Begin typing your search above and press return to search.

ఆర్ ఎక్స్ 100 హీరో.. నవ్వుల్ నవ్వుల్

By:  Tupaki Desk   |   2 Sept 2018 11:00 PM IST
ఆర్ ఎక్స్ 100 హీరో.. నవ్వుల్ నవ్వుల్
X
ఆర్ ఎక్స్ 100’ సినిమాతో తిరుగులేని విజయాన్నందుకున్నాడు యువ కథానాయకుడు కార్తికేయ. ఈ చిత్రంలో అతడి నటనకు కూడా మంచి పేరొచ్చింది. దీని కంటే ముందు ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే సినిమా కూడా చేశాడు కార్తికేయ. కానీ అది వచ్చింది తెలియదు. వెళ్లింది తెలియదు. కానీ ‘ఆర్ ఎక్స్ 100’ మాత్రం కార్తికేయకు ఓవర్ నైట్ చాలా ఫేమ్ తెచ్చిపెట్టేసింది. ఇప్పుడు అతడికి మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. వాటిలోంచి ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టును ఎంచుకున్నాడు కార్తికేయ. ఇంతకుముందు సూర్యతో ‘నువ్వు నేను ప్రేమ’ అనే సినిమా తీసిన కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ నటించనున్నాడు. తమిళ సీనియర్ ప్రొడ్యూసర్ కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇంత పెద్ద దర్శకుడు.. నిర్మాత తనతో సినిమా చేయడం తన అదృష్టం అంటున్నాడు కార్తికేయ.

‘ఆర్ ఎక్స్ 100’తో పోలిస్తే ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని కార్తికేయ తెలిపాడు. ‘ఆర్ ఎక్స్ 100’లో తన పాత్ర సీరియస్ గా.. ఎమోషనల్ గా.. వయొలెంట్ గా సాగుతుందని.. తన కొత్త సినిమాలో ఆ ఛాయలేమీ ఉండవని చెప్పాడు. ఈ సినిమాతో జనాల్ని నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నామని.. సినిమా మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని.. తన పాత్ర కూడా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని.. తనలోని కొత్త కోణాన్ని ఈ సినిమాతో చూస్తారని కార్తికేయ చెప్పాడు. కెరీర్ లో ఇంత త్వరగా తమిళం.. తెలుగులో ద్విభాషా చిత్రం చేయడం తన అదృష్టమని.. తనకు వేరే ఆఫర్లు కూడా వస్తున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఈ చిత్రం మీదే దృష్టిపెట్టానని.. ఇంకే సినిమా కన్ఫమ్ చేయలేదని తెలిపాడు కార్తికేయ. సెప్టెంబరు నెలాఖర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని అతను వెల్లడించాడు.