుండి అనుకున్నట్లుగా కాకుండా కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని అత్యధిక బడ్జెట్‌ తో రూపొందించడంతో పాటు బాలీవుడ్‌ టచ్‌ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ ను విలన్‌ పాత్ర పోషింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా బాలీవుడ్‌ స్టార్స్‌ పలువురు ఈ చిత్రంలో నటించబోతున్నారట. బాలీవుడ్‌ నుండి కనీసం 200 కోట్ల వసూళ్లు రాబట్టే విధంగా ఈ చిత్రంను చేయాలనే ప్రయత్నాల్లో కేజీఎఫ్‌ 2 టీం ఉన్నట్లుగా తెలుస్తోంది.