Begin typing your search above and press return to search.

అనుకున్నంతా అయిందిగా కార్తికేయ!

By:  Tupaki Desk   |   27 March 2021 1:30 AM GMT
అనుకున్నంతా అయిందిగా కార్తికేయ!
X
చావుకబురు చల్లగా చెప్పాలనేది పెద్దల మాటే. ఎందుకంటే తమవారు లేరనే చేదు నిజాన్ని ఒక్కసారిగా చెబితే అవతల వాళ్ల పరిస్థితి ఏమౌతుందోనని చివరి నిమిషం వరకూ అసలు సంగతి చెప్పేవారు కాదు. ఆరోగ్యం బాగోలేదనీ .. పరిస్థితి కష్టంగానే ఉందని వాళ్ల కుటుంబ సభ్యులను నమ్మిస్తూ, తీరా వాళ్లు ఇంటి దగ్గరికి రాగానే, పోయారని చల్లగా చెప్పేవాళ్లు. అలాంటి టైటిల్ తోనే కౌశిక్ పెగళ్లపాటి 'చావుకబురు చల్లగా' సినిమాను చేశాడు. కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా, మిక్స్డ్ టాక్ తెచ్చుకుందనేది దర్శకుడి మాట.

ఈ సినిమా విడుదలకి ముందుగానే కార్తికేయ పాత్ర ఏమిటనేది .. లావణ్య త్రిపాఠి పాత్ర ఏమిటనేది ప్రేక్షకులకు అర్థమైపోయింది. శవాలను మోసుకెళ్లే వాహనాన్ని నడిపే డైవర్ పాత్రలో కార్తికేయ .. భర్తను కోల్పోయిన యంగ్ విడోగా లావణ్య త్రిపాఠి కనిపించారు. ఈ రెండూ మింగుడుపడని అంశాలతో దర్శకుడు ఎలా ఒప్పిస్తాడా అని అంతా అనుకున్నారు. అంతలో ఆయన అనసూయ పాటను వదిలాడు. ఈ పాటలో ఆమె నాలుగు మాస్ మాటలు చెబుతుందని అనుకుంటే, మాస్ స్టెప్పులు మాత్రమే వేసి .. జీవితమంటే ఇంతే అబ్బాయ్ అనవసరంగా హైరానా పడకు అనే సత్యాన్ని చాటిచెప్పింది.

పాలు .. నీళ్లు కలిసినట్టుగా పాలు .. నూనె కలవలేవు. అలాగే తత్త్వం .. శృంగారం ఒకే ఒరలో ఇమడవు .. ఒకదారిలో నడవవు. అనసూయ చెప్పిందేంటి? చేసిందేంటి? అనే ఆలోచన రెండు రోజుల వరకూ ప్రేక్షకులను వెంటాడింది. ఇక కెరియర్ ఆరంభం నుంచి పద్ధతికి పట్టుచీర కట్టినట్టు కనిపిస్తూ వచ్చిన ఆమనితో మందు కొట్టించేసరికి, ఈ కొత్తదనం ధాటికి తట్టుకోవడం కష్టమే అనుకున్నారు. ఇలా దర్శకుడు కథ మొదటి దగ్గర నుంచి చివరివరకూ సాహసాలను .. ప్రయోగాలను పెనవేస్తూ వెళ్లాడు. 'ప్రసాదమైనా .. ఔషధమైనా కొద్దిగానే తీసుకోవాలి' అని అదేదో సినిమాలో రజనీకాంత్ చెప్పిన మాట ఆ సమయంలో తప్పకుండా గుర్తుకు వస్తుంది. పాపం ఈ సినిమాతో హిట్టును ఇంటిముందు కట్టేసుకోవాలనుకున్న కార్తికేయకు నిరాశే మిగిలింది.