Begin typing your search above and press return to search.

లక్ష్మీపార్వతి.. వర్మను ఎందుకు అడగదు?

By:  Tupaki Desk   |   26 Nov 2017 11:23 AM IST
లక్ష్మీపార్వతి.. వర్మను ఎందుకు అడగదు?
X
లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా ఉద్దేశమేంటన్నది ఆ టైటిల్ చూసినా.. దాని పోస్టర్ చూసినా స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ సినిమా లక్ష్మీపార్వతిని టార్గెట్ చేసుకున్నదనే విషయంలో ఎవరికీ సందేహాల్లేవు. అందుకే ఆమె ఈ సినిమా దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పై మండిపడుతూ ఉంది. ఈ సినిమా అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఐతే తాను ఆమె బెదిరింపులకు భయపడే పరిస్థితే లేదని అంటున్నాడు కేతిరెడ్డి.

ఎన్టీఆర్ మీద సినిమా తీసే హక్కు ఎవరికైనా ఉందని.. ఆయన ఏ ఒక్కరి సొత్తో కాదని ఆయన అన్నాడు. తాను ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా తీసే విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తనను ప్రశ్నిస్తున్న లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ మీదే సినిమాలు తీస్తున్న రామ్ గోపాల్ వర్మ.. నందమూరి బాలకృష్ణలను ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన అడిగాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ‘సైరా నరసింహారెడ్డి’ తీస్తున్నారని.. మరి ఆ చిత్ర బృందం ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకున్నారా అని కేతిరెడ్డి ప్రశ్నించాడు. లక్ష్మీపార్వతి తన సినిమాను అడ్డుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోందని.. కానీ ఆమె ఏం చేసినా ఈ సినిమా ఆగదని.. జవనరిలో షూటింగ్ మొదలుపెట్టి నెల రోజుల్లో సినిమా పూర్తి చేస్తానని అన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా తీసేందుకు ఇబ్బందులు ఎదురైనా.. ఇండియాలో ఎక్కడికైనా వెళ్లి సినిమా పూర్తి చేస్తానని కేతిరెడ్డి అన్నాడు.