Begin typing your search above and press return to search.

బాహుబలి-2 ఆడియోలో.. ఎవరీ కాలభైరవ?

By:  Tupaki Desk   |   27 March 2017 9:57 AM GMT
బాహుబలి-2 ఆడియోలో.. ఎవరీ కాలభైరవ?
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆడియోలో ఉన్నవి ఐదు పాటలే. ఇలాంటి మెగా ఆల్బంలో ఒకే సింగర్ రెండు పాటలు పాడటం విశేషం. ఆ గాయకుడి పేరు కాలభైరవ. ఇంతకుముందు ఏ ఆడియో ఆల్బంలోనూ కనిపించని పేరిది. కీరవాణి కూడా ఎప్పుడూ ఈ గాయకుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయలేదు. మరి అలా పరిచయం లేని సింగర్ ‘బాహుబలి-2’ లాంటి సినిమాలో రెండు పాటలు పాడటం విశేషమే కదా. మరి ఆ సింగర్లో ఏముంది అంత ప్రత్యేకత అంటే.. అతను స్వయంగా కీరవాణి కొడుకు. ఈ సంగతి చాలామందికి తెలియదు. తండ్రి బాటలో సంగీతాన్నే కెరీర్ గా ఎంచుకుని.. బాగానే రాటుదేలినట్లున్నాడు కాలభైరవ. అతను ఇప్పటికే ‘బాహుబలి: ది బిగినింగ్’ హిందీ వెర్షన్లో ఓ పాట పాడటం విశేషం.

ఇప్పుడు ఒకేసారి రెండు మంచి పాటలతో తెలుగు ప్రేక్షకులకు కొడుకుని పరిచయం చేశాడు కీరవాణి. ఈ ఆల్బంలో వన్ ఆఫ్ ద హైలైట్స్ అనదగ్గ ‘దండాలయ్యా దండాలయ్యా’ పాటలు ఒక రకమైన ఆర్ద్రతతో.. ఎంతో హృద్యంగా పాడాడు కాలభైరవ. అలాగే ఆల్బంలో చివరిదైన ‘ఒక ప్రాణం.. ఒక త్యాగం’ పాటను కూడా అంతే బాగా పాడాడు. ఈ రెండు పాటల్నీ కీరవాణే రచించడం విశేషం. కాలభైరవ వాయిస్ చాలా వరకు తండ్రి లాగే ఉండటం గమనించవచ్చు. విశేషం ఏంటంటే.. తెలుగు ప్రేక్షకులకు ఈ కాలభైరవ అనే పేరు మరో రకంగా బాగా పరిచయం. ‘మగధీర’ సినిమాలో హీరో పాత్ర పేరదే అన్న సంగతి తెలిసిందే. అప్పుడు రాజమౌళి కావాలనే తన అన్న కొడుకు పేరు పెట్టుకున్నాడు హీరో పాత్రకు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/