Begin typing your search above and press return to search.

ఓటీటీలో `కార్తికేయ 2` సంద‌డి ఎప్ప‌టి నుంచో తెలుసా?

By:  Tupaki Desk   |   11 Sep 2022 3:18 AM GMT
ఓటీటీలో `కార్తికేయ 2` సంద‌డి ఎప్ప‌టి నుంచో తెలుసా?
X
యంగ్ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్, కేర‌ళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంట‌గా న‌టించిన చిత్రం `కార్తికేయ 2`. చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ను టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌ రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. కాల భైరవ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ఎన్నో అడ్డంకుల‌ను ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎట్ట‌కేల‌కు ఈ చిత్రం ఆగ‌స్టు 13న తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్త‌డంతో.. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌తో బీభ‌త్సం సృష్టిస్తోంది.

విడుద‌లై నెల రోజులు కావొస్తున్నా ఇంకా స్టడీగా జోరు చూపిస్తూ బాక్సాఫీస్ వ‌ద్ద న‌యా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటోంది. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 32 కోట్ల‌కు పైగా షేర్ ను రాబ‌ట్టిన ఈ చిత్రం.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 56 కోట్ల‌కు పైగా షేర్ ను వ‌సూల్ చేసి బ‌య్య‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు భారీ లాభాల‌ను అందించింది. నిఖిల్ కెరీర్‌లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా `కార్తికేయ 2` నిలిచింది.

అలాగే తెలుగులో మీడియం రేంజ్ సినిమాల‌లో అత్య‌ధిక లాభాల‌ను తెచ్చిన రెండో సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. ఇక‌పోతే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించి గ‌త కొద్ది రోజుల నుంచి ర‌క‌ర‌కాల వార్త‌లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఆగ‌స్టు ఆఖ‌రిలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంద‌ని వార్త‌లు వ‌చ్చినా.. థియేట‌ర్స్ లో కార్తికేయ 2 అద్భుతంగా ప‌ర్ఫామ్ చేయ‌డంతో అలా జ‌ర‌గ‌లేదు. అయితే లేటెస్ట్ స‌మ‌చారం ప్ర‌కారం.. ఈ మూవీ ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంద‌ట‌.

`కార్తికేయ 2` డిజిట‌ల్ స్ట్రీమింగ్ రైట్స్ ను జీ5 సాలిడ్ ధ‌ర‌కు ద‌క్కించుకుంది. అయితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న‌ స్ట్రీమింగ్ చేసేందుకు జీ5 వారు స‌న్నాహాలు చేస్తున్నార‌ట‌. అప్ప‌టికి థియేట్రికల్ రన్ దాదాపు ముగింపుకు చేరుకుంటుంద‌ని భావించే.. ఆ తేదీని ఖ‌రారు చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌ట‌క‌నతో పాటు ఓటీటీ ట్రైల‌ర్ ను కూడా బ‌య‌ట‌కు వ‌ద‌ల‌నున్నార‌ని టాక్ న‌డుస్తోంది.