Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: ‘కథలో రాజకుమారి’

By:  Tupaki Desk   |   15 Sep 2017 12:36 PM GMT
మూవీ రివ్యూ: ‘కథలో రాజకుమారి’
X
చిత్రం :‘కథలో రాజకుమారి’

నటీనటులు: నారా రోహిత్ - నమితా ప్రమోద్ - నాగ శౌర్య - అజయ్ - ప్రభాస్ శీను - రాజీవ్ కనకాల - పరుచూరి వెంకటేశ్వరరావు - తనికెళ్ల భరణి - మురళీమోహన్ - గిరి తదితరులు
నేపథ్య సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సంగీతం: ఇళయ రాజా - విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: నరేష్ కె.రానా
నిర్మాతలు: సౌందర్య - ప్రశాంతి - బీరం సుధాకర్ రెడ్డి - కృష్ణ విజయ్
కథ - మాటలు - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మహేష్ సూరపనేని

ఎక్కువగా కొత్త దర్శకులతో.. వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేసే యువ కథానాయకుడు నారా రోహిత్.. మహేష్ సూరపనేని అనే డెబ్యూ డైరెక్టర్ తో చేసిన సినిమా ‘కథలో రాజకుమారి’. ఆసక్తికర ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ చక్రవర్తి (నారా రోహిత్) తెలుగు సినిమాల్లో పెద్ద విలన్. వరుసగా ఐదేళ్ల పాటు ఉత్తమ నటుడి అవార్డు అతడిదే. విలన్ పాత్రల్లో తిరుగులేదని పేరు తెచ్చుకున్న అర్జున్.. నిజ జీవితంలోనూ చాలా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తుంటాడు. అలాంటివాడు ఒక యాక్సిడెండ్ తర్వాత పూర్తిగా మారిపోతాడు. అతడిలోని క్రూరత్వంతో పాటే.. విలనీ పండించే నైపుణ్యం కూడా పోతుంది. అతడి యాక్టింగ్ కెరీర్ దెబ్బ తింటుంది. దీంతో మళ్లీ తాను విలన్ గా రాణించడం కోసం అర్జున్ ఏం చేశాడు.. అతడు చేసిన పనుల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

భిన్నమైన సినిమా తీయాలనుకోవడం... కథాకథనాలు కొత్తగా ఉండాలని ఆలోచించడం మంచిదే కానీ.. ఆ కొత్త విషయాలు ఎంత కన్విన్సింగ్ గా అనిపిస్తాయన్నది కూడా చూసుకోవాలి. లాజిక్స్ గురించి పట్టించుకోకుండా.. ప్రేక్షకులు ఏమాత్రం కన్విన్స్ అవుతారో కూడా ఆలోచించకుండా కొత్తదనం పేరుతో నేలవిడిచి సాము చేస్తే దబేల్ మని కింద పడటం ఖాయం. ‘కథలో రాజకుమారి’ ఈ కోవలోని సినిమానే. అసలేం చెప్పదలుచుకున్నారో అర్థం కాని అయోమయ పరిస్థితిలోకి తీసుకెళ్లే సినిమా ఇది. ఇందులోని లీడ్ పాయింట్ ఎంత ఇల్లాజికల్ గా ఉంటుందో ముందు మాట్లాడుకుందాం.

