Begin typing your search above and press return to search.

చిరూ టైటిల్ పెట్టుకునే స్థాయి నాకు లేదని తెలుసు

By:  Tupaki Desk   |   7 Nov 2021 3:42 AM GMT
చిరూ టైటిల్ పెట్టుకునే స్థాయి నాకు లేదని తెలుసు
X
కార్తికేయ కథానాయకుడిగా 'రాజా విక్రమార్క' సినిమా రూపొందింది. 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమా ద్వారా శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇక కథానాయికగా తాన్య రవిచంద్రన్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కి పరిచయమవుతోంది. యాక్షన్ కామెడీ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దిల్ రాజు .. శ్రీవిష్ణు .. సుధీర్ బాబు .. కిరణ్ అబ్బవరం .. విష్వక్ సేన్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ వేదికపై హీరో కార్తికేయ మాట్లాడుతూ .. 'రాజా విక్రమార్క' చిరంజీవి గారి టైటిల్ .. 'రాజా విక్రమార్క' అనగానే గుర్తొచ్చేది ఆయనే. చిరంజీవిగారి టైటిల్ ను పెట్టుకునే స్థాయి నాకు ఉందని నేనేమీ అనుకోవడం లేదు. కానీ చిన్నప్పటి నుంచి చిరంజీవిగారి ఏ సినిమా చూసినా అందులో నన్ను నేను ఊహించుకుంటూ పెరిగాను. 'గ్యాంగ్ లీడర్' చూసినప్పుడు నేనే గ్యాంగ్ లీడర్ అనుకున్నాను. 'ఇంద్ర' చూసినప్పుడు ఇంద్ర అనుకున్నాను .. 'ఠాగూర్' చూసినప్పుడు ఠాగూర్ అనుకున్నాను. ఆయన పట్ల గల అభిమానానికి మించిన అర్హత ఏముంటుందనే ఈ టైటిల్ పెట్టుకున్నాను.

ఇంతవరకూ నేను చేసిన సినిమాల్లో నా సొంతంగా నేను టైటిల్ పెట్టుకున్నది ఈ సినిమాకే. డైరెక్టర్ ఒక టైటిల్ చెప్పినప్పుడు అది కాస్త యావరేజ్ గా అనిపించింది. నేను ఈ టైటిల్ చెబితే దర్శక నిర్మాతలు ఓకే అన్నారు. అలా నేను చిరంజీవి గారి టైటిల్ పెట్టుకోవడం జరిగింది. 'ఆర్ ఎక్స్ 100' తరువాత నేను విన్న కథ ఇది. ఈ కథను 'శ్రీ' నాకు చెప్పినప్పుడు బాగా నచ్చింది. కానీ ఎందుకు నచ్చింది అనేది చెప్పేంత నాలెడ్జ్ అప్పుడు లేదు. ఎందుకు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతోంది. 'శ్రీ' పట్ల నాకు ఉన్న నమ్మకమే ఈ సినిమాపై పెరుగుతూ వెళ్లింది.

'ఆర్ ఎక్స్ 100' తరువాత రెండు మూడు సినిమాలు అటు ఇటు అయ్యాయి. ఇటు చూస్తేనేమో 'శ్రీ' కొత్త డైరెక్టర్. కొత్త డైరెక్టర్ తో చేస్తున్నానని చెబితే 'నీ స్క్రిప్ట్ సెలక్షన్ మాకు తెలియంది ఏవుందిలే' అన్నట్టుగా చూసేవారు. లేదు ఈ సినిమాతో నేను హిట్ కొడుతున్నాను అని వాళ్లతో చెప్పాలనిపించేది. సాధారణంగా ఏ సినిమా ఒప్పుకోవడానికైనా ఒక రీజన్ ఉంటుంది. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం కథ విని ఎగ్జైట్ అయ్యి .. 'శ్రీ' తో ట్రావెల్ చేయాలనిపించి ఒప్పుకున్నానంతే. ఈ సినిమా నాకు నామీద నమ్మకాన్ని ఇస్తుందని భావిస్తున్నాను.

ఎన్నో పరిస్థితులను .. అవాంతరాలను ఎదుర్కుంటూ ఈ సినిమా చేయవలసి వచ్చింది. సమస్యలు వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా ఉండాలనేది నేను 'శ్రీ'ని చూసి నేర్చుకున్నాను. సినిమా చేస్తున్నా కొద్దీ నాకు నమ్మకం పెరుగుతూ వెళ్లింది. ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ నాకు ఇదే టీమ్ తో చేయాలనుంది. అందుకోసమైనా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు కొత్తవాళ్లయినప్పటికీ, ఎక్కడా భయపడకుండా మాతో ట్రావెల్ అవుతూ వచ్చారు. నాపై వాళ్లు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలనే తపన నాలో పెరుగుతూ వచ్చింది. వాళ్లకి హిట్ ఇచ్చి వాళ్లతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.