Begin typing your search above and press return to search.

ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే సినిమా ఇచ్చాడు

By:  Tupaki Desk   |   16 Dec 2018 7:16 AM GMT
ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే సినిమా ఇచ్చాడు
X
దక్షిణాదిన దర్శకుడిగా మారే ప్రతి వ్యక్తికీ సూపర్ స్టార్ రజనీకాంత్‌ తో సినిమా చేయాలన్న ఆశ ఉంటుంది. ఐతే ఈ అవకాశం అందరికీ దక్కదు. స్టార్ స్టేటస్ సంపాదించిన దర్శకులకు సైతం రజనీతో సినిమా చేయడం కలగానే మిగిలిపోయింది. అలాంటిది కేవలం నాలుగు సినిమాల అనుభవంతో సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే గొప్ప అవకాశం దక్కించుకున్నాడు యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ‘పిజ్జా’.. ‘జిగర్ తండా’ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన అతను.. రజనీతో ‘పేట్ట’ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఇంత త్వరగా ఇలాంటి అవకాశం దక్కడం నమ్మలేకపోతున్నానని కార్తీక్ చెప్పాడు. రజనీ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకుందామని అనుకుంటే ఊహించని విధంగా తనకు ఆయనతో సినిమా చేసే అవకాశం దక్కినట్లు అతను వెల్లడించాడు.

కార్తీక్ తొలి సినిమా రిలీజయ్యాక మధురైలో ఒక థియేటర్ దగ్గర ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూద్దామని తాను.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన బాబీ సింహా కలిసి కార్ లో వెళ్తుండగా.. చెన్నైలోని ఒక ల్యాండ్ లైన్ నుంచి కాల్ వచ్చిందని.. ఫోన్ తీస్తే రజనీ సార్ మాట్లాడతారని అన్నారని.. ఐతే తన స్నేహితులెవరో తనను ఏడిపించడానికి ఫోన్ చేశారని తాను అనుకున్నానని కార్తీక్ చెప్పాడు. ఐతే నిజంగానే రజనీ సార్ ఫోన్ తీసుకుని సినిమా చాలా బాగా చేశావంటూ అభినందించడంతో షాక్ తిన్నానని చెప్పాడు కార్తీక్. ఆ తర్వాత తాను ‘జిగర్ తండా’ తీశానని.. ఆ సినిమాను రజనీకి చూపించాలనుకున్నానని.. ‘జిగర్ తండా’లో ఓ పాత్ర చేసిన కరుణాకరన్‌ రజనీతో అప్పటికి ‘లింగ’ చేస్తుండటంతో రజనీకి సినిమా చూపించాలనుకుంటున్నట్లు చెబితే... ఆయన ఆల్రెడీ చూశారని తెలిసిందని.. అతడి ద్వారా తర్వాత ఆయన్ని కలిశానని కార్తీక్ వెల్లడించాడు.

ఆ సందర్భంగా ఈ చిత్రంలో విలన్ పాత్ర తీర్చిదిద్దడానికి రజనీనే స్ఫూర్తి అని చెబితే.. నేనే స్ఫూర్తి అయితే ఆ పాత్ర నాకే ఇచ్చి ఉండొచ్చు కదా అని రజనీ అన్నాడని చెప్పాడు. ఆ రోజు తాను రజనీతో ఫొటో మాత్రమే తీసుకుని వచ్చేశానని.. కానీ ఆటోగ్రాఫ్ తీసుకోలేదని.. కేవలం దాని కోసమే మళ్లీ షూటింగ్ స్పాట్‌ కు వెళ్లి తన డైరీని రజనీ దగ్గరికి పంపించానని.. కానీ ఆయన అప్పటికి ఖాళీగా ఉండటంతో తనను కలవాల్సిందిగా చెప్పారన్నాడు. ఆ సందర్భంగా మాట్లాడుతుండగా.. ఏదైనా స్క్రిప్టు ఉందా అన్నారని.. ఆయన నుంచి ఆ మాట ఆశించలేదని.. తర్వాత వెళ్లి ‘పేట్ట’ కథ చెప్పానని.. ఆయనకు నచ్చిందని.. ఐతే వేరే కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా ఆలస్యమైందని.. మధ్యలో రజనీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో ఇక తన సినిమా అటకెక్కిందనుకున్నానని.. కానీ అదృష్టం కొద్దీ ఈ సినిమా పట్టాలెక్కిందని చెప్పాడు కార్తీక్.