ఓ అమ్మాయి.. అబ్బాయి.. చిన్నపుడు మంచి స్నేహితులు. ఐతే ఆ అమ్మాయి కోసం అబ్బాయి ఓ చెడ్డ పని చేస్తాడు. దాని గురించి అందరికీ తెలిసిపోతుంది. దీని వల్ల ఆ అబ్బాయి చాలా నష్టపోతాడు. ఇక్కడ కట్ చేస్తే.. హీరో పెద్దవాడయ్యాక ఆ అమ్మాయి వల్లే చిన్నపుడు తన జీవితం నాశనమైందంటూ తన మీద పగ తీర్చుకోవడానికి వస్తాడు. ఇదేమీ సరదాకు కాదు. ఆమెను నాశనం చేయడాన్ని ఒక మిషన్ గా పెట్టుకుని రంగంలోకి దిగుతాడతను. హీరో చిన్నవాడిగా ఉన్నపుడు విలన్ తన కుటుంబాన్ని నాశనం చేస్తే.. అతను పెరిగి పెద్దవాడై చెడ్డవాడైన విలన్ అంతు చూసే కథలు మనం చాలా చూశాం. కానీ తెలిసీ తెలియని వయసులో తన స్నేహితురాలు తెలియక చేసిన తప్పును మనసులో పెట్టుకుని.. అన్ని విషయాలూ అర్థం చేసుకోదగ్గ పెద్ద వయసులో ఉండి ఆమె మీదికి దండెత్తి రావడంలో ఔచిత్యమేంటి? ఈ కొత్తదనాన్ని ఎలా స్వీకరించాలి?

పోనీ హీరో చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి మీద పగతో రగిలిపోతున్నాడా అంటే అదీ కాదు. తనలో ఇంతకుముందున్న క్రూరత్వం పోయి మంచివాడైపోవడం వల్ల.. నటుడిగా విలన్ పాత్రలు సరిగా చేయలేకపోతున్నానని కంగారు పడి.. తన శత్రువు ఎవరో గుర్తు చేసుకుని ఆ అమ్మాయి మీద పగ తీర్చుకోవడానికి వస్తాడట. మరి ఆమె మీద పగ తీర్చుకుంటే.. అతడిలో క్రూరత్వం తిరిగొచ్చేస్తుందా? అతను మళ్లీ పెద్ద విలనైపోతాడా? అసలు సినిమాల్లో విలన్లుగా ఉన్న వాళ్లందరికీ స్వతహాగా క్రూరమైన మనస్తత్తవమే ఉంటుందా? అలాంటి మనస్తత్వం ఉంటే తప్ప విలన్లుగా రాణించలేరా? ఏం లాజిక్ ఇది?

మంచి నటులు కుదిరినా.. సాంకేతిక హంగులకూ లోటు లేకపోయినా.. సన్నివేశాలు కొంచెం కొత్తగా అనిపించినా.. అక్కడక్కడా లోతైన మంచి మాటలు కూడా పడినా.. లాజిక్ కు ఏ కోశానా అందని కాన్సెప్ట్ వల్ల ‘కథలో రాజకుమారి’ మనసుకు తాకదు. దర్శకుడు మహేష్ సూరపనేని టీజర్.. ట్రైలర్ వైవిధ్యంగా కట్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగలిగాడు కానీ.. తన కథను కన్విన్సింగ్ గా మాత్రం చెప్పలేకపోయాడు. మొదలైన కాసేపటికే ఎటు పోతోందో అర్థం కాని సందిగ్ధతలో పడేసే ‘కథలో రాజకుమారి’.. విపరీతమైన నాటకీయతతో.. బాగా సాగతీతగా అనిపించే సన్నివేశాలతో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది.

