Begin typing your search above and press return to search.

వీడియో: 'గుడ్ లక్ సఖి' నుంచి 'బ్యాడ్ లక్ సఖి' సాంగ్..!

By:  Tupaki Desk   |   8 Nov 2021 7:00 AM GMT
వీడియో: గుడ్ లక్ సఖి నుంచి బ్యాడ్ లక్ సఖి సాంగ్..!
X
మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ''గుడ్ లక్ సఖి''. స్పోర్ట్స్‌ డ్రామా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో కీర్తి రైఫిల్‌ షూటర్‌ గా కనిపించనుంది. ఇందులో ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషించగా.. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

''గుడ్ లక్ సఖి'' చిత్రం నుంచి ‘బ్యాడ్‌ లక్‌ సఖి’ అనే ఫుల్‌ వీడియో సాంగ్ ను హీరో రానా దగ్గుబాటి విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. 'అదిగో వస్తుంది బ్యాడ్‌ లక్‌ సఖి..' అంటూ సాగిన ఈ పాట సినిమాలో కీర్తి సురేశ్‌ పాత్ర గురించి తెలియజేస్తోంది. ఆ గ్రామం మొత్తానికి కీర్తి ఒక దురదృష్టవంతురాలని వివరిస్తూ.. దానికి సంబంధించిన సంఘటనలను ఫన్నీగా చూపించారు. పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేష్ చాలా అందంగా కనిపిస్తుంది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన పెప్పీ ట్యూన్ కు గేయ రచయిత శ్రీమణి యొక్క హ్యూమరస్ లిరిక్స్ ఈ పాటను ఆసక్తికరంగా ఫన్నీగా మార్చాయి. హరిప్రియ - సమీరా భరద్వాజ్‌ - ఎంఎల్ఆర్‌ కార్తికేయన్‌ ఈ గీతాన్ని ఆలపించారు. చిరంతాన్ దాస్ దీనికి సినిమాటోగ్రఫీ అందించారు. బ్యాడ్‌ లక్‌ సఖి పాట వీక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా.. సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది.

కాగా, ''గుడ్ లక్ సఖి'' చిత్రానికి విలక్షణ దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఓ గ్రామీణ యువతి అంతర్జాతీయ షూటర్‌ గా ఎలా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజ్ సమర్పణలో 'వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ ప్రొడక్షన్' బ్యానర్ పై సుధీర్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రావ్యా వర్మ దీనికి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.