Begin typing your search above and press return to search.

మంచు తుఫానులో చిక్కుకున్న 'కార్తికేయ-2' టీమ్..!

By:  Tupaki Desk   |   24 March 2021 6:12 PM IST
మంచు తుఫానులో చిక్కుకున్న కార్తికేయ-2 టీమ్..!
X
యువ హీరో నిఖిల్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''కార్తికేయ 2''. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. గుజరాత్ లోని ద్వారక, చుట్టు పక్కల ప్రాంతాల్లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగి, హీరో నిఖిల్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ కులు మనాలి ప్రాంతంలో యాక్షన్ సీన్స్ షూట్ ప్లాన్ చేయగా.. అక్కడ 'కార్తికేయ2' చిత్ర బృందం మంచు తుఫాన్ లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

కులూ మనాలి లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం హీరో నిఖిల్ తో పాటు చిత్ర యూనిట్ హిమాచల్ ప్రదేశ్ కు వెళ్ళారు. అయితే అందరూ మంచు తుఫాన్ లో చిక్కుకొని, షూటింగ్ చేయలేని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. అక్కడ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ నిఖిల్ ఓ వీడియోను షేర్ చేసాడు. నాలుగు రోజుల పాటు షూటింగ్ చేసుకుని తిరిగి రావాల్సి ఉండగా ఇలా జరిగిందని, మరికొన్ని రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోందని మేకర్స్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో రోడ్లపై మంచు క్లియర్ అయితే కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

కాగా, డైరెక్టర్ చందు మొండేటి - నిఖిల్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'కార్తికేయ'కి సీక్వెల్ గా ''కార్తికేయ 2'' రూపొందుతోంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ - వివేక్ కూచిభోట్ల‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ పూర్తైన వెంటనే హైదరాబాద్ - యూరప్ లలో షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.