‘కథలో రాజకుమారి’లో ఇటు నారా రోహిత్ పాత్రను.. అటు నాగశౌర్య పాత్రను మొదలుపెట్టిన తీరు మాత్రం ఆకట్టుకుంటుంది. వీళ్లిద్దరూ నటులుగా పరిచయమయ్యే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ వైవిధ్యంగా అనిపించే ఆరంభ సన్నివేశాల తర్వాత సినిమా చాలా త్వరగా ట్రాక్ తప్పేస్తుంది. హీరో మంచోడైపోవడంతోటే అతను విలన్ పాత్రలు పండించలేకపోవడం అనే పాయింట్ దగ్గర ఈ కథతో ప్రేక్షకుడు డిస్కనెక్ట్ అయిపోతాడు. ఇక గ్రామీణ నేపథ్యంలో చాలా నాటకీయంగా సాగే రివెంజ్ డ్రామా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ద్వితీయార్ధంలో సాగతీత.. రెండు గంటల నిడివితో ఉన్న సినిమాను కూడా చాలా భారంగా మార్చేస్తుంది. ప్రి క్లైమాక్స్.. క్లైమాక్సుల్లో డ్రామా అయితే మరీ శ్రుతి మించింది. ఆ సన్నివేశాల్లో వచ్చే మాటలు.. నేపథ్య సంగీతం చూస్తే.. ఎమోషన్ పిండేస్తున్నట్లుగా అనిపిస్తాయి కానీ.. ఆ ఫీల్ మాత్రం ఏ కోశానా కలగదు. సింపుల్ గా చెప్పాలంటే.. కొత్తదనం పేరుతో చేసిన ఒక వ్యర్థ ప్రయత్నం ‘కథలో రాజకుమారి’.

నటీనటులు:

సినిమాకు చెప్పుకోదగ్గ ఆకర్షణ అంటే నటీనటుల ప్రతిభే. ముగ్గురు ప్రధాన పాత్రధారులూ మెప్పిస్తారు. నారా రోహిత్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరంభంలో సినిమా విలన్ గా నట ప్రతిభ చూపించే సన్నివేశాల్లో రోహిత్ ఆకట్టుకుంటాడు. సినిమా అంతటా కూడా అతను ఆకట్టుకుంటాడు. నాగశౌర్య అతిథి పాత్రలో బాగా చేశాడు. హీరోయిన్ నమితా ప్రమోద్ కూడా మెప్పిస్తుంది. పల్లెటూరి అమ్మాయి పాత్రకు ఆమె బాగా సూటయింది. ఈ పాత్రను ఆమె సింపుల్ గా చేసుకెళ్లిపోయింది. తొలి సినిమా ‘చుట్టాలబ్బాయి’తో పోలిస్తే ఇందులో నమిత భిన్నంగా కనిపిస్తుంది. అజయ్.. ప్రభాస్ శీను.. తనికెళ్ల భరణి.. పరుచూరి వెంకటేశ్వరరావు.. వీళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం:

సంగీతం ‘కథలో రాజకుమారి’కి ప్లస్. విశాల్ చంద్రశేఖర్.. ఇళయరాజా అందించిన పాటలు బాగున్నాయి. విశాల్ నేపథ్య సంగీతం కూడా ఓకే. ఐతే సన్నివేశాల్లో బలం లేకపోవడంతో చాలా చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ అతిగా అనిపిస్తుంది. కేవలం ఆర్.ఆర్ ద్వారా ఫీల్ తీసుకురావడానికి కష్టపడ్డట్లు అనిపిస్తుంది. నరేష్ కె.రానా ఛాయాగ్రహణం పర్వాలేదు. గొప్పగా అనిపించకపోయినా సినిమా మూడ్ కు తగ్గట్లుగా సాగుతుంది ఛాయాగ్రహణం. నిర్మాణ విలువలు అంత ఆకట్టుకోవు. బడ్జెట్ పరిమితులు చాలా చోట్ల తెలుస్తూనే ఉంటాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ మహేష్ సూరపనేని.. కొత్తగా ఏదో ప్రయత్నించబోయి బోల్తా కొట్టేశాడు. కన్విన్సింగ్ గా అనిపించని కథాకథనాలు సినిమాకు పెద్ద మైనస్ అయిపోయాయి. డైలాగ్స్ విషయంలో మహేష్ అక్కడక్కడా మెప్పించాడు కానీ.. అవి సినిమాలో సింక్ అవలేదు. నాటకీయత ఎక్కువైపోయింది. రచయితగా.. దర్శకుడిగా అతడి అనుభవ లేమి స్పష్టంగా తెరమీద కనిపించింది.

చివరగా: ఈ ‘రాజకుమారి’ కథ బోరింగ్!

రేటింగ్- 2/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre