Begin typing your search above and press return to search.

'కార్తికేయ 2' అన్వేషణ ఇలా కొనసాగుతోంది..!!

By:  Tupaki Desk   |   24 March 2022 2:30 PM GMT
కార్తికేయ 2 అన్వేషణ ఇలా కొనసాగుతోంది..!!
X
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ 'కార్తికేయ'. 2014లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ''కార్తికేయ 2'' సినిమా తెరకెక్కుతోంది.

కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా ఈ మిస్టరీ థ్రిల్లర్ ని రూపొందిస్తున్నారు. దీని కోసం ఇండియాలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో షూటింగ్ జరిపారు. అయితే తాజా షెడ్యూల్ చిత్రీకరణ స్పెయిన్ లో ప్రారంభమైంది. ఈ విషయాన్ని వెల్లడించిన మేకర్స్.. అక్కడి లొకేషన్స్ లో తీసుకున్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫొటోలో దర్శకుడు చందు మొండేటి - హీరో నిఖిల్ లతో పాటుగా సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని కూడా కనిపిస్తున్నారు. ముగ్గురూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో స్టైలిష్ గా ఉన్నారు. ఈ సందర్భంగా కోల్పోయిన నగరంలో 'కార్తికేయ-2' అన్వేషణ కొనసాగుతోందని.. ఎక్సోటిక్ లొకేషన్స్ లో భారీ షూటింగ్ జరుగుతోందని మేకర్స్ తెలిపారు.

'కార్తికేయ 2' అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తి కలిగించారు. ఈ వారం మరికొన్ని అద్భుతమైన అప్డేట్లు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నారు. మొదటి భాగానికి మించి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అధిక బడ్జెట్ తో ఈ సినిమా తీస్తున్నారు.

ఇందులో నిఖిల్ సరసన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది.

టీజీ విశ్వప్రసాద్ - అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభోట్ల‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